కథ మారేనా!
close
Published : 04/08/2021 02:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కథ మారేనా!

కోహ్లీసేనకు పరీక్ష

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు నేటి నుంచే

మధ్యాహ్నం 3.30 నుంచి

ఓవైపు ప్రపంచమంతా ఒలింపిక్స్‌ హడావుడిలో ఉండగా.. మరోవైపు భారత క్రికెట్‌ జట్టు చడీచప్పుడు లేకుండా టెస్టు సిరీస్‌ను ఆరంభించేస్తోంది. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో ఢీకొట్టబోతోంది కోహ్లీసేన. బుధవారమే తొలి టెస్టు ఆరంభం. సుదీర్ఘ క్వారంటైన్‌, ప్రాక్టీస్‌ లేమి, గాయాలు భారత్‌ను వెనక్కి లాగుతున్నాయి. గత మూడు పర్యాయాలు ఇంగ్లాండ్‌ గడ్డపై ఘోర పరాభవాలు ఎదుర్కొన్న భారత్‌.. ఈసారైనా కథను మారుస్తుందా?

నాటింగ్‌హామ్‌: ఎప్పుడో 2007లో చివరగా ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌ గెలిచింది టీమ్‌ఇండియా. అంతకుముందు 1971, 1986ల్లో సిరీస్‌లు సాధించింది. మిగతా పర్యటనల్లో ఒక్కసారీ సిరీస్‌ గెలవలేదు. ఈసారి టీమ్‌ఇండియా సరైన స్థితిలో సిరీస్‌ను ఆరంభించట్లేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ కోసం రెండు నెలల కిందటే ఇంగ్లాండ్‌కు చేరుకున్న భారత్‌.. ఆ మ్యాచ్‌కు ముందు, తర్వాత చాలా రోజులు క్వారంటైన్‌లో ఉంది. కౌంటీ సెలక్ట్‌ ఎలెవన్‌తో మూడు రోజుల మ్యాచ్‌ మినహాయిస్తే పెద్దగా ప్రాక్టీస్‌ లేదు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ గాయపడి స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడనుకున్న మయాంక్‌ అగర్వాల్‌ సైతం తొలి టెస్టు ముంగిట ప్రాక్టీస్‌లో గాయపడి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో రోహిత్‌కు తోడుగా కొత్త ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌కు ఓటేస్తారా.. వార్మప్‌ మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటిన కేఎల్‌ రాహుల్‌కు అవకాశమిస్తారా అన్నది చూడాలి. పుజారా, కోహ్లి, రహానె, పంత్‌ వరుసగా 3, 4, 5, 6 స్థానాల్లో ఆడతారు. అశ్విన్‌కు తోడుగా మరో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను కూడా భారత్‌ బరిలోకి దింపనుంది. ఇషాంత్‌, షమి, బుమ్రా పేస్‌ బాధ్యతలు పంచుకుంటారు. ఇంగ్లాండ్‌ పరిస్థితులను భారత బౌలర్లు బాగానే ఉపయోగించుకోగలరని అంచనా. ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో బ్యాటింగ్‌ చేయడం మనవాళ్లకు ఎప్పుడూ సవాలే. రెండేళ్లకు పైగా సెంచరీ చేయని కోహ్లి, పుజారా సిరీస్‌లో ఎలా ఆడతారన్నది కీలకం.

ఫామ్‌లో లేదు కానీ..: భారత గడ్డపై కొన్ని నెలల కిందట1-3తో సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్‌.. ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. భారత్‌తో సిరీస్‌ తర్వాత ఆ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో సిరీస్‌ ఓడింది. ప్రత్యర్థి పేలవ ఫామ్‌ భారత్‌కు కలిసొచ్చేదే కానీ.. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. పేసర్లు అండర్సన్‌, బ్రాడ్‌లను ఎదుర్కోవడం భారత్‌కు సవాలే. ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ ఆ జట్టుకు బలం. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ రూట్‌ కీలకం. స్టోక్స్‌ లేకపోవడం భారత్‌కు కలిసొచ్చేదే. పిచ్‌పై పచ్చిక ఉంటుందని, పేసర్లకు అనుకూలమని అంచనా. మ్యాచ్‌కు వర్షం ముప్పుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని