Thank You Brother​ review:రివ్యూ: థ్యాంక్‌ యు బ్రదర్‌! - anasuya bharadwaj thank you brother​ telugu movie review
close
Updated : 07/05/2021 11:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Thank You Brother​ review:రివ్యూ: థ్యాంక్‌ యు బ్రదర్‌!

చిత్రం: థ్యాంక్‌ యు బ్రదర్‌!; నటీనటులు: అనసూయ భరద్వాజ్‌, విరాజ్‌ అశ్విన్‌, అనిశ్‌ కురువిల్ల, మోనికారెడ్డి, వైవా హర్ష, అర్చనా అనంత్‌, అన్నపూర్ణమ్మ; సంగీతం: గుణ బాలసుబ్రమణియన్‌; సినిమాటోగ్రఫీ: సురేశ్‌ రగుతు; ఎడిటింగ్‌: ఉదయ్‌, వెంకట్‌; ఆర్ట్‌: పురుషోత్తమ్‌ ప్రేమ్‌; కథ: రమేశ్‌ రాపర్తి, నియీ అఖిన్‌మోలయాన్‌, మోరిస్‌ కె.శశి; నిర్మాత: మాగుంట శరత్‌చంద్రారెడ్డి, తారకనాథ్‌ బొమ్మిరెడ్డి,; దర్శకత్వం: రమేశ్‌ రాపర్తి; విడుదల: ఆహా

గతేడాది కరోనా కారణంగా థియేటర్‌లు మూతబడటంతో చాలా సినిమాలు ఓటీటీని పలకరించాయి. ఈ ఏడాది అంతా బాగుందనే సరికి మరోసారి కరోనా విజృంభించడంతో థియేటర్లు మూసివేయక తప్పలేదు. దీంతో విడుదలకు సిద్ధమైన చిత్రాలు మళ్లీ ఓటీటీ బాటపడుతున్నాయి. అందులో భాగంగానే ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’. బుల్లితెర వ్యాఖ్యాత అనసూయ కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. మరి ఈ చిత్ర కథేంటి? అనసూయ ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది?

కథేంటంటే: అభి(విరాజ్‌ అశ్విన్‌) తన తండ్రి స్నేహితుడు(సమీర్‌)తో కలిసి  వ్యాపార భాగస్వామిగా చేరతానని కోరడానికి గోల్డ్‌ఫిష్‌ అపార్ట్‌మెంట్‌కు వస్తాడు. మరోవైపు పెళ్లయిన కొన్ని రోజులకే భర్త(ఆదర్శ్‌ బాలకృష్ణ) చనిపోవడంతో అతను పనిచేసే కంపెనీ నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రియ(అనసయా భరద్వాజ్‌) కూడా అదే అపార్ట్‌మెంట్‌కు వస్తుంది. పైగా ఆమె నిండు గర్భిణి. అక్కడి నుంచి తిరిగి వెళ్లే క్రమంలో ఇద్దరూ ఒకేసారి లిఫ్ట్‌ ఎక్కుతారు. సడెన్‌గా లిఫ్ట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి ఆగిపోతుంది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రియకు నొప్పులు ప్రారంభమవుతాయి. అలాంటి సమయంలో అభి ఏం చేశాడు? లిఫ్ట్‌లో వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అన్నది తెరపై చూడాల్సిందే!

ఎలా ఉందంటే: గత కొంతకాలంగా యువ దర్శకులు సరికొత్త ఆలోచనలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో కథాబలమున్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాంటి కోవలో వచ్చిందే ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’. సాధారణంగా లిఫ్ట్‌లో వెళ్తున్నప్పుడు సడెన్‌గా కరెంట్ పోతే అది పనిచేసే వరకూ అందులో ఉన్న ప్రతి ఒక్కరిలోనూ తెలియని ఆందోళన నెలకొంటుంది. అదే నిండు గర్భిణి లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే, అదే సమయంలో ఆమెకు నొప్పులు మొదలైతే, ఇదే చిన్న ఎలిమెంట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ను తీసుకుని కథగా మలుచుకున్నాడు దర్శకుడు రమేశ్‌. ఇలాంటి సినిమాలకు బిగిసడలని కథనం తోడైతే ఆ సినిమా హిట్టయినట్టే. ఈ విషయంలో దర్శకుడు రమేశ్‌ కొంత వరకే సఫలమయ్యాడు.

ప్రథమార్ధమంతా అభి, ప్రియల నేపథ్యం చూపించేందుకు సమయం తీసుకున్నాడు. ఈ సన్నివేశాలు కాస్త విసుగు తెప్పిస్తాయి. ముఖ్యంగా అభి ఎపిసోడ్‌ తరహా సన్నివేశాలు చాలా సినిమాల్లో చూశాం. అభి, ప్రియలు లిఫ్ట్‌లో ఇరుక్కున్న తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అప్పటివరకూ అభి, ప్రియల ఫ్లాష్‌బాక్‌ అంతా భరించాల్సిందే. లాక్‌డౌన్‌ కారణంగా ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌ వాసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.  ద్వితీయార్ధం అంతా లిఫ్ట్‌లో ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో సాగుతుంది. ఆయా సన్నివేశాలన్నీ ఆసక్తిగా సాగుతాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు భావోద్వేగభరితంగా తీర్చిదిద్దాడు దర్శకుడు.

ఎవరెలా చేశారంటే: ఒకవైపు, యాంకరింగ్‌ ప్రత్యేక గీతాలు, అతిథి పాత్రల్లో మెరుస్తూనే కథా బలమున్న చిన్న చిత్రాల్లో అనసూయ నటిస్తూ మెప్పిస్తోంది. ఈ చిత్రంలో  నిండు గర్భిణిగా  ప్రియ పాత్రలో అనసూయ ఒదిగిపోయింది. లిఫ్ట్‌లో పురుటినొప్పులతో బాధపడే సన్నివేశాలు భావోద్వేగంగా ఉన్నాయి. యువ కథానాయకుడు విరాజ్‌ పర్వాలేదు.మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికవర్గం పనితీరు బాగుంది. సురేశ్‌ రగుతు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా లిఫ్ట్‌ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. నేపథ్య సంగీతం ఆయా సన్నివేశాలకు మరింత బలం తీసుకొచ్చింది. సినిమా నిడివి తక్కువే. అయినా ఇంకా కత్తెర వేయాల్సిన అవసరం ఉంది.  దర్శకుడు రమేశ్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తదే. అయితే, దాన్ని ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దడంలో తడబడ్డాడు. అభి, ప్రియల ఫ్లాష్‌ బ్యాక్‌ సన్నివేశాలను త్వరగా ముగించి, అసలు పాయింట్‌ అయిన లిఫ్ట్‌ సన్నివేశాలపై దృష్టి పెట్టి ఉంటే సినిమా మరో థ్రిల్లర్‌గా అలరించేది. ప్రస్తుతం థియేటర్‌లు తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి, వీకెండ్‌లో కాలక్షేపం కోసం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ చూడొచ్చు.

బలాలు బలహీనతలు
+ ఎంచుకున్న పాయింట్‌ - ప్రథమార్ధం
+ ద్వితీయార్ధం - కథ, కథనాలు
+ సాంకేతిక బృందం పనితీరు  

చివరిగా: బ్రదర్‌.. ఇంకాస్త ‘లిఫ్ట్‌’ చేయాల్సింది!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని