Pokiri: మొదట అనుకున్న టైటిల్‌ అదే! - Mahesh babu Pokiri movie completed 15 years
close
Published : 28/09/2020 12:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పోకిరి’ని ఆ హీరోతో చేద్దామనుకున్న పూరి

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ల కలయికకు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం  కురిపించాయి. ముఖ్యంగా ‘పోకిరి’ చిత్రం అప్పట్లో వసూళ్ల పరంగా తెలుగు చిత్రసీమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. రూ.10కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం.. రూ.70కోట్ల గ్రాస్‌తో రూ.40కోట్ల షేర్‌ సాధించి ఆల్‌ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మహేష్‌, పూరిల సినీ కెరీర్‌కు ఇంతటి అపురూప విజయాన్ని అందించిన ఈ చిత్రం వెనుక కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి. సోమవారం పూరి పుట్టిన రోజు సందర్భంగా ఆ విశేషాలు మీకోసం..

ఆ హీరో కోసం కథ రాసుకున్న పూరి

దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఈ చిత్రాన్ని మహేష్‌బాబుతో కలిసి 2006లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  వాస్తవానికి ఆయన ఈ కథను రాసుకుంది మాత్రం అంతకు ఆరేళ్ల ముందుగానే. పూరి తన తొలి చిత్రం ‘బద్రి’ కన్నా ముందే ఈ చిత్ర స్క్రిప్ట్‌ను రాసుకున్నారట. తొలుత ఈ కథకు హీరోగా అనుకున్నది మహేష్‌ను కాదు.. మాస్‌రాజా రవితేజని. ఈ చిత్రాన్ని ఆయనతోనే ‘ఉత్తమ్‌ సింగ్‌.. సన్నాఫ్‌ సూర్య నారాయణ’ అనే టైటిల్‌తో తెరపైకి తీసుకొద్దామని అనుకున్నారు.  అనుకోని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత కొన్నాళ్లకు ఈ కథ మహేష్‌ దగ్గరకు చేరింది. ఆయన ఈ స్క్రిప్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చాక.. పూరి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని ‘పోకిరి’గా మార్చారు.

కథానాయికగా ఎంపికైన కంగన

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో కథానాయిక పాత్రకి తొలుత అనుకున్నది అయేషా టకియాని. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ పాత్రను వదులుకుంది. తర్వాత ఆ అవకాశాన్ని ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ దక్కించుకుంది. ఈ చిత్ర ఆడిషన్స్‌ ముంబయిలో జరుగుతున్న సమయంలో.. అక్కడే బాలీవుడ్‌ చిత్రం ‘గ్యాంగ్‌స్టర్‌’కూ ఆడిషన్స్‌ జరిగాయట. దీంట్లో పాల్గొనడానికి వచ్చిన కంగనా.. పనిలో పనిగా ‘పోకిరి’ చిత్రానికీ ఆడిషన్స్‌ ఇచ్చింది. అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ, కంగనాకు ఈ రెండు చిత్రాల్లోనూ అవకాశం దక్కింది. అయితే వీటిలో ఏదో ఒక దాన్నే చేయాల్సి రావడంతో ఆమె ‘పోకిరి’ని వదులుకుంది. దీంతో ఆ అవకాశం కాస్తా ఇలియానాకు దక్కింది. 

అలా కనిపించడం అదే తొలిసారి..

‘పోకిరి’ ముందు వరకు మహేష్‌బాబు చేసిన అన్ని సినిమాల్లోనూ ఆయన లుక్‌ దాదాపు ఒకేలా ఉండేది. లైట్‌ హెయిర్‌, క్లీన్‌ షేవ్‌తో బాలీవుడ్‌ హీరోలా క్లాస్‌గా దర్శనమిచ్చేవారు. ‘పోకిరి’ చిత్రంతో మహేష్‌ను తొలిసారి ఊర మాస్‌ యాంగిల్‌లో చూపించారు పూరి. ఆయన మహేష్‌కు కథ చెప్తున్నప్పుడే జుత్తు బాగా పెంచాలి.. లైట్‌గా మీసం, గెడ్డంతో ఉండాలని చెప్పేశారట. దీనికి తగ్గట్లుగానే మహేష్‌ ‘అతడు’ చిత్రం తర్వాత వచ్చిన నాలుగు నెలల విరామాన్ని దీనికోసం వినియోగించుకున్నారట. జుత్తు కత్తిరించుకోకుండా సరికొత్త లుక్‌లోకి మారారు ఆయన. ఈ చిత్రంలో ఆయన డ్రెస్సింగ్‌ స్టైల్‌ అప్పట్లో కొత్త ట్రెండైంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని