close
ఇంటర్వ్యూ
హీరోయిన్‌ కాకపోయుంటే పాఠాలు చెప్పేదాన్ని!

కథానాయికలు చాలామందే ఉంటారు... వాళ్లలో నటులు అరుదుగానే కనిపిస్తారు. నివేదా థామస్‌ మంచి నటి అనదగ్గ కథానాయిక. నివేదా ఉందంటే సినిమా చూడాల్సిందే అనే స్థాయిలో ఆమె ప్రేక్షకులపై ప్రభావం చూపుతోంది. ‘జెంటిల్‌మెన్‌’తో తెలుగులో ఆమె ప్రయాణం మొదలైంది. ‘నిన్ను కోరి’, ‘జై లవకుశ’, ‘118’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలతో విజయాల్ని అందుకుంది. ఇటీవల రజనీకాంత్‌ ‘దర్బార్‌’లో ఆయనకి కూతురుగా నటించింది. ఈ సందర్భంగా నివేదాని పలకరించగా ఆమె చెప్పిన విషయాలివీ...

* ఒక పక్క కథానాయికగా నటిస్తున్నప్పుడు, మరోపక్క కూతురు పాత్రలొచ్చాయంటే చాలామంది తిరస్కరిస్తుంటారు కదా...?
మీరు నమ్ముతారో లేదో నాకైతే విలన్‌గానూ నటించాలని ఉంది. అలాంటి పాత్రల గురించి ఎన్ని ఆలోచనలు వస్తుంటాయో(నవ్వుతూ). నివేదా అంటే అందంగా, మంచి అమ్మాయిగానే చూస్తున్నారంతా. అందుకు భిన్నంగా... అందరూ ద్వేషించే ఒక చెడ్డ అమ్మాయిగా కనిపిస్తే ఎలా ఉంటుందా? ఆ అవకాశం ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నా.

* నిజ జీవితంలో నివేదా ఎలా ఉంటుంది?
చాలా సాధారణమైన అమ్మాయిని. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగాను. నా ఆలోచనలూ అలాగే ఉంటాయి. చిన్నప్పుడు బయటికెళితే నచ్చిన వస్తువులన్నింటినీ కొనివ్వమని అడిగేదాన్నంట. ‘మన దగ్గర డబ్బు లేదమ్మా’ అని నాన్న చెప్పారంటే ‘పర్లేదులే నాన్నా.. ఉన్నప్పుడు కొందాం’ అని వదిలేసేదాన్నట. అల్లరి చేసేదాన్ని కాదట. ఇప్పుడే ఎక్కువ అల్లరి చేస్తున్నావని ఇంట్లోవాళ్లు చెబుతుంటారు. ‘అది లేదు, ఇది లేదు... నాకది కావాలి’ అని ఇంట్లో బెట్టు చేశానంటే ‘చిన్నప్పుడు అలా ఉండేదానివి. ఇప్పుడేంటి ఇలా మారిపోయావు’ అని గుర్తు చేస్తుంటారు. వాళ్లు అంతగా చెప్పాక ఏం చేస్తాం? (నవ్వుతూ). మనకున్న ఆ ఇమేజ్‌ని పాడు చేసుకోవడం ఎందుకని సర్దుకుపోతుంటా.  ప్రయాణాలంటే ఇష్టం. విహారం కోసం ఎక్కడికైనా వెళితే నచ్చిన ప్రదేశానికి నడుచుకుంటూనే వెళుతుంటా. అక్కడి ఆహారాన్ని రుచి చూస్తా.

* చిన్న వయసులోనే కెమెరా ముందుకొచ్చారు. సినిమాలంటే ఇష్టంతోనా?
అనుకోకుండా అవకాశం వచ్చింది. ఎనిమిదేళ్ల వయసులో బాలనటిగా కెమెరా ముందుకొచ్చా. తొలినాళ్లలో సెట్‌ వాతావరణం చూస్తే భయంగా అనిపించేది. క్రమంగా సినిమాపై ఆసక్తి పెరిగింది. చాలామంది నటులు, సాంకేతిక నిపుణులతో కలిసి ప్రయాణం చేశాక ఇప్పుడు సినిమాని చూసే కోణమే మారింది.

* సినిమా ప్రయాణం చదువులకి ఇబ్బందిగా మారలేదా?
సినిమాల కోసం చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఒక పక్క నటిస్తూనే, మరో పక్క కాలేజీకి వెళ్లేదాన్ని. ఆర్కిటెక్ట్‌ కావాలనుకున్నా. అందులో డిగ్రీ పూర్తి చేశా. సినిమా రంగంలోకి రాకపోయుంటే బహుశా పీహెచ్‌డీ చేసి టీచింగ్‌వైపు వెళ్లేదాన్నేమో. నాకు పాఠాలు చెప్పడమంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తా.

* ‘దర్బార్‌’లో రజనీకాంత్‌కి కూతురుగా నటించారు. ఆ అనుభవాలేంటి?

సెట్లో ఉన్నంతసేపూ రజనీ సర్‌ నాకు నాన్నే. అందుకే మా మధ్య అంత బాగా భావోద్వేగాలు పండాయి. రజనీతో పాటు, కమల్‌, మోహన్‌లాల్‌కీ కూతురిగా నటించడం నాకు మాత్రమే దొరికిన అదృష్టం. వాళ్లతో కలిసి చేసిన ప్రయాణంలో వెలకట్టలేని విషయాలెన్నో నేర్చుకున్నా. నటన గురించే కాకుండా... రజనీ ఆధ్యాత్మిక విషయాల గురించి కూడా చెప్పేవారు. మతంతో సంబంధం లేని, మనిషికి సంబంధించిన విషయాలవీ. అలాగే ఆహారం గురించి మాట్లాడుకునేవాళ్లం.


ఈ ఏడాదీ పండగే

గతేడాది నాకు పండగలాగే గడిచింది. చేసిన సినిమాలు ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఇక ఈ యేడాదేమో పండగతోనే మొదలైంది. నా సినిమాలు సంక్రాంతికి ఎప్పుడూ విడుదల కాలేదు. పండగ సందర్భంగా విడుదలైతే ఎలా ఉంటుందో ‘దర్బార్‌’తో అనుభవంలోకి వచ్చింది. తదుపరి సినిమా ‘వి’ ఉగాదికి రాబోతోంది. ఆ రకంగా ఈ యేడాదీ నాకు పండగే అన్నమాట.


అలాంటి వాళ్లే నచ్చుతారు

జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారని లేదు. అలాగే కచ్చితంగా పెళ్లి చేసుకోవాలనీ లేదు. కానీ ప్రేమ, పెళ్లి అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు. వాటి గురించి మాట్లాడటానికి ఎందుకు తటపటాయించాలి? పెళ్లి చేసుకునే సమయం వస్తే సంతోషంగా చేసుకోవడమే. పెళ్లి గురించి ప్రస్తుతానికి నాకైతే ఎలాంటి ఆలోచనలు లేవు. అబ్బాయిల్లో నిజాలు చెప్పేవాళ్లంటే ఇష్టం (నవ్వుతూ). నా జీవితంలోకి వచ్చే అబ్బాయికి ప్రయాణాలపై మక్కువ ఉండాల్సిందే. భవిష్యత్తులో దర్శకత్వం చేయాలనే కోరిక ఉంది.


వారితో మంచి అనుబంధం

చెన్నైలో పుట్టి పెరిగాను. కానీ ఇప్పుడు చెన్నై, హైదరాబాద్‌ నాకు వేర్వేరుగా అనిపించవు. కొన్నేళ్లుగా నేను హైదరాబాద్‌లోనే ఉంటున్నా. ఇక్కడ చాలా మంది స్నేహితులున్నారు. పండగలంటే వాళ్ల ఇంటికి వెళుతుంటా. అక్కడ జరిగే పూజా కార్యక్రమాల్లోనూ పాల్గొంటా. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి స్నేహితుడు అంటే నాని. మోహనకృష్ణ ఇంద్రగంటి, శ్రీవిష్ణు, వివేక్‌ ఆత్రేయ... వీళ్లందరితోనూ నాకు మంచి అనుబంధం ఉంది.

- నర్సిమ్‌ ఎర్రకోట, ఫొటో: మధు

Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.