ఈ పర్యటన అయ్యేలోపు అలసిపోతారు
close
Updated : 23/06/2021 08:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ పర్యటన అయ్యేలోపు అలసిపోతారు

మా జట్టును ఓడించడం భారత్‌కు తేలిక కాదు
ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌

లండన్‌: ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో ఓ టెస్టు సిరీస్‌లో ఓడించడం భారత్‌కు అంత తేలిక కాదని అలిస్టర్‌ కుక్‌ అన్నాడు. ప్రస్తుత పర్యటన ముగిసేలోపు భారత ఆటగాళ్లు బాగా అలసిపోతారని ఈ ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ అన్నాడు. న్యూజిలాండ్‌తో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఈ నెల ఆరంభంలో ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టిన టీమ్‌ఇండియా.. సెప్టెంబరు వరకు ఇక్కడే గడపనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత డబ్ల్యూటీసీ ఫైనల్‌ అయ్యాక నెలన్నర విరామం తీసుకుని ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ ఆరంభించనుంది. ఈ సిరీస్‌ గురించి కుక్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ తన సామర్థ్యం ఏంటో చూపిస్తోంది. అయితే తర్వాత ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్‌ను సొంతగడ్డపై ఓడించడం చాలా కష్టం. సిరీస్‌ హోరాహోరీగానే సాగుతుందనుకుంటున్నా. సుదీర్ఘ కాలం పర్యటనలో ఉండటం వల్ల చివరికొచ్చేసరికి ఆటగాళ్లు మానసికంగా కూడా బాగా అలసిపోతారు. సిరీస్‌ను బాగా ఆరంభించినా.. అయిదు టెస్టుల్లో నిలకడగా ఆడి ఇంగ్లాండ్‌ను దాని సొంతగడ్డపై ఓడించాలంటే అసాధారణ ప్రదర్శన కావాలి. ఇక ఆరంభంలోనే భారత్‌ను దెబ్బ కొడితే ఇంగ్లాండ్‌ సిరీస్‌ సాధించడం పెద్ద కష్టం కాదు’’ అని చెప్పాడు. ఇంగ్లాండ్‌ కొన్ని నెలలుగా అమలు చేస్తున్న రొటేషన్‌ విధానం ప్రతికూల ఫలితాలను ఇచ్చిన నేపథ్యంలో ఇంగ్లాండ్‌ దాన్ని పక్కన పెట్టడం మంచిదని కుక్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘రూట్‌కు ఆ పద్ధతి కలిసి రాలేదు. తన అత్యుత్తమ ఆటగాళ్లలో అతను బరిలోకి దిగలేకపోయాడు. స్టోక్స్‌, బట్లర్‌, బెయిర్‌స్టో, మొయిన్‌ అలీ లాంటి ఆటగాళ్ల అనుభవం అందరికీ ఉండదు. వీళ్లు ఆటలో ఎంతో ప్రభావం చూపగలరు. రొటేషన్‌ పేరుతో సరైన నిర్ణయాలు తీసుకోలేదని అనుకుంటున్నా. భారత్‌తో సిరీస్‌కు అందరు ఆటగాళ్లూ అందుబాటులోకి వస్తారు కాబట్టి జట్టు మెరుగుపడుతుందనుకుంటున్నా’’ అని కుక్‌ అన్నాడు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని