close
Published : 07/04/2021 23:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్టైలిష్‌ స్టార్‌ బన్ని.. ఇక నుంచి ఐకాన్‌ స్టార్‌

పుష్ప టీజర్‌ విడుదల వేడుకలో డైరెక్టర్‌ సుకుమార్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇక నుంచి అల్లు అర్జున్‌ స్టైలిష్‌ స్టార్‌ కాదు.. ఐకాన్‌ స్టార్‌ అని డైరెక్టర్‌ సుకుమార్‌ అన్నారు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయిక. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రం ‘పుష్ప ఫస్ట్‌మీట్‌’ పేరుతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్‌ సుకుమార్‌ మాట్లాడుతూ.. ‘స్టైలిష్‌స్టార్‌ అనే ట్యాగ్‌ బన్నీకి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ సినిమాలో బన్నీ నటన అద్భుతం. ప్రమాణం చేసి చెబుతున్నా.. సినిమా చూసిన తర్వాత మీరే ఆ మాట అంటారు. సినిమాలో బన్ని పెర్ఫార్మెన్స్‌ చూసిన తర్వాత స్టైలిష్‌ అనే పదం ఒక్కటే ఆయనకు సరిపోదనిపించింది. నా అభిప్రాయం ప్రకారం.. బన్నీ ఇక స్టైలిష్‌ స్టార్‌ కాదు.. ఐకాన్‌ స్టార్‌. తన కథల ఎంపిక ప్రత్యేకం.. వేసే డ్రెస్సులు ప్రత్యేకం.. బన్నీ డ్యాన్స్‌ ప్రత్యేకం.. అందుకే ఈ సినిమా తర్వాత బన్నీని ఐకాన్‌ స్టార్‌ లేదా పుష్ప అని పిలుస్తారు. ఈ సినిమా కోసం టెక్నీషియన్లు చాలా కష్టపడ్డారు. సినిమాటోగ్రఫర్‌ మిరోస్లా బ్రోజెక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన ఏ దేశం నుంచి వచ్చారో తెలియదు. మన భాష రాకున్నా ఎంతో కష్టపడి పనిచేశారు. చివరిగా ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’ అని సుకుమార్‌ తన మాటల్ని ముగించారు.

అనంతరం అల్లు అర్జున్‌ మాట్లాడారు.. ‘నా జీవితం టేకాఫ్‌ అయిందే.. సుకుమార్‌ ‘ఆర్య’తో. అప్పుడే నాకు స్టైలిష్‌స్టార్‌ అని ట్యాగ్‌ వచ్చింది. ఇప్పుడు కూడా ఏం జరగబోతుందో కూడా నాకు అర్థమయిపోయింది. అప్పుడు స్టైలిష్‌ స్టార్‌ ఇచ్చి.. ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఇందులో ఉన్న ‘తగ్గేదే లే’ అనే డైలాగ్‌ నా జీవితంలో ప్రతిరోజూ నాకునేను చెప్పుకొనే డైలాగ్.  తెలుగు సినిమాలు చూస్తున్నందుకు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు‌’ అని బన్నీ అన్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని