బాలయ్యతో సినిమా అనగానే భయపడ్డా: ప్రగ్యా జైస్వాల్‌ - i was initially a bit scared about doing a film with balakrishna says pragya jaiswal
close
Published : 27/07/2021 02:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలయ్యతో సినిమా అనగానే భయపడ్డా: ప్రగ్యా జైస్వాల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలామందిలాగే బాలయ్యబాబు అంటే తానూ మొదట్లో భయపడ్డానని, కానీ తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నానని నటి ప్రగ్యా జైస్వాల్‌ పేర్కొంది. నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో బోయపాటి శ్రీనివాస్‌ దర్శకత్వంలో ‘అఖండ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెజారిటీభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ కనిపించనుంది. ఆఖరి షెడ్యూల్‌ కోసం ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకుంది. కాగా.. ఆమె ఓ ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

‘ఈ సినిమాకు సంతకం చేయకముందే బాలకృష్ణగారి గురించి చాలా విన్నాను. అందుకే ఆయనతో సినిమా చేయాలంటే భయం వేసింది. సినిమా చిత్రీకరణ మొదలైనప్పుడు కూడా ఆయనను చూస్తే భయపడేదాన్ని. ఒకసారి సెట్‌లో ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఎంత సరదాగా ఉంటారో అర్థమైంది. ఆయన గురించి బయట వినిపించే వార్తలకు బాలకృష్ణ చాలా భిన్నంగా ఉంటారు. ఎప్పుడు చూసినా ఉత్సాహంగా కనిపిస్తారు. ఆయన సెట్లో ఉంటే అక్కడ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది’’ అని ప్రగ్యా చెప్పుకొచ్చింది. బాలకృష్ణ-బోయపాటి కలయికలో వచ్చిన సినిమాల్లో హీరోయిన్లకు తగిన ప్రాధాన్యం ఉండదన్న వార్తలపై ఆమె స్పందిస్తూ.. ‘గత సినిమాల గురించి మాకు సంబంధం లేదు. ఈ సినిమాలో నా పాత్ర చాలా బలమైంది. నేను కేవలం ఒక అందాల ప్రదర్శన కోసం కాకుండా.. నటిగా నిరూపించుకునేందుకు ఈ సినిమా చేశాను. బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌ బాలకృష్ణ-బోయపాటి చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ట్రైలర్‌ ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నా. సినిమాలో నా లుక్‌, పాత్ర గురించి ఎవరూ రివీల్‌ చేయలేదు. ఈ చిత్రంలో నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మీరు ఖచ్చితంగా ఈ సినిమాను ఆస్వాదిస్తారని భరోసా ఇస్తున్నాను’’ అని ప్రగ్యా పేర్కొంది. 

ప్రగ్యా ‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. డైరెక్టర్‌ క్రిష్‌ తెరెక్కించిన ఆ చిత్రం ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం అందుకుంది. సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ఆ తర్వాత ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి పలు చిత్రాల్లో ఆమె నటించింది. రెండేళ్ల తర్వాత ‘అఖండ’ ఆమె మళ్లీ తెలుగులోకి పునరాగమనం చేయబోతోంది. హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తోందామె.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని