Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు - good morning news at nine am
close
Updated : 05/08/2021 12:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. దళిత బంధు మొదలైంది

‘రాష్ట్రంలోనే తొలిసారిగా దళితబంధు పథకాన్ని వాసాలమర్రిలోనే మొదలుపెడుతున్నాను. ఈ నెల 16న హుజూరాబాద్‌లో ప్రారంభం లాంఛనమే. ఇక్కడి 76 దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రూ.7.6 కోట్లు తక్షణం మంజూరు చేస్తున్నా. ఈ నిధులను గురువారం ఉదయం 11 గంటల్లోగా కలెక్టరు పమేలా సత్పతి ఖాతాలో జమచేస్తాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ప్రతి పైసా పొదుపు చేస్తే దళితులు కూడా షావుకార్లు అవుతారన్నారు. దళిత బస్తీల్లో ఉండే చదువుకున్న, విద్యావంతులైన యువకులే కేసీఆర్‌ ఆస్తి అని పేర్కొన్నారు. తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం పర్యటించారు.

పదిమంది రండి.. మాట్లాడుకుందాం

2. పోలవరంలో కోత పెట్టిన నిధులిస్తాం!

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అంచనా నిధుల్లో గతంలో కోత పెట్టిన తాగునీటి విభాగం నిధులు ఇచ్చేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు మినహాయించిన రూ.4,068.43 కోట్లు తిరిగి ఇచ్చేందుకు సమ్మతించినట్లు పోలవరం అధికారులకు వర్తమానం అందింది. ఈ విషయాన్ని జల్‌శక్తి శాఖ కేంద్ర ఆర్థికశాఖకు కూడా నివేదించినట్లు తెలిసింది. ఈ ఫైలు పరిష్కార దిశలో ఉందని జలవనరులశాఖ అధికారులు వెల్లడించారు. 2020 అక్టోబరు నుంచి పోలవరం నిధులపై కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య భిన్నాభిప్రాయాలు పరిష్కరించుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి.

3. లా చేస్తున్నావ్‌.. పెళ్లొద్దా అనేవాళ్లు

న్యాయశాస్త్ర పట్టా సులభంగా అందుకున్నా దానిద్వారా జీవనోపాధి పొందడం ఒకప్పుడు చాలా సవాల్‌తో కూడుకొని ఉండేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు. బుధవారం సాయంత్రం ‘సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ లా ఫర్మ్స్‌’ కాఫీ టేబుల్‌ బుక్‌ విడుదల కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ‘‘నేను డిగ్రీ చేసేటప్పుడైతే.. ఎందుకు లా చదువుతున్నావు? ఎక్కడా మరే ఉద్యోగమూ రాలేదా? పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదా? అని అడిగేవారు. తొలితరం న్యాయవాదులకు కోర్టులో స్థిరమైన ప్రాక్టీస్‌ అన్నది కలగా ఉండేది. అందుకే దాన్ని చివరి ప్రయత్నంగా భావించేవారు’ అని పేర్కొన్నారు.

4. అప్పుల గుట్టు రట్టు.. అధికారులపై వేటు

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక విషయాల గుట్టు రట్టు చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఆర్థికశాఖలో పనిచేసేవారు మీడియాకు సమాచారం లీకు చేస్తున్నారనే అనుమానంతో సీఎఫ్‌ఎంఎస్‌లోనూ చర్యలు తీసుకుంది. ముగ్గురు అధికారులను ఖజానా శాఖకు తిప్పి పంపింది. అదే విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అయిదుగురిని హఠాత్తుగా తొలగించింది. ఆర్థికశాఖ అధికారుల సస్పెన్షన్‌కు ప్రభుత్వం కారణాలు చెప్పినా సీఎఫ్‌ఎంఎస్‌లో చర్యలకు ఎలాంటి కారణాలూ వెల్లడించలేదు. ఇతరత్రా ప్రభుత్వశాఖల నుంచి వచ్చి పనిచేసిన వారిని తిరిగి మాతృశాఖకు పంపడం మామూలేనని అధికారులు చెబుతున్నారు.

5. యూరియా ఏదయా?

వానాకాలం పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుండటంతో దానికి సమాంతరంగా ఎరువుల కొరత వేధిస్తోంది. ఈ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం కోటీ 14 లక్షల ఎకరాలకు గాను ఇప్పటికే కోటి ఎకరాల్లో పంటలు వేశారు. మరోపక్క ఏప్రిల్‌ నుంచి ఈ నెల వరకూ మొత్తం 22.40 లక్షల టన్నుల ఎరువులకు గాను ఇంకా 11.70 లక్షలు రాలేదు. కేవలం 10.70 లక్షలే వచ్చాయి. మెల్లమెల్లగా యూరియా కొరత పెరుగుతోంది. ఈ సీజన్‌ మొత్తానికి అంటే ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 10.50 లక్షల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది.

6. కరోనా మూడో దశ ఖాయం

దేశంలో కరోనా మూడో దశ ప్రభావం ఉంటుందని, అది ఆగస్టు నుంచి అక్టోబర్‌ వరకు కొనసాగుతుందని ఐఐటీ హైదరాబాద్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెంట్‌, ఎలక్ట్రానిక్‌ విభాగాల ప్రొఫెసర్‌ ఎం.విద్యాసాగర్‌ తెలిపారు.  ఈ దశలో వైరస్‌ తీవ్రంగా ఉంటే గరిష్ఠంగా రోజుకు 1.40 లక్షల కేసులు రావచ్చన్నది తమ అంచనా అని పేర్కొన్నారు.  గత కొంతకాలంగా విద్యాసాగర్‌తోపాటు ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌, సైన్యంలో పని చేస్తున్న డాక్టర్‌ మాధురీ కనిట్కర్‌ కలిసి మ్యాథమెటికల్‌ విధానంలో కరోనా మీద విశ్లేషణ చేశారు. వీరు రెండో దశలో రోజుకు గరిష్ఠంగా 3.90 లక్షల కేసులు వస్తాయని అంచనా వేయగా నాలుగు లక్షల కేసులు వచ్చాయి.

7. 2023 చివరికల్లా భక్తులకు అయోధ్య రాముడి దర్శనం!

శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. 2023 చివరికల్లా గర్భగుడి నిర్మాణం పూర్తి చేసి భక్తుల దర్శనానికి వీలుగా ఆలయ ద్వారాలు తెరవాలని మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు భావిస్తోంది. అప్పటికల్లా గర్భగుడి పనులు పూర్తవుతాయన్న విశ్వాసంతో ఉంది. ‘‘2023 చివరికల్లా మందిర నిర్మాణం పూర్తి చేయాలని అనుకున్నాం. అందుకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. అప్పటికల్లా రాముడిని దర్శించుకొనే భాగ్యం భక్తులకు కలుగుతుంది’’ అని ట్రస్టు వర్గాలు చెబుతున్నాయి.

8. తీరిన కల.. జయహో హాకీ ఇండియా.. 41 ఏళ్ల తర్వాత పతకం

ఎన్నాళ్లో వేచిన హృదయాలకు ఒక చల్లని కబురు ఇది.. ఎన్నేళ్లో కన్న కలలు నిజమైన వేళ ఇది.. ఇక పునర్వైభవమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన తరుణమిది.. పతకాల కరవు తీరుస్తూ హాకీ ఇండియా అద్భుతం చేసింది. జర్మనీతో జరిగిన పోరులో తిరుగులేని విజయం సాధించింది. అఖండ భారతావనిని మురిపించింది. టోక్యోలో భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. బలమైన ప్రత్యర్థిని 5-4 తేడాతో చిత్తు చేసింది. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం ముద్దాడింది.

9. తండ్రీ, కొడుకులు కలసి చూడాల్సిన చిత్రం

‘‘మామూలుగా సినిమా తీయడమే కష్టం. అదీ ఈ కష్ట కాలంలో సినిమా చేసి థియేటర్లోకి తీసుకురావడమన్నది ఇంకా చాలా కష్టం. ఇన్ని కష్టాలు దాటుకుని థియేటర్లలోకి వస్తున్న ‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు హీరో రాజశేఖర్‌. కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్‌ జంటగా నటించిన చిత్రమిది. సాయికుమార్‌ ముఖ్య పాత్రలో నటించారు. శ్రీధర్‌ గాదె తెరకెక్కించారు. ప్రమోద్‌, రాజు నిర్మించారు. ఈ సినిమా ఈనెల 6న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు.

10. పట్టేయ్‌ పసిడి

అసమాన పోరాట తత్వాన్ని ప్రదర్శించిన రవి దహియా 57 కిలోల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్లిష్టపరిస్థితుల్లో అద్భుతంగా పుంజుకున్న దహియా.. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో ప్రత్యర్థి నురిస్లామ్‌ సనయేవ్‌ (కజకిస్థాన్‌)ను పిన్‌ డౌన్‌ (ఫాల్‌) చేసి విజేతగా నిలిచాడు. ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు నొక్కి పెడితే ఫాల్‌ ద్వారా విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. హరియాణాకు చెందిన దహియా ఈ విజయంతో.. సుశీల్‌ కుమార్‌ (2012) తర్వాత రెజ్లింగ్‌ స్వర్ణ పతక బౌట్‌కు అర్హత సంపాదించిన రెండో భారతీయుడిగా ఘనత సాధించాడు. 

పేస్‌ పంచ్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని