యువ హీరోలదే ఆ బాధ్యత
close
Updated : 24/09/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యువ హీరోలదే ఆ బాధ్యత

సినీ ప్రయాణం ఆరంభమై పుష్కర కాలమైనా... ఓ కొత్త హీరోలా ప్రేమకథల్లో ఒదిగిపోతుంటారు నాగచైతన్య. ఆయన ప్రేమకథ చేసిన ప్రతిసారీ విజయం పలకరిస్తుంటుంది. ఈసారి అగ్ర దర్శకుడు శేఖర్‌ కమ్ములతో జట్టు కట్టారు. ఆ కలయికలో రూపొందిన చిత్రమే ‘లవ్‌స్టోరి’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు నాగచైతన్య. ఆ విషయాలివీ... 

‘‘మంచి కథని చెబితే ప్రేక్షకులు థియేటర్‌కి తిరిగి వస్తారని నమ్మకం. తొలి దశ కరోనా తర్వాత అదే ట్రెండ్‌ కనిపించింది. ఇప్పుడూ అదే జరుగుతుందనే నమ్మకంతో ఉన్నాం. కుటుంబాలు బయట తిరుగుతున్నాయి. థియేటర్లలోనే అంతగా కనిపించడం లేదు. రెండేళ్లుగా పరిశ్రమ చాలా ఇబ్బంది పడుతోంది. పరిశ్రమ రీఛార్జ్‌ అవ్వాలి. పరిశ్రమ కోసమైనా విజయాలు రావాలి. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చాలా బాగా అవుతున్నాయి. ఓవర్సీస్‌లోనూ అదే ట్రెండ్‌ కనిపిస్తోంది’’.   

* ‘‘మధ్య తరగతి కుర్రాడిగా నటించడం, తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పడం... ఇదంతా శేఖర్‌ కమ్ముల సలహాలతోనే సాధ్యమైంది. చిత్రీకరణ మొదలయ్యే ముందు రెండు మూడు నెలలు కూర్చుని, తెలంగాణ యాస ప్రాక్టీస్‌ చేశాం. నిజామాబాద్‌ జిల్లా, ఆర్మూర్‌ పరిసరాల్లో చిత్రీకరణ చేయడం నాకు మేలయ్యింది. అక్కడి పరిస్థితుల్ని చూసి కొన్ని విషయాల్ని నేర్చుకున్నా. తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పడానికి నాకు చాలా సమయం దొరికింది. చిత్రీకరణ పూర్తయ్యాక ఏడెనిమిది నెలల విరామం వచ్చింది. సమయం దొరకడంతో పతాక సన్నివేశాల్ని మరింత బాగా తీర్చిదిద్దాం’’.  

* ‘‘నా తొలి ప్రాధాన్యం తెలుగు సినిమాకే. అనుకోకుండా నాకు ‘లాల్‌సింగ్‌ చద్దా’తో ఆమిర్‌ఖాన్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. అలాంటి అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా చేస్తా. ఆమిర్‌ ఖాన్‌తో ప్రయాణం మరిచిపోలేనిది. ఆయన నా గురించి ఇటీవల వేడుకలో చెబుతుంటే అంతా మేజికల్‌గా అనిపించింది. నేను నాలాగే ఉన్నా. అదే ఆయనకి నచ్చింది. ఈ 12 యేళ్లలో నటుడిగా ఎంత నేర్చుకున్నానో,  అంతకంటే ఎక్కువగా 45 రోజులు ఆయనతో ఉంటూ నేర్చుకున్నా’’. 

* ‘‘నేను ప్రేమకథ చేసిన ప్రతిసారీ ప్రేక్షకులు చాలా బాగా ప్రోత్సహిస్తుంటారు. స్వతహాగా నాకూ మానవీయ భావోద్వేగాల నేపథ్యంలో సినిమాలు చేయడం ఇష్టం. ఓటీటీ వేదికల వల్ల మార్పు అయితే బలంగా ఉంది. వాణిజ్య ప్రధానమైన కథలతో స్టార్‌ హీరోలు మినహా మిగతా ఎవరు సినిమాలు చేసినా ప్రేక్షకులు స్వీకరించడం లేదు. యువతరం హీరోలు కొత్త తరహా కంటెంట్‌తోనే ప్రయాణం చేయాలి. అది మాపై ఉన్న ఓ బాధ్యత’’. 

* ‘‘సోగ్గాడే చిన్నినాయనా’ అంటే ఇష్టం. ఆ ఫ్రాంచైజీ అలా కొనసాగాలనేది నా అభిప్రాయం. ‘బంగార్రాజు’లోనూ అవే పాత్రలు కనిపిస్తాయి కానీ, కథ కొత్తగా ఉంటుంది. ‘బంగార్రాజు’తోపాటు, అమెజాన్‌ ప్రైమ్‌కి ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నా. అది హారర్‌ తరహా సిరీస్‌. నేను వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రలో కనిపిస్తా. అలాగే ‘థ్యాంక్‌ యూ’ పది రోజులు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఆ తర్వాత సినిమాల కోసం కథలు వింటున్నా. ‘నాంది’ దర్శకుడు విజయ్‌ కనకమేడల కథ చెప్పాడు. దాని గురించి చర్చలు జరుగుతున్నాయి’’. 

* ‘‘ఇప్పుడు ట్రెండ్‌ మారుతోంది. నిజాయతీ, వాస్తవికత ఉన్న కథల్నే ఇష్ట  పడుతున్నారు ప్రేక్షకులు. వాళ్లు చూస్తారా లేదా? అని ఆలోచిస్తూ మనకు మనమే ఒక తరహా కథలకి, సినిమాలకి పరిమితమైతే కష్టం. ఈమధ్య సుకుమార్‌ను కలిసినప్పుడు దీని గురించే మాట్లాడుకున్నాం. ఇలాంటి సినిమాలే చేయాలని ఆయన చెప్పారు. ‘రంగస్థలం’ ప్రేక్షకుల అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకునే తీశానని చెప్పారు. నేను కథకి కనెక్ట్‌ అయిపోతే దాని కోసం ఎంత దూరమైనా వెళ్లాలనిపిస్తుంది. ‘లవ్‌స్టోరీ’తో నటుడిగా చాలా తృప్తిగా ఉన్నా. ప్రేక్షకుల్ని ఈ సినిమాని చూడండని గర్వంగా చెబుతా’’. 

‘‘శేఖర్‌ కమ్ముల సున్నితమైన అంశాల్ని స్పృశిస్తుంటారు. ఇందులో కులం, లింగ వివక్షతకి సంబంధించిన అంశాల్ని స్పృశించారు. మన సమాజంలో ఇలాంటి విషయాల గురించి మాట్లాడాలంటే అందరం భయపడుతుంటాం. కొన్ని ఆర్టికల్స్‌ చదివినప్పుడు ఇబ్బందిగా అనిపించింది. మనం ఇలాంటి విషయాలు మాట్లాడటానికి ఇష్టపడం ఎందుకు అనిపించింది. నిజంగా ఒక సినిమా ద్వారా ఇలాంటివి చెబితే బాగుంటుంది కదా అనిపించింది. శేఖర్‌ కమ్ముల ఈ కథ చెప్పగానే నాకు నచ్చింది. ఇదొక వాస్తవికతతో కూడిన ప్రేమకథ. సినిమా కోసమని ఎలాంటి స్వేచ్ఛ తీసుకోకుండా రేవంత్‌, మౌనిక పాత్రల్ని, వాళ్ల జీవితాల్ని తెరపైకి తీసుకొచ్చారు’’. 

* ‘‘సినిమా విషయంలో శేఖర్‌ కమ్ముల ప్రదర్శించే అంకితభావం, ఆయన నిజాయతీ నేను చాలా తక్కువమందిలో చూశా. నటుడిగా ఆయనతో ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది. శేఖర్‌ సినిమాల్లో కథానాయికల పాత్రలు బలంగా ఉంటాయి. ఇందులో ఏ పాత్ర ఎలా ఉండాలో, అలాగే చూపించారు. సాయిపల్లవి డ్యాన్స్‌లో చక్కటి సహకారం అందించింది. ఆమె పాత్ర ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు దర్శకుడు’’.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని