సీఎం కేసీఆర్‌కు కొవిడ్‌
close
Published : 20/04/2021 09:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎం కేసీఆర్‌కు కొవిడ్‌

యాంటిజెన్‌ పరీక్షలో నిర్ధారణ
స్వల్ప లక్షణాలున్నాయ్‌..
ఇంకా రాని ఆర్‌టీపీసీఆర్‌ ఫలితం
హోం ఐసొలేషన్‌లో ముఖ్యమంత్రి
సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన సోమవారం యాంటిజెన్‌ పరీక్ష చేయించుకోగా స్వల్ప లక్షణాలున్నట్లు తేలింది. అనంతరం వైద్యులు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష సైతం నిర్వహించగా.. దాని ఫలితం రావాల్సి ఉంది. వైద్యుల సలహా మేరకు ఆయన వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 14న నాగార్జునసాగర్‌లో పర్యటించారు. ఆ సమయంలో పలువురిని కలిశారు. తాజాగా కొవిడ్‌ అని తేలిన నేపథ్యంలో.. తనను కలిసిన వారంతా వైద్యపరీక్షలు చేయించుకోవాలని సీఎం సూచించారు.
భగవంతుని ప్రార్థించా: గవర్నర్‌ తమిళిసై

సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఈ మేరకు భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలు ఆకాంక్షించారు.
* కోట్లాది ప్రజల దీవెనతో సీఎం సంపూర్ణ ఆరోగ్యం పొందాలని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఆకాంక్షించారు.
* సినీనటులు చిరంజీవి, మహేశ్‌బాబు, దర్శకుడు ఎన్‌.శంకర్‌, టీఎన్జీవో, టీజీవో, పీఆర్‌టీయూటీఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేందర్‌, మమత, శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు, సత్యనారాయణ, ప్రతాప్‌లు.. కేసీఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలన్నారు.


ఎలాంటి ఇబ్బందీ లేదు: డాక్టర్‌ ఎంవీరావు

సీఎం కేసీఆర్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. భయపడాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం ఆయన్ను ముగ్గురు వైద్యులం పరీక్షించాం. హోం ఐసొలేషన్‌లో ఉంటే సరిపోతుంది. ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే ఆస్పత్రికి తరలిస్తాం. సీఎంతో పాటు ఆయన సిబ్బందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా వాళ్లకు నెగెటివ్‌ వచ్చింది. ముఖ్యమంత్రికి కరోనా ఎక్కడ సోకిందనేది చెప్పలేం. రెండో దశలో చాలా మందికి వైరస్‌ వ్యాపిస్తోంది.


కేసీఆర్‌ కరోనాను జయిస్తారు: కేటీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోరాట యోధుడని, గట్టి మనిషి అని, కరోనాను కచ్చితంగా జయిస్తారని మంత్రి కేటీరామారావు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సందేశాలు వస్తున్నాయని, అందరి ప్రార్థనలు ఫలించి ఆయన త్వరగా కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం త్వరగా కొవిడ్‌ నుంచి కోలుకోవాలన్నారు.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని