close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మెరుపు తారలు.... కలల పాత్రలు

కథానాయిక అంటేనే అందం....అదే వాళ్లకు ఆభరణం. ప్రేక్షకులు వాళ్ల నుంచి ఆశించేది కూడా గ్లామరే. అదే పెట్టుబడిగా చిత్రసీమలో స్టార్‌లుగా ఎదిగినవాళ్లు ఎందరో. కానీ పరిస్థితి మారుతోంది. డీగ్లామర్‌ పాత్రల్లోనూ హీరోయిన్లను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీంతో నాయికల ఆలోచనలోనూ మార్పొచ్చింది. అందానికి అవకాశం లేకపోయినా అభినయానికి ఆస్కారం ఉంటే చాలనుకుని రంగంలోకి దిగుతున్నారు కొందరు. ఇంకా వాళ్ల మనసుల్లో పాత్రల గురించిన ఏవో కోరికలు అలానే ఉన్నాయి. మాకూ కొన్ని కలల పాత్రలు ఉన్నాయంటున్నారు మన తెలుగు నాయికలు. మరి ఆ కలల పాత్రల కథేంటో చదివేయండి.


నేను కోరుకున్నది దొరికింది

గ్లామర్‌ పాత్రలే కాదు భిన్నమైన పాత్రలెన్నో పోషించి మెప్పించింది సమంత. ఎక్కువగా నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలకే పెద్ద పీట వేస్తూ దక్షిణాదిలో స్టార్‌ నాయికగా దూసుకుపోతుంది. ఆమె ప్రస్తుతం తన కలల పాత్రలో నటిస్తోంది. సమంత ‘ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2తో డిజిటల్‌ తెరపై అలరించనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటిస్తోంది. దీనిపై ఆమె స్పందిస్తూ..‘‘మంచి కిక్కిచ్చే షోతో వెబ్‌సిరీస్‌లోకి అడుగుపెడుతున్నా. నా డ్రీమ్‌రోల్‌లో నటించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అంటోంది.


నీలాంబరిలా...

చాలా రోజుల తరువాత తెరపై పలకరించడానికి సిద్ధమైంది ప్రియమణి. ‘నారప్ప’లో సుందరమ్మగా, ‘విరాటపర్వం’లో భారతక్కగా అలరించబోతుంది. ఇవి రెండూ విభిన్నంగా కనిపించే పాత్రలే. తెరపై ఇలాంటివే కాకుండా అందరినీ నవ్వించేలా తనకో సినిమా చేయాలని ఉందని చెబుతోందీ ప్రియ. ‘‘రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి లాంటి ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించాలనేది నా కోరిక. ఒక పూర్తి స్థాయి కామెడీ చిత్రమూ చేయాలని ఉంది’’ అని తన డ్రీమ్‌ రోల్‌ గురించి పంచుకుంది ప్రియమణి.


’ఏ మాయ చేసావె’లాంటి ప్రేమ కథ

నటిగా ఎన్నో పాత్రల్లో నటిస్తుంటాం. అలా కాకుండా చిరస్థాయిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్రలో తెరపై వెలగాలని ఉందంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ‘‘డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అంటే ఒక సినిమా చేయాలి. ఆ పాత్రను ప్రజలు సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకోవాలి. ‘ఏ మాయ చేసావె’ లాంటి ప్రేమకథలో నటించాలి. నాయికా ప్రాధాన్య చిత్రాల గురించి నేనెప్పుడూ ఆలోచించను. వాటి గురించి ప్రణాళికలు కూడా లేవు. కానీ కథలు వస్తే తప్పకుండా చేస్తా’’ అంటోంది రకుల్‌.


చేసేదాన్ని ఇష్టపడాలి

సరికొత్త పాత్రలు ఎప్పుడూ సవాళ్లను విసురుతుంటాయి. ఇవి నటిలో దాగి ఉన్న ప్రతిభను ఆవిష్కరిస్తుంటాయి. అందుకే ఎప్పుడూ కొత్త పాత్రల్లో కనిపించడానికి ఇష్టపడతానని చెబుతోంది తమన్నా. ‘నాకు డ్రీమ్‌ రోల్‌ అంటూ ఏమీ లేదు. ‘బాహుబలి’, ‘ఊపిరి’ ఇలా ఏ సినిమాలోనైనా సరే నాకు వైవిధ్యమైన పాత్రలు పోషించడానికి అవకాశాలు వస్తున్నాయి. నేను ఇలాంటి వాటిలో నటించడానికి చాలా ఆతృతగా ఉంటా. అదే సమయంలో మనం ఏది చేస్తున్నామో ఆ పాత్రను ఇష్టపడాలి’’ అని చెబుతోంది తమన్నా.


‘మహానటి’లో కీర్తిలా

ఇప్పుడు నాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల సందడి పెరుగుతోంది. ఇలాంటి సినిమాలోనే నటించాలని కోరికగా ఉందంటోంది మెహ్రీన్‌. ‘‘ఇప్పుడు నాయికలు ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. అలాంటివాటిలో ‘మహానటి’ ఒకటి. అలాంటి ఓ సినిమాలో కీర్తిసురేష్‌ పోషించిన తరహా పాత్రను చేయాలనేది నాకోరిక’’ అని చెప్పింది మెహ్రీన్‌.


నన్ను ద్వేషించాలి

‘నిన్ను కోరి’, ‘జెంటిల్‌మెన్‌’, ‘బ్రోచేవారెవరురా’ తదితర సినిమాలతో నిరూపించుకుంది నివేదా థామస్‌. ఆమెకు అందరూ మెచ్చేలా కాకుండా, అందరూ ద్వేషించేలా ఒక పాత్ర చేయాలని ఉందట. ‘‘మీరు నమ్ముతారో లేదో.. నాకైతే విలన్‌గా నటించాలని ఉంది. అలాంటి పాత్రల గురించి ఎన్ని ఆలోచనలు వస్తుంటాయో. నన్ను అందంగా, మంచి అమ్మాయిగానే చూస్తున్నారు. అందుకు భిన్నంగా అందరూ ద్వేషించే చెడ్డ అమ్మా కనిపించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా’’ అంది నివేద.


విలన్‌గానూ సిద్ధమే

కథానాయిక శ్రుతిహాసన్‌కు సంగీతం అంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. సంగీతంలో ఎప్పుడూ ఏదో కొత్తగా నేర్చుకుంటూ ఉంటుంది. జీవితంలోనే కాదు తెరపైనా ఇలాంటి పాత్రలో కనిపించాలని శ్రుతి కోరిక. దీని గురించి ఆమె మాట్లాడుతూ... ‘నాకు డ్రీమ్‌ రోల్‌ అంటూ ఏమీ లేదు. ఒక మ్యూజీషియన్‌ పాత్ర చేయాలని మాత్రం ఉంటుంది. ఒక బలమైన పాత్ర వస్తే తెరపై నెగెటివ్‌ పాత్రలో కనిపించడానికి సిద్ధం’’ అని చెప్పింది శ్రుతి.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.