లేడీ బోల్ట్‌
close
Published : 04/08/2021 02:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లేడీ బోల్ట్‌

ఈనాడు క్రీడావిభాగం

కొన్ని సెకన్లలోనే విజేతను తేల్చే 100మీ, 200మీ. పరుగులో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. అలాంటి పరుగులో వరుసగా మూడు ఒలింపిక్స్‌ల్లో స్వర్ణాలు నెగ్గిన ఉసేన్‌ బోల్ట్‌ దిగ్గజంగా మారాడు. 2008 నుంచి 2016 ఒలింపిక్స్‌ వరకూ ఈ జమైకా చిరుతకు తిరుగులేదు. ఆ తర్వాత అతను ట్రాక్‌కు వీడ్కోలు పలకడంతో.. టోక్యోలో కొత్త విజేత ఎవరూ? జమైకాకే మళ్లీ పసిడి దక్కుతుందా? లేదా? అనే ఆసక్తి ఏర్పడింది. కానీ పురుషుల 100మీ. పరుగులో ఆ దేశ అథ్లెట్‌ ఒక్కరు కూడా కనీసం ఫైనల్‌ కూడా చేరలేదు. 200మీ. పరుగులోనూ పతకం సాధిస్తారనే ఆశలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో పరుగులో జమైకా వారసత్వాన్ని కొనసాగిస్తూ.. మహిళల 100మీ, 200మీ. పరుగులో 29 ఏళ్ల హెరా విజేతగా నిలిచింది. 2016 రియో క్రీడల్లో సాధించిన టైటిళ్లను ఈ ఆడ పులి ఇప్పుడూ నిలబెట్టుకుంది. రేసుకో కొత్త విజేత పుట్టుకొచ్చే ఇలాంటి పరుగు పోటీల్లో వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లోనూ.. అది కూడా రెండు విభాగాల్లోనూ స్వర్ణాలు గెలవడమంటే అసాధారణమే. ఆ అద్భుతాన్నే అందుకున్న హెరా.. ఇప్పుడు లేడీ బోల్ట్‌గా పేరు సంపాదించుకుంది. జీవించి ఉన్నవాళ్లలో వేగవంతమైన మహిళగా నిలిచిన ఆమె..  టోక్యోలో ఇంకా మహిళల 4×100మీ. రిలేలో పోటీపడనుంది. 

గాయాన్ని దాటి..: బాల్యం నుంచే పరుగుపై ప్రేమ పెంచుకున్న హెరా.. ఆరంభంలో సరైన శిక్షణ లేకపోవడంతో ట్రాక్‌పై రాణించలేకపోయింది. విశ్వ విద్యాలయంలో చేరిన తర్వాతే ఆమె పరుగు మెరుగుపడింది. జమైకాలోని ఎంవీపీ ట్రాక్‌ క్లబ్‌ ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ఫ్రాన్సిస్‌ శిక్షణతో తన పరుగు వేగమందుకుంది. 2013 నుంచి క్రమంగా ట్రాక్‌పై పతకాలు నెగ్గడం మొదలెట్టింది. కోచ్‌ సలహా ప్రకారం మొదట్లో కేవలం 200మీ. పరుగుపై పూర్తిగా దృష్టి పెట్టిన ఆమె.. 2015 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచింది. అదే పోటీల్లో 4×100మీ. రిలే స్వర్ణాన్నీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత 100మీ. పరుగునూ వదల్లేదు. 2016 రియో క్రీడల్లో అంచనాలు లేకుండా బరిలో దిగి రెండు పరుగు విభాగాల్లోనూ ఛాంపియన్‌గా నిలిచి సంచలనం సృష్టించింది. కానీ ఆ తర్వాత కాలి గాయం కారణంగా ఆమె కెరీర్‌ నెమ్మదించింది. వేగం తగ్గింది.  టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఆమె ప్రదర్శనపై అనుమానాలు రేకెత్తాయి. కానీ విశ్వ క్రీడలంటే చాలు దూకుడు ప్రదర్శించే ఆమె.. వాయు వేగాన్ని అందుకుని అత్యుత్తమ ప్రదర్శనతో మరోసారి డబుల్‌ పసిడి సాధించింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని