Raghavendra rao:ఆయనో సినీ యూనివర్సిటీ - k raghavendra rao birthday special story
close
Updated : 23/05/2021 11:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Raghavendra rao:ఆయనో సినీ యూనివర్సిటీ

రంగుల రసవేదం.. ఇంద్రచాపం.. వెండితెరకెక్కిన ఒక్కో చలనచిత్రం ఒక్కో కళాఖండం.. తెలుగు చలనచిత్రరంగ చరిత్రలో దాదాపు అర్ధశతాబ్దం తనదేనని చాటిన ఆయన ఒక చరిత్ర. ఆయనే దర్శకేంద్రుడు. నవతరం దర్శకులకు ‘ఆదర్శ’కేంద్రుడు. కె. రాఘవేంద్రరావుగా సినీజగతికి సుపరిచితులైన కోవెలమూడి రాఘవేంద్రరావు. ఈ సినీచరిత్రకారుడు పుట్టినరోజు నేడు. ఒక చరిత్ర పుట్టిన రోజు. సినీరంగంలో చరిత్ర సృష్టికర్త జన్మించిన రోజు.

పువ్వులా, సిగపువ్వులా? భూదేవి నవ్వులా? విరిసిన హరివిల్లులా? కురిసిన విరి జల్లులా? నక్షత్ర చేమంతులు, పూలబంతులు, ద్రాక్షగుత్తులు. ఆ పుష్పాభిషేకం... పాటకు పట్టాభిషేకం.. ప్రేక్షకులపై సినీ మాంత్రికుని ఇంద్రజాలం. రాఘవేంద్రరావు మంత్రజాలం సినిమాను వెలిగించే ఫిలమెంటు సెంటిమెంట్. ఇది పూర్తిగా ఔపాసనపట్టిన రాఘవేంద్రుడు సినామానే ప్రయోగశాలగా, ప్రేక్షకాభిరుచినే పరిశోధనాంశంగా  చేసుకొని కొత్త కొత్త కళాఖండాలు సృష్టించారు.  ప్రేక్షకలోకం కొత్తకొత్తగా ఉన్నదని ఆస్వాదించింది. ఆమోదించింది. స్వాగతించింది. ముందుకు సాగాలని దీవించింది.

తెలుగు సినిమాకు కమర్షియల్‌ హంగులు అద్దిన అతి కొద్ది మంది దర్శకుల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారు.. భక్తి, రక్తి, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్‌ ఇలా ఆయన వెండితెరమీద ఆవిష్కరించని సినిమానే లేదు.. ఎంత సాధించినా.. ఎంతటి అత్యున్నత శిఖరాలను అధిరోహించినా.. ఎప్పుడూ మౌన ముద్రలోనే కనిపించే సినీ ముని ఆయన.

తండ్రి కేఎస్ ప్రకాశ్ రావు, పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దగ్గర రాఘవేంద్రరావు శిష్యరికం చేశారు.  గ్రామ్‌ఫోను రికార్డుల కాలంలో, ఆడియోల కాలంలో పాటలు శ్రోతలకు వీనుల విందు చేసేవి. వీడియోలు, డిజిటల్ యుగంలో ప్రేక్షకుల ముంగిటనే దృశ్యకావ్యాలు ఆవిష్కారమవుతున్న వేళ.. అరచేతిలో ఇమిడే మొబైల్ ఫోన్లలోనూ ఆస్వాదిస్తున్నది ప్రేక్షకలోకం. వీక్షకలోకం.  తనూ పెద్ద దర్శకుడు కావాలని, అందరి నోటా ప్రేక్షకులకు కొత్తగా ఏమివ్వాలి? కొత్తగా ఏమి ఆవిష్కరించాలి? తననుంచి ఏమి ఆశిస్తున్నారు? అని సాలోచనగా, ఆలోచనగానో.. ఎప్పుడూ మునిలా ఉంటారు.  సెట్టు బయటికి వచ్చాక కూడా అదే యోచనలో ఉంటారు. కోవెలమూడి హృదయపు కోవెలలో ఎన్నో ఊసులు. సినీజగతికి భరోసా ఇచ్చే బాసలు.  మాయగా ‘సోయగాలాలు’ వేసే కథానాయికలను ఆవిష్కరించటం రాఘవేంద్రరావు ప్రత్యేకత. వారి సోగసు,సోయగాలను మరింత ఆకర్షణీయంగా చూపించటం విశిష్టత.

రాఘవేంద్రరావు ప్రత్యేకతలేమిటంటే  కేవలం ప్రకృతి అందాల ప్రదర్శనే కాదు. పూలన్నీ తలంబ్రాలు కావటమే కాదు. కథానాయికలు తుళ్లిపడేలా రకరకాల పండ్లు దొర్లిపడుతుంటాయి.  ఇక  సెంటిమెంటు పండించే దృశ్యాలు సర్వసాధారణం. శోభన్ బాబు, శ్రీదేవి హీరోగా నటించిన దేవత సినిమా లో ‘వెల్లువొచ్చి గోదారమ్మ’పాట వినూత్నంగా చిత్రీకరించారు. చక్రవర్తి సంగీతం, బాలుసుశీల యుగళం, శోభన్, శ్రీదేవి అభినయం వేటికవేపోటీపడ్డాయి. బిందెల నడుమ చిత్రీకరించిన ఈ గీతం తర్వాత అనేకమంది దర్శకులకు స్ఫూర్తినిచ్చింది.  వెండితెరమీద రసపుష్టిని, రిచ్ నెస్ ను చూపించడంలో ఆయన అందెవేసిన చేయి. ముందుగానే మనసుతో చూస్తారు. ఒకరూపం సంతరించుకోగానే వెండితెరమీద ప్రదర్శించటానికి ఉవ్విళ్లూరతారు. సౌందర్యానికి ప్రతీకలను రాఘవేంద్రరావు బాగా చూపిస్తారనే పేరు తెచ్చుకున్నారు. కథానాయకుణ్ణి ఉదాత్తంగా చూపిస్తారు. సినిమాలో కథానాయకుణ్ణి పరిచయం చేయటం వినూత్నంగా ఉంటుంది. హీరోయిన్లయితే  రాఘవేంద్రుని దర్శకత్వంలో కనీసం ఒక్కసినిమా చేసినా చాలని తపించే వారే అధికం.

నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన  108 తెలుగు సినిమాలకు, 18 పరభాషా  భాషా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఐదు తరాల నటులతో కలసి పనిచేశారు. ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో సినిమాలు చేశారు. ఎన్టీఆర్‌తో  12 సినిమాలు, చిరంజీవితో 10,   శ్రీదేవితో 24 సినిమాలకు దర్శకత్వం వహించారు.  వెంకటేశ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లను కథనాయకులుగా పరిచయం చేశారు.

సినిమా తీయాలంటే 64 కళలు తెలియనక్కరలేదు. 24  ఫ్రేములలో ఆధిపత్యం లేదా అవగాహన ఉంటే చాలు. సినిమానే ప్రపంచంగా భావించే రాఘవేంద్రరావు అదే ప్రపంచంలో సహాయ దర్శకుడుగా కెరీర్ ప్రారంభించారు. దర్శకుడుగా ఎదిగారు.  108 తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయనో సినిమా విశ్వవిద్యాలయం.

రాఘవేంద్రరావు వ్యక్తి కాదు... వ్యవస్థ. ఒక  సినిమా విశ్వవిద్యాలయం. ఆయన దగ్గర  సహాయ దర్శకులుగా పనిచేసిన అనేకమంది సుప్రసిద్ధ దర్శకులయ్యారు. అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. వారిలో ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, జయంత్ సి. పరాన్జీ, వైవీఎస్ చౌదరి, ఎస్.ఎస్. రాజమౌళి, జయంత్ సి. పరాన్జీ, చంద్రశేఖర్ ముఖ్యులు. చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు అప్రతిహత విజయయాత్ర సాగిస్తున్న నేటితరం రాజమౌళి వీరంతా రాఘవేంద్రరావు విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన వారే.

రాఘవేంద్రరావు, కీరవాణి కలిస్తే  సినీగీతాలు అద్భుతంగా వస్తాయన్నది అనేక పర్యాయాలు నిరూపితమైంది. 1991లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుందరాకాండ మ్యూజికల్ హిట్. అప్పటి నుంచి ఈ ద్వయం అద్భుతమైన గీతాలను శ్రోతలకు అందించారు. ఇక నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రాష్ట్రప్రభుత్వానికి ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా పనిచేశారు. ఒక జాతీయ అవార్డు, 10 నంది పురస్కారాలు. 2 ఫిలింఫేర్ పురస్కారాలు వరించాయి. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా  జీవన సాఫల్య పురస్కారం లభించింది. 

తెలుగు చలనచిత్రరంగంలో రాఘవేంద్రరావు ఒక చరిత్ర. ఆయన సినిమాలు చరిత్ర. పాటలు చరిత్ర. విభిన్న కథాంశాలూ ఒక చరిత్ర.  నాయికా, నాయకుల పరిచయాలు చరిత్ర. వెండితెర మీద  తరతరాల కథనాయకుల, కథానాయికల మధుర స్వప్నాలను సాకారం చేసిన అసలైన కథానాయకుడు.. కోవెలమూడి రాఘవేంద్రరావు.  నాలుగున్నర దశాబ్దాలకు పైగా  దర్శకుడుగా కెరీర్ కొనసాగించటం  ఒక్క  రాఘవేంద్రుడికే సాధ్యమైంది. ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ, సినిమాలను నూత్నంగా తీర్చిదిద్దుతూ ముందుకు సాగుతున్న  కళా యశస్వి. సినీ రుషి. ఎవర్ గ్రీన్ హీరో, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు  మరిన్ని మరిన్ని పుట్టిన రోజు పండుగలు చేసుకోవాలని కోరుకుంటూ..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని