close
అప్పటి ముచ్చట్లు
బ్రహ్మానందాన్ని అలా ‘బాదే’శారు

ఇంటర్నెట్‌డెస్క్‌: తనదైన నటనతో ప్రేక్షకులను రంజింప చేసిన హాస్యనటుడు బ్రహ్మానందం. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన ఆయన కామెడీ పండించడం అంత తేలికేం కాదంటారు. చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా ప్రేక్షకుల్ని నవ్వించాలని తన కెరీర్‌లో కూడా ప్రతికూల పరిస్థితులు చాలా వచ్చాయని చెబుతారు.

‘‘వివాహభోజనంబు’ సినిమా గుర్తుంది కదా? నాదీ సుత్తి వీరభద్రరావుగారిదీ ఓ సెపరేట్‌ ట్రాక్‌. మా ఇద్దరి మధ్యా విశాఖపట్నం బీచ్‌లో ఓ సన్నివేశం తీశారు. తలవరకూ నన్ను భూమిలో పాతిపెట్టి.. ‘హైదరాబాదు... అదిలాబాదు.. సికిందరాబాదూ..’ అంటూ మొత్తం ఇరవై ఒక్క బాదులతో సుత్తి వీరభద్రరావు నన్ను బాదేసే సన్నివేశం అది. నేనేమో ఆ గోతిలోనే ఉండి రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వాలి. సాధారణంగా ఇలాంటి సన్నివేశాల్లో చిన్న చిన్న ట్రిక్కులు ప్లే చేస్తుంటారు. నిజంగా పాతిపెట్టకుండా.. ఓ చెక్కపెట్టెలో మమ్మల్ని నిలబెట్టి.. చుట్టూ మట్టి పేరుస్తారు. కానీ ఆరోజు నన్ను నిజంగానే పాతేశారు. సరిగ్గా ఆ సమయానికి ఓ కుక్క అటువైపుగా వస్తోంది. దాన్ని చూసి వెంటనే జంధ్యాల గారు ‘‘ఏ ఊరకుక్కయినా దగ్గరకొచ్చి కాలెత్తితే పావనమైపోతుంది మహాప్రభో’’ అనే డైలాగ్‌ అప్పటికప్పుడు రాశారు.

ఆ సన్నివేశం చూసి జనాలు ఇప్పటికీ నవ్వుకుంటుంటారు గానీ, ఆ రోజు నా తిప్పలు అన్నీ ఇన్నీ కావు. కాళ్లూ, చేతులు కదపకుండా కేవలం ముఖ కవళికలే ప్రదర్శించడం అంత తేలికైన విషయం కాదు. పైగా.. మిట్టమధ్యాహ్నం ఎండ సుర్రుమంటుంది. అదేంటో నిజంగానే ముక్కు తెగ దురద పెట్టింది. నేనా గోక్కోలేను. ఎవరినైనా పిలిచి ‘సార్‌... కాస్త గోకి పెట్టరూ..’ అని అడగలేను. ‘ఈ సీన్‌ ఎప్పుడైపోతుంది భగవంతుడా’ అనుకున్నానంటే నమ్మండి. సీన్‌ అవ్వగానే... నన్ను అలానే వదిలేసి అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ‘మహానుభావా.. నన్ను ఈ గోతులోంచి తీసేదేమైనా ఉందా’ అంటూ గట్టిగా అరిస్తే... టీమ్‌లో ఎవరో వచ్చి నన్ను బయటకు లాగారు. ఈ విషయం ఎప్పుడు తలచుకున్నా నవ్వొస్తుంటుంది’’ అంటూ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.