ఇదీ హీరోయిజమే డ్యూడ్‌
close
Published : 07/04/2021 04:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇదీ హీరోయిజమే డ్యూడ్‌

‘‘కొత్త కథలంటూ ఉండవు. తెలిసిన కథల్ని కొత్తగా చెప్పడమే ముఖ్యం’’ అనే మాటల్ని  దర్శకనిర్మాతల నోటి నుంచి తరచూ వింటుంటాం. ఆ అభిప్రాయాలకి తగ్గట్టుగానే... కొత్త హంగులతో పాత కథలు ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. ఆ కథలు ఎలా ఉంటాయో, హీరో పాత్రలు ఎలా సాగుతాయో ముందే ఓ అంచనాకి వచ్చేస్తుంటారు ప్రేక్షకులు. మరి నిజంగానే కొత్త కథలు లేవా? తరచి చూడాలి కానీ చాలానే దొరుకుతాయని నిరూపిస్తోంది యువతరం. కొన్నాళ్లుగా వాస్తవ కథల్ని తెరపైకి తీసుకొస్తూ మన సినిమా గమనాన్నే మార్చేస్తున్నారు యువ దర్శకులు, రచయితలు. తాజాగా కొత్త రకమైన కథల్ని వెలుగులోకి తీసుకొస్తూ మరో అడుగు ముందుకేస్తున్నారు. 


అగ్ర తారలు రెడీ

మేజ్‌ గురించి కథానాయకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు... వాస్తవికతతో కూడిన కథలు, పాత్రలు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కథానాయకులు తెరపై ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ ‘ఎఫ్‌3’లో రేచీకటి బాధితుగా కనిపించి నవ్వించనున్నారు. యువ కథానాయకుడు నితిన్‌ ‘అంధాధున్‌’ రీమేక్‌ చిత్రంలో అంధుడిగా   కనిపిస్తారు. యువ హీరోలతో పాటు.. అగ్ర తారలు సైతం సరైన కథలు  దొరికితే, పాత్రల కోసం ఏం చేయడానికైనా సై అంటున్నారు.

ఆరు పాటలు... ఆరు ఫైట్లు కాదు..!

హీరో అంటే ఏ చిన్న లోపం లేకుండా... ఎంతమందినైనా ఒంటిచేత్తో ఎదురించగల ధీరోదాత్తుడు. దాదాపు ప్రతి సినిమాలోనూ హీరో ఇలాగే కనిపిస్తుంటాడు. కథానాయకుడూ మనిషే, అతను మనలో ఒకడే అనే విషయం ఏ పుష్కరానికో వచ్చే ఒకట్రెండు సినిమాలు చూస్తే తప్ప అర్థం కాదు. కానీ కొంతకాలంగా దర్శకులు హీరోయిజాన్ని భూమార్గం పట్టిస్తూ వస్తున్నారు. ఆరు పాటలు, ఆరు ఫైట్లు అనే సూత్రం నుంచి కాకుండా... జీవితాల నుంచి కథల్ని పుట్టిస్తున్నారు. చాలామంది బయటికి చెప్పుకోవడానికి మొహమాటపడే విషయాలతోనూ ఇప్పుడు సినిమా కథల్ని సిద్ధం చేస్తున్నారు. కథానాయకులు అత్యంత సాధారణంగా... మనలో ఒకడిలా కనిపిస్తూ వినోదం పండిస్తున్నారు. ‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌ బధిరుడిగా కనిపించి మెప్పించారు. రవితేజ ‘రాజా ది గ్రేట్‌’లో అంధుడిగా కనిపించి వినోదం పంచారు. ఒంపు సొంపులతో కుర్రాళ్లని మాయ చేసిన అనుష్క... ‘సైజ్‌జీరో’ కోసం బొద్దుగా మారిపోయిన వైనాన్ని చూశాం. మొన్నటికి మొన్న కొత్త హీరో వైష్ణవ్‌ తేజ్‌ తన తొలి చిత్రంలోనే నత్తితో మాట్లాడుతూ సందడి చేశారు. రాబోయే సినిమాల్లో ఓ హీరో బట్టతలతో కనిపిస్తాడు. ఓ హీరో తన పురుషాంగం చిన్నగా ఉందని భయపడుతూ కనిపించనున్నాడు.

తెలుగు సినిమాలో హీరో బట్టతలతో కనిపిస్తాడంటే ఎవరైనా నమ్ముతారా? మలయాళం, హిందీ సినిమాల్లో తప్ప తెలుగు సినిమాలో అది ఊహించే విషయమేనా? ‘101 జిల్లాల అందగాడు’ సినిమాలో అవసరాల శ్రీనివాస్‌ బట్టతలతో గొత్తి సత్యనారాయణగా కనిపించి వినోదం పంచనున్నారు. దిల్‌రాజు, క్రిష్‌ జాగర్లమూడి సమర్పకులుగా, శిరీష్‌, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కలిసి నిర్మిస్తున్న చిత్రమిది. రాచకొండ విద్యాసాగర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అవసరాల శ్రీనివాస్‌ రచనలో రూపొందిన ఈ చిత్రం మే 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ఏక్‌ మినీ కథ’ పేరుతో రూపొందుతున్న మరో సినిమాలో హీరో తన పురుషాంగం చిన్నగా ఉందని భ్రమపడుతూ, భయపడే కుర్రాడిగా కనిపించబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్‌ అనుబంధ సంస్థ యు.వి.కాన్సెప్ట్స్‌ పతాకంపై ‘ఏక్‌ మినీ కథ’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో సంతోష్‌ శోభన్‌ కథానాయకుడు. దర్శకుడు మేర్లపాక గాంధీ అందించిన కథతో కార్తీక్‌ రాపోలు తెరకెక్కించారు. వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు కాన్సెప్ట్‌లు తెలుగు తెరకి కొత్త. హిందీలో అయితే ఆయుష్మాన్‌ ఖురానా సినిమాల్లో ఈ రెండు అంశాల్ని స్పృశించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని