close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పండగ సంబరం..ప్రచార పర్వం

కొత్త సినిమాను వెండితెరపై చూపించాలన్నా.. కొత్త చిత్రాలు పట్టాలెక్కించాలన్నా.. జోరుగా హుషారుగా ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించాలన్నా.. పండగ రోజును మించిన శుభతరుణం మరొకటి దొరకదు. అందుకే పండగలు, పర్వదినాలు వస్తున్నాయంటే చాలు.. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు పక్కా ప్రణాళికలతో సిద్ధమైపోతుంటారు సినీ తారలు. కొత్త చిత్రాల్ని పట్టాలెక్కించడమో.. నయా లుక్కులు, టీజర్లతో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించడమో చేస్తుంటారు. ఇక విజయానికి ప్రతీకగా నిలిచే దసరా వచ్చిందంటే పరిశ్రమలో కనిపించే సందడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ పండక్కి పలు కొత్త చిత్రాల ప్రకటనలతో పాటు ఫస్ట్‌లుక్‌లు, టీజర్ల సందడితో సినీసీమలో దసరా సంబరాలు అంబరాన్ని తాకాయి.

ముహూర్తాలు కుదిరాయి..
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘క్రాక్‌’ చిత్రం విజయదశమి సందర్భంగా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు.. చిత్ర బృందం ఓ కొత్త పోస్టర్‌ ద్వారా తెలియజేసింది. ఈ ప్రచార చిత్రంలో రవితేజ తన జోడీ శ్రుతిహాసన్‌తో కలిసి స్టైలిష్‌గా స్టెప్పేస్తూ దర్శనమిచ్చారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం.. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. కథానాయకుడు రామ్‌ నటించిన ‘రెడ్‌’ చిత్రం ఈ ముగ్గుల పండక్కే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. స్రవంతి రవికిషోర్‌ నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కరోనా పరిస్థితులతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు విజయదశమి సందర్భంగా ప్రకటించారు. ఇక అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, నితిన్‌ ‘రంగ్‌ దే’ పెద్ద పండగ బరిలోనే పోటీ పడబోతున్నాయి. విజయ దశమి సందర్భంగా ఈ రెండు చిత్ర బృందాలు తమ కొత్త ప్రచార చిత్రాల్ని విడుదల చేశాయి.ముఖ్యంగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ టీజర్‌తో అఖిల్‌ నవ్వులు పూయించారు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది.

 

శ్రీకారం చుట్టుకున్నాయి..
నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్‌, హర్షిత్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయదశమి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. శర్వానంద్‌ హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఆదివారం తిరుపతిలో లాంఛనంగా ప్రారంభమైంది. రష్మిక నాయిక. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘మత్తు వదలరా’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి. ఇప్పుడాయన తన రెండో చిత్రాన్ని నూతన దర్శకుడు మణికాంత్‌తో చేయబోతున్నారు. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు రాజమౌళి క్లాప్‌ నిచ్చారు ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్క్రిప్ట్‌ అందించారు. చిత్ర శుక్ల, మిషా నారంగ్‌ నాయికలుగా నటిస్తున్నారు. కాలభైరవ స్వరాలందిస్తున్నారు. ఇక సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం ‘కోతికొమ్మచ్చి’ కూడా ఆదివారమే పట్టాలెక్కింది. మేఘాంశ్‌ శ్రీహరి, సమీర్‌ వేగేశ్న కథానాయకులుగా నటిస్తున్నారు. మేఘ, రిద్ధి నాయికలు. ఎం.ఎల్‌.వి సత్యానారాయణ నిర్మాత. నాని, దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ కలయికలో తెరకెక్కనున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. దీన్ని డిసెంబరు నుంచి పట్టాలెక్కించబోతున్నట్లు చిత్ర బృందం దసరా సందర్భంగా ప్రకటించింది. ఇందులో నాయికలుగా సాయిపల్లవి, క్రితి శెట్టిలను ఖరారు చేశారు. రాజీవ్‌, రంగస్థలం మహేష్‌, రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో శివ వరప్రసాద్‌.కె దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సుధాకర్‌ రెడ్డి.ఎమ్‌ నిర్మాత. కోటి సంగీతమందిస్తున్నారు. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ‘మేరా నామ్‌ జోకర్‌’ పేరుతో తెలుగులో ఓ చిత్రం తెరకెక్కనుంది. సూర్యగోపాల్‌ దర్శకుడు. శివ ఎన్‌, ఎస్‌.జి.కృష్ణ, నవీన్‌ నిర్మాతలు. విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్‌ నిచ్చారు.

‘పవర్‌’ఫుల్‌ ధమాకా
విజయదశమి వేళ పవన్‌ కల్యాణ్‌ నుంచి మరో కొత్త కబురు అందింది. ఆయన హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ఆదివారం ప్రకటించారు. సాగర్‌.కె.చంద్రను దర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలియజేశారు. ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ చిత్రంలో పవన్‌ శక్తిమంతమైన పోలీస్‌ అధికారికగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూర్చనుండగా.. ప్రసాద్‌ మూరెళ్ల ఛాయాగ్రాహకుడిగా పనిచేయబోతున్నట్లు తెలియజేశారు. ఇందులో రానా మరో కథానాయకుడిగా నటించనున్నట్లు తెలుస్తోంది.

లుక్కు కిక్కు
దసరా పండగ వేళ పలువురు యువ కథానాయకులు తమ కొత్త జోడీలతో ప్రేక్షకులకు కనులవిందు అందించారు. శర్వానంద్‌, ప్రియాంక అరుళ్‌మోహన్‌ జంటగా కిశోర్‌.బి దర్శకత్వంలో ‘శ్రీకారం’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. విజయదశమి సందర్భంగా ఈ చిత్రం నుంచి శర్వా, ప్రియాంకల కొత్త లుక్‌ను విడుదల చేశారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. దసరా కానుకగా ఈ చిత్రం నుంచి చైతూ, సాయిపల్లవిల కొత్తలుక్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో చైతూ.. సాయిపల్లవి కాలుకి పట్టీలు పెడుతూ కనిపించారు. హీరో సుశాంత్‌ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రం నుంచి ఓ కొత్త లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. కథానాయకుడు కల్యాణ్‌ దేవ్‌ ‘సూపర్‌ మచ్చి’ చిత్రం నుంచి తన జోడీ రచిత రామ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ‘క్రాక్‌’ తర్వాత రవితేజ కథానాయకుడిగా నటించనున్న చిత్రం ‘ఖిలాడి’. దసరా కానుకగా ఈ చిత్రం నుంచి రవితేజ కొత్త లుక్‌ను విడుదల చేశారు. దసరా వేళ ‘గోల్డ్‌మెన్‌’గా ప్రేక్షకుల్ని పలకరించారు హాస్య కథానాయకుడు సంపూర్ణేష్‌బాబు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు కొత్త లుక్‌ ద్వారా తెలియజేశారు. ‘జాంబిరెడ్డి’ చిత్రం నుంచి నాయిక ఆనందిని అపర కాళిక అవతారంలో ప్రేక్షకులకు చూపించారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.