వారెవా.. వార్హోమ్‌
close
Published : 04/08/2021 02:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారెవా.. వార్హోమ్‌

400 మీ. హార్డిల్స్‌లో ప్రపంచ రికార్డుతో పసిడి

టోక్యో

పురుషుల 400మీ. హార్డిల్స్‌లో ప్రపంచ రికార్డులు నమోదు చేసే అలవాటును నార్వే అథ్లెట్‌ కర్‌స్టెన్‌ వార్హోమ్‌ కొనసాగించాడు. తన పేరు మీదే ఉన్న ప్రపంచ రికార్డును టోక్యోలో మెరుగుపరుస్తూ పసిడి పట్టాడు. 46 సెకన్లలోపే రేసు పూర్తి చేసిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. మంగళవారం హోరాహోరీ ఫైనల్లో అతను.. 45.94 సెకన్లలో రేసు పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. బెంజమిన్‌ (అమెరికా- 46.17సె), సాంటోస్‌ (బ్రెజిల్‌- 46.72సె) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. రేసు ముగిశాక తొలి ఏడు స్థానాల్లో నిలిచిన అథ్లెట్లలో ఆరుగురు ఏదో ఒక రికార్డు (జాతీయ లేదా ఖండం) తిరగరాశారు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ వార్హోమ్‌ 35 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ప్రపంచ రికార్డును రెండు సార్లు బద్దలు కొట్టడం విశేషం. ఈ 25 ఏళ్ల అథ్లెట్‌ గత నెల 1న 46.70 సెకన్ల టైమింగ్‌తో తొలిసారి ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

జీన్స్‌.. టీషర్ట్‌.. టైటిల్‌: టోక్యోలో ప్రపంచ రికార్డుతో పురుషుల 400మీ. హార్డిల్స్‌లో ఛాంపియన్‌గా నిలిచిన కర్‌స్టెన్‌ వార్హోమ్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. జీన్స్‌, టీ షర్ట్‌ వేసుకుని తొలిసారి రేసులో పాల్గొనడం దగ్గర నుంచి ఒలింపిక్స్‌ పసిడి వరకూ సాగిన అతని ప్రయాణం ఆసక్తికరం. ఎనిమిదేళ్ల వయసులోనే అతను పరుగు ఆరంభించాడు. ఓ సారి పరుగు పందెంలో పాల్గొనాలని స్నేహితుడు అడగడంతో.. అలాగే జీన్స్‌, టీషర్ట్‌తో పోటీల్లో పాల్గొన్న అతను విజేతగా నిలిచాడు. అప్పటి నుంచే అతనికి పరుగుపై ఆసక్తి మొదలైంది. మొదట్లో 400మీ. హార్డిల్స్‌లో కాకుండా ఆక్టథ్లాన్‌ (8 క్రీడాంశాలు), డెకథ్లాన్‌ (10 క్రీడాంశాలు)లో పోటీపడేవాడు. 2013 ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఆక్టాథ్లాన్‌లో స్వర్ణం కూడా గెలిచాడు. డెకాథ్లాన్‌లోనూ మంచి ప్రదర్శనే చేశాడు. కానీ 2015లో శిక్షణ కోసం ఓస్లోలోని కోచ్‌ లీఫ్‌ దగ్గర వెళ్లడమే అతని కెరీర్‌లో మలుపు. అక్కడి నుంచే అతను కేవలం 400మీ. హార్డిల్స్‌పైనే దృష్టిపెట్టడం మొదలెట్టాడు. 2017లో తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 2019లో మరోసారి ఆ ఘనత సాధించాడు. 2016 రియో క్రీడల్లో సెమీస్‌ వరకూ వెళ్లగలిగిన అతను.. ఈ సారి పసిడి పట్టేశాడు. ఈ సీజన్‌లో పోటీపడ్డ తొలి రేసులో (జులై 1న ఓస్లోలో)నే అతను.. దాదాపుగా 29 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడా రికార్డును మరోసారి దాటాడు. 400 హర్డిల్స్‌లో నమోదైన పది అత్యుత్తమ టైమింగ్స్‌లో వార్హోమ్‌వి నాలుగు ఉండటం విశేషం.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని