మాయదారి కరోనా వాయిదాల.. కలవరం
close
Published : 15/04/2021 21:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాయదారి కరోనా వాయిదాల.. కలవరం

 తెలుగు చిత్రసీమలో నిరాశ
పాన్‌ ఇండియా స్థాయి సినిమాల పరిస్థితేంటి?

కొన్ని నెలలుగా ఎక్కడా లేని రీతిలో తెలుగులో కొత్త సినిమాలు విడుదలవుతూ వచ్చాయి. ఏడెనిమిది  సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన శుక్రవారాలూ కనిపించాయి. కరోనా తర్వాత ఎక్కడా ఇన్ని సినిమాలు విడుదల కాలేదని సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని  కీర్తిస్తూ వచ్చిన సినీ వర్గాల్లో ఇప్పుడు కలవరం మొదలైంది. కరోనా ఉద్ధృతితో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తున్నాయి. విడుదల కోసం ముందే తేదీల్ని ఖరారు చేస్తూ కట్చీఫ్‌ వేసుకున్న సినిమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతున్నాయి. గాడిన పడిందనుకున్న చిత్రసీమలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది.

కరోనా తర్వాత థియేటర్లు తెరుచుకున్నా... వంద శాతం కెపాసిటీతో ప్రదర్శనలు మొదలైనా మళ్లీ మునుపటిలా సినిమాలు సందడి చేస్తాయో? లేదో? అనే సందేహాలు వ్యక్తం అయ్యేవి. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ తెలుగు సినిమా దూసుకెళ్లింది. థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపించాయి. రూ. వందల కోట్లు వసూళ్లు వచ్చాయి. రికార్డులూ నమోదయ్యాయి. ఓవర్సీస్‌లోనూ మన సినిమాకి మళ్లీ డాలర్ల వర్షం కురిసింది. ఇది చూసి పొరుగు  పరిశ్రమలు కూడా స్ఫూర్తి పొందాయి. ఉత్సాహాన్ని కూడగట్టుకున్నాయి. అంతలోనే పరిస్థితులు మారిపోయాయి. హీరో ఎంత కొట్టినా చావకుండా ఎదురు తిరిగిన విలన్‌లాగా... కరోనా మళ్లీ పంజా విసరడంతో తెలుగు సినిమా బాక్సాఫీసు మరోసారి కళ తప్పేలా కనిపిస్తోంది.

వరుసగా మూడు చిత్రాలు

‘లవ్‌స్టోరీ’, ‘టక్‌ జగదీష్‌’, ‘విరాటపర్వం’... ఇటీవల వరుసగా విడుదల తేదీల్ని వాయిదా వేసుకున్న చిత్రాలివి. కుటుంబ కథలతో తెరకెక్కడం... వాటి లక్ష్యమైన కేటగిరీ ప్రేక్షకులు థియేటర్లకి వచ్చే పరిస్థితులు కనిపించకపోవడంతో విడుదల తేదీల్ని వాయిదా వేసుకున్నాయి ఆయా చిత్రబృందాలు. పరిస్థితులు చూస్తుంటే ఆ  జాబితాలోకి మరిన్ని చేరేలా కనిపిస్తున్నాయి. మే నెలలో విడుదల కావడమే లక్ష్యంగా పలువురు అగ్ర  కథానాయకుల చిత్రాలు   సిద్ధమవుతున్నాయి. చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేష్‌ ‘నారప్ప’, బాలకృష్ణ ‘అఖండ’, రవితేజ ‘ఖిలాడి’, అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రాలు మే నెలలోనే విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. కరోనా ఉద్ధృతి ఆగలేదంటే ఆ చిత్రాల విడుదల అనుమానమే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. ఉగాది సందర్భంగా బయటికొచ్చిన పలు చిత్రాల పోస్టర్లలో విడుదల తేదీలు కనిపించకపోవడం గమనార్హం.

ఆ చిత్రాలకి ఇంకా కష్టం

తెలుగు చిత్రసీమ పాన్‌ ఇండియా సినిమాలకి కేరాఫ్‌గా మారింది. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్‌’ చిత్రాలు సాధించిన విజయాల తర్వాత తెలుగులో అగ్ర కథానాయకుల చిత్రాలు దాదాపుగా పాన్‌ ఇండియా స్థాయి లక్ష్యంతోనే పట్టాలెక్కుతున్నాయి. నాలుగైదు భాషల్లో ఒకేసారి విడుదల కావల్సిన చిత్రాలవి. ఒకవేళ మన దగ్గర విడుదలకి అనుకూలత ఉన్నా... ఇతర భాషల్లో వాతావరణమూ  కీలకమే.  అందుకే పాన్‌ ఇండియా చిత్రాల్లో ఎప్పుడు ఏది విడుదల తేదీని వాయిదా వేస్తుందో చెప్పలేని పరిస్థితి. రానా కథానాయకుడిగా నటించిన ‘అరణ్య’ పాన్‌ ఇండియా స్థాయి చిత్రమే. హిందీలో ఆ చిత్రం విడుదల కాలేదు. దక్షిణాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేయాలనుకున్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని, అన్ని చోట్లా ఆ సినిమా  విడుదలని వాయిదా వేశారు. ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’, ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ల ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, అల్లు అర్జున్‌ ‘పుష్ప’, విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’, అడవి శేష్‌ ‘మేజర్‌’తోపాటు, దక్షిణాది నుంచి ‘కె.జి.ఎఫ్‌ ఛాప్టర్‌ 2’ చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయి లక్ష్యంగా  విడుదల కానున్నాయి. భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రాలు విడుదల కావాలంటే, ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టాలంటే అన్ని భాషల్లోనూ అనుకూలమైన వాతావరణం ఉండాల్సిందే. మహారాష్ట్రలో గతేడాది నుంచి చాలా చోట్ల థియేటర్లే తెరచుకోలేదు. ఇప్పుడు మళ్లీ అక్కడ ఆంక్షలు మొదలయ్యాయి. తమిళనాడు, కర్ణాటకల్లోనూ యాభై శాతం సీటింగ్‌ కెపాసిటీతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తెలుగులోనూ వసూళ్లు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా రానున్న రోజుల్లో ఈ సినిమాల విడుదలకి గట్టి సవాళ్లే ఎదురు కానున్నాయి. అయితే ఆయా సినీ వర్గాలు    విడుదల సంగతిని పక్కనపెట్టి, సినిమాల్ని ముస్తాబు చేయడంపైనే దృష్టిపెట్టాయి.

చిన్న సినిమాలకి దారి

కరోనా ఉద్ధృతి తగ్గకపోతే మళ్లీ యాభై శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలకి ఆదేశాలు రావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే అధిక వ్యయంతో తెరకెక్కిన చిత్రాలు దాదాపుగా వాయిదా పడతాయి. పరిమిత వ్యయంతో తెర  కెక్కిన సినిమాలకి మాత్రం దారి దొరికినట్టవుతుంది. గతేడాది విడుదల కావల్సిన సినిమాలన్నీ ఈ యేడాది వరుసగా విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. వీటి మధ్య విడుదల కాలేక పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాలు నలిగిపోతున్నాయి. చాలా వరకూ ఓటీటీ వైపు వెళ్లాలనే ఆలోచనలో పడ్డాయి. కానీ పెద్ద సినిమాలు వాయిదా పడుతున్న ఈ పరిస్థితుల్లో వాటికి మంచి దారి దొరికినట్టయింది. ‘లవ్‌స్టోరి’, ‘టక్‌ జగదీష్‌’, ‘విరాటపర్వం’ సినిమాలు విడుదల కావల్సిన ఈ నెల 16, 23, 30 తేదీలపై పలు చిన్న చిత్రాలు కట్చీఫ్‌ వేయడమే ఇందుకు ఉదాహరణ. ‘‘కుటుంబ ప్రేక్షకులు ఇంకా పూరిస్థాయిలో థియేటర్లకి రానే లేదు. కరోనా పూర్తిగా తగ్గిపోయుంటే ఈ వేసవి తర్వాత వాళ్లు థియేటర్లవైపు వచ్చేవాళ్లు. ఇప్పుడు మళ్లీ కరోనా భయాలు పెరగడంతో థియేటర్లకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య బాగా తగిపోయింది. వసూళ్లు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. అందుకే నిర్మాతలు విడుదలల్ని వాయిదా వేస్తున్నార’’ని ఓ నిర్మాత తెలిపారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని