ఒక ఏడాది.. ఆరు బ్లాక్‌ బస్టర్లు - balakrishna 6 hits in the year of 1986
close
Updated : 10/06/2021 10:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక ఏడాది.. ఆరు బ్లాక్‌ బస్టర్లు

1986..బాలకృష్ణ సత్తా చాటిన ఏడాది

నందమూరి అభిమానులకు మర్చిపోలేని  సంవత్సరం 1986. యువరత్న బాలకృష్ణ సత్తా ఏంటో చూపించిన ఏడాది అది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు బ్లాక్‌ బ్లస్టర్లు అందించి బాక్సాఫీసు బంగారు కొండగా నిలిచాడు. అభిమానులకు కనుల విందులాంటి సినిమాలు, నిర్మాతల కాసుల పెట్టెను గలగలలాడించాడు. అలా ఆ ఏడాది బాలకృష్ణనామ సంవత్సరంగా మారిపోయింది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆ బ్లాక్‌బస్టర్లుగా నిలిచిన ఆ ఆరు సినిమాల వివరాలు మీకోసం..

ముద్దుల క్రిష్ణయ్య

కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘ముద్దుల క్రిష్ణయ్య’ సినిమాతో ఆ ఏడాది విజయాల పరంపర ఆరంభమైంది. ఇందులో బాలకృష్ణ సరసన విజయశాంతి, రాధ హీరోయిన్లుగా నటించారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ  చిత్రంలో బాలయ్య హీరోయిజానికి ఇద్దరు హీరోయిన్ల గ్లామర్‌ తోడై బాక్సాఫీసు వద్ద బంపర్‌ హిట్‌ కొట్టిందీ సినిమా. మొదటివారమే రూ. కోటి గ్రాస్‌ సాధించి రికార్డు సృష్టించింది.  కేవీ మహదేవన్‌ అందించిన పాటలు ఆకట్టుకున్నాయి.

సీతారామ కళ్యాణం

పగ ప్రతీకారాలతో రగిలిపోయే రెండు గ్రామాల మధ్య చక్కటి ప్రేమకథను జోడించి సూపర్‌హిట్‌ చేశారు దర్శకుడు జంధ్యాల. బాలకృష్ణ ఇందులో  కాలేజీ కుర్రాడిగా నటించారు. బాలకృష్ణకు జోడిగా రజినీ చక్కగా ఒదిగిపోయింది. సినిమాలోని ‘రాళ్లల్లో ఇసుకల్లో..’ పాట ఎంతగా హిట్‌ అయిందో వీరిద్దరి జోడి అంతగా సూపర్‌హిట్‌ అయింది. ఓ పక్క ‘ముద్దుల క్రిష్ణయ్య’ థియేటర్లలో ఉండగానే ఏప్రిల్‌ 15న ఈ సినిమా విడులైంది.  ప్రేక్షకులు రెండు సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. ఇందులోని  కళ్యాణ వైభోగమే పాట ఇప్పటికీ పెళ్లి వేడుకల్లో వినిపిస్తూనే ఉంటుంది. 

అనసూయమ్మ గారి అల్లుడు

నందమూరి హరికృష్ణ నిర్మించిన ‘అనసూయమ్మ గారి అల్లుడు’ సినిమా జులై రెండున విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. దీనికి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. చక్రవర్తి సంగీతం అందించారు. అనసూయమ్మగా శారద కట్టిపడేసింది. ఆమె అడుగుజాడల్లో నడిచే కూతురిగా భానుప్రియ గర్వం ప్రదర్శించే యువతిగా మెప్పించింది. కడుపుబ్బా నవ్వించిన ఈ  వినోదాత్మక చిత్రానికి ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు.  200 రోజులు ఆడి రికార్డులు తిరగరాసింది.  ఈ సినిమా స్ర్కిప్ట్ ను పరిచూరి బ్రదర్స్‌ ఒకే రోజులో పూర్తిచేయడం విశేషం. 

దేశోద్ధారకుడు

హ్యాట్రిక్‌ విజయాలతో ఊపు మీదన్న బాలకృష్ణ ఆ వెంటనే ‘దేశోద్ధారకుడు’తో మరో బంపర్‌ హిట్‌ను ఇచ్చాడు. దీంతో ఆయన స్టార్‌డమ్‌ తారస్థాయికి చేరుకుంది. విజయవాడలో 108 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు గల బాలకృష్ణ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దీన్నిబట్టి ఆ సినిమా ఎంతగా అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తిందో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే దాదాపు రూ. 5 కోట్ల వసూళ్లు సాధించి పెట్టింది. గొల్లపూడి మారుతిరావు కథ అందించిన ఈ చిత్రాన్ని ఎస్‌.ఎస్‌. రవి చంద్ర తెరకెక్కించారు. బాలయ్య సరసన విజయశాంతి హీరోయిన్‌గా చేసింది. చక్రవర్తి సంగీతం ఉర్రూతలుగించింది. 

కలియుగ కృష్ణుడు

బాలయ్య 30వ సినిమాగా అదే ఏడాది విడుదలైన ‘కలియుగ కృష్ణుడు’ కూడా భారీ విజయం సాధించింది.  అప్పటికే నాలుగు సినిమాలు హిట్లతో దూసుకెళ్తున్న బాలకృష్ణ విజయపరంపరను ఈ సినిమాతో మళ్లీ కొనసాగించారు. కె. మురళీ మోహనరావు దర్శకుడు.  సెప్టెంబర్‌ 19న విడుదలైన ఈ చిత్రంలోని డైలాగ్స్‌కు అభిమానులు ఊగిపోయారు. హీరోయిన్‌ రాధ అందచందాలు సినిమాకు అదనపు హంగులుతెచ్చాయి. మామపై ప్రతీకారం తీర్చుకొనే కలియుగ కృష్ణుడుగా పవర్‌ఫుల్‌ పాత్రలో నటించారు బాలకృష్ణ. చక్రవర్తి పాటలు, పరుచూరి మాటలతో సినిమా సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచింది.  

అపూర్వ సహోదరులు

బాలకృష్ణ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం‘అపూర్వ సహోదరులు’. రామ్‌, అరుణ్‌ ఇలా రెండు పాత్రల్లో పంచ్‌లు, ఫైట్లతో రక్తికట్టించాడు యువరత్న.  దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్మించి తెరకెక్కించిన తొలి చిత్రమిది.  విజయశాంతి, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు సత్యానంద్‌ అందించిన డైలాగ్స్‌ అభిమానులను అలరించాయి. విజయదశమి కానుకగా అక్టోబర్‌ 9న విడుదలైంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అంతటా కలెక్షన్లు కురిపిస్తూ ఘనవిజయం సాధించింది.

 ఇలా ఒకే ఏడాది రెండు హ్యాట్రిక్‌లు సాధించిన బాలయ్యకు 1986 గోల్డెన్‌ ఇయర్‌గా నిలిచింది. దాంతో హీరో ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచారు బాలకృష్ణ. 6 బ్లాక్‌ బస్టర్లతో రికార్డు సాధించిన బాలయ్యకు ఆ ఏడాది మొదటి చిత్రం ‘నిప్పులాంటి మనిషి’ మాత్రం ఫ్లాప్‌గా నిలిచింది. రెండు నెలలకో సినిమాతో ఆ ఏడాది నందమూరి అభిమానులకు పండగను తీసుకొచ్చాడు బాలకృష్ణ.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని