అమ్మాయిగా మొదలై.. అమ్మగా!
close
Published : 23/06/2021 02:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మాయిగా మొదలై.. అమ్మగా!

టోక్యో ఒలింపిక్స్‌ ఇంకో 30 రోజుల్లో

2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో పోటీ పడ్డ వాళ్లలో చాలామంది ఆటకు గుడ్‌బై చెప్పేసి చాలా కాలమైంది. వారిలో ఎంతోమంది కోచ్‌లు అయిపోయారు. ఇంకొందరు ఆటకు సంబంధించి వేరే బాధ్యతల్లో ఉన్నారు. మరికొందరు వేరే రంగాల్లో స్థిరపడ్డారు. షూటింగ్‌ లాంటి ఆటల్లో అయితే వయసు మీదపడ్డా కొనసాగే అవకాశం ఉంది కానీ.. అథ్లెటిక్స్‌ లాంటి క్రీడల్లో మాత్రం 30 పైబడితే అంతే సంగతులు. ఉసేన్‌ బోల్ట్‌ అంతటి వాడు కూడా 30 పైబడగానే ట్రాక్‌కు టాటా చెప్పక తప్పలేదు. కానీ అభిమానులు ముద్దుగా చికెన్‌ లెగ్స్‌ అని పిలుచుకునే అమెరికా దిగ్గజ అథ్లెట్‌ అలిసెన్‌ ఫెలిక్స్‌కు మాత్రం ట్రాక్‌ మీద ప్రేమ ఇంకా తగ్గలేదు. ఏథెన్స్‌లో టీనేజీ అమ్మాయిగా ఒలింపిక్స్‌లో అడుగు పెట్టి, 200 మీటర్ల పరుగులో రజతం సాధించిన ఈ బక్కపల్చని భామ.. ఇప్పుడు అమ్మగా టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగబోతుండటం విశేషం. ఇప్పుడామె వయసు 35 ఏళ్లు. ఆమె పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. అయినా ఆమె జోరేమీ తగ్గలేదు. తాజాగా అమెరికాలో నిర్వహించిన ట్రాక్‌ ట్రయల్స్‌లో 400 మీటర్ల పరుగులో రెండో స్థానం సాధించిన ఫిలిక్స్‌.. టోక్యో బెర్తు ఖరారు చేసుకుంది. 2013 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ వరకు వ్యక్తిగత రేసుల్లో 200 మీ., 400 మీ. రెండింట్లోనూ పాల్గొంటూ వచ్చిన ఫెలిక్స్‌.. ఆ తర్వాతి నుంచి 400 మీ. పరుగులో మాత్రమే పోటీ పడుతోంది. దీంతో పాటు 4×400 మీ. రిలేలోనూ పరుగెడుతోంది. టోక్యోలో వ్యక్తిగత, రిలే రేసుల్లో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే 9 ఒలింపిక్‌ పతకాలు సాధించిన ఈ స్ప్రింటర్‌.. పదో పతకంపై గురి పెట్టడం విశేషం. ఒకవేళ ఆమె టోక్యోలో పోడియం ఎక్కితే అత్యధిక ఒలింపిక్‌  పతకాలు సాధించిన మహిళా అథ్లెట్‌గా మార్లీన్‌ ఓటీ (జమైకా, 9 పతకాలు)  రికార్డును అధిగమిస్తుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని