close
Published : 30/12/2020 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆయనకు నటులు సైతం సలాం కొట్టారు..

ఇంటర్నెట్ డెస్క్: సినీ ప్రపంచం ఆయన మృతికి ఎంతో బాధపడింది అని రచయిత, దర్శకులు పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. సీనియర్ నటుడు రంగనాథ్‌ గారిని జ్ఞాపకం తెచ్చుకుంటూ కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన ‘పరుచూరి పలుకులు’లో పంచుకున్నారు. ‘‘ఆయన ఓ అద్భుతమైన నటుడు. చాలా మంచి పాత్రల్లో నటించారు. ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ ప్రీ క్లైమాక్స్‌లో ఆయన నటనకు, మాట్లాడిన మాటలకు ఆ రోజుల్లో అల్లు రామలింగయ్య లాంటి వాళ్లు సినిమా చూసి థియేటర్లోనే ఆయనకు నిల్చొని సలాం కొట్టారు. ‘ప్రేమంటే ఇదేరా’, ‘కలిసుందాం రా’ చిత్రాల్లో చాలా గొప్పగా నటించారు’’ అని పరుచూరి అన్నారు. 

‘‘ఒక్కసారిగా ఎప్పుడైతే ఈ దర్శకులు హిందీ, తమిళనాడు మార్కెట్‌ను పెంచటం కోసం మన వాళ్లని వదిలేసి బయట వాళ్ల దగ్గరికి వెళుతున్నారో .. వీళ్లకి పాత్రలు ఆగిపోవటంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఆయన గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే.. చిత్ర పరిశ్రమకు రాకముందు చనిపోవాలనుకొని రైలు ముందు నిలబడి మళ్లీ ఎందుకో విరమించుకున్నారని ఆయన ఓ సందర్భంలో చెప్పారు. చనిపోవాలి అనే కోరిక భావోద్వేగానికి గురయిన ఓ క్షణంలో వస్తుంది. ఆ సమయంలో మౌనంగా ఆ క్షణాన్ని దాటేస్తే వాళ్లు మరణించరు అని మానసిక నిపుణులు చెబుతుంటారు. కానీ, ఆయన ఏది ఆపారో దాంతోనే ముగించారు అంటే ఆ మనసు మారలేదు. అది తట్టుకోలేనితనానికి ముగింపే జీవితానికి ముగింపే కారణం తప్ప మరొక మార్గం లేదు అనే ఆలోచన తప్పు. దయచేసి తల్లిదండ్రలారా.. మీ పిల్లల ముఖంలో ఏదైనా బాధ కనపడితే వెంటనే వారిని ప్రేమపూర్వకంగా దగ్గరకు తీసుకొని సమస్యను కనుక్కొని పరిష్కరించండి. అప్పుడు ఇలా ప్రేమ, పరీక్షలు అంటూ జరిగే ఆత్మహత్యలు ఆగిపోతాయి అని నా విశ్వాసం’’ అని ఆయన చెప్పారు.

‘‘ఒక్కసారి మీరందరూ రంగనాథ్ గారు నటించిన ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ చిత్రాన్ని చూడండి. మూడు లక్షలతో తీసిన అద్భుతమైన చిత్రం ఇది. 175 రోజులు విశాఖపట్నంలో ఆడింది. ఆయన అద్భుతమైన కవితలు రాశారు. అంతటి కవి హృదయం కలిగిన ఆయన జీవితాన్ని అలా ముగించటం సమంజసం కాదు. ‘ప్రేమంటే ఇదేరా’ చిత్రంలోని ఓ సన్నివేశం కోసం రఘుబాబు పరిషత్‌లో మేము ఓ నాటకాన్ని చూస్తుంటే ఓ కూతురు అబ్బాయితో వెళ్లిపోదామని చూస్తుంటే తండ్రి ఆపి లేఖ రాయిస్తాడు. ఈ సన్నివేశం మాకు కావాలి అని రామానాయుడు గారితో ఆ ఒక్క సన్నివేశానికి పదిహేను వేలు ఆ రచయితకు ఇచ్చి దాన్ని ఈ చిత్రంలో పెట్టాము’’ అని ఆయన తెలిపారు.

‘‘ఓ సినిమాకి హీరో స్తంభం అయితే, మిగతా ఆర్టిస్ట్ లు పైకప్పులు అవుతారు. అవన్నీ లేకపోతే ఓ అందమైన భవంతి నిర్మాణం మనం చేయలేం. అదే విధంగా ఆ పాత్రకు వాళ్లు సరిపోకపోతే సినిమా దెబ్బతింటుంది. ఫలానా వాళ్లు చేస్తేనే ఈ పాత్ర బాగుంటుంది అని పోరాడి తీసుకొస్తాం. రంగనాథ్ గారు ఓ మంచి బేస్‌ వాయిస్‌తో, ఆరడుగుల ఎత్తుతో, అద్భుతమైన డైలాగులు చెప్తుంటే చూపు తిప్పుకోలేరు. ఓ మంచి ఆజానుబాహుడైన నటుడిని కోల్పోవడం చాలా బాధాకరం’’ అని ఆయన ముగించారు. Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని