close
Published : 27/03/2021 15:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సాయి పల్లవి డ్యాన్స్‌కి నేను పెద్ద అభిమానిని

‘ఓకే బంగారం’లోని ‘మనమన మెంటల్‌ మదిలో’, కిక్‌-2లోని ‘నువ్వే నువ్వే ప్రాణం’, 24లో ‘మనసుకే’.. తాజాగా విడుదలై విపరీతంగా అలరిస్తోన్న లవ్‌స్టోరీలోని ‘ఏవో ఏవో కలలే’ వీటంన్నింటినీ ఆలపించింది జొనితా గాంధీనే. హిందీ, ఇంగ్లిష్‌, తమిళం, బెంగాలీ, గుజరాతీ, తెలుగే కాదు జర్మనీ, ఇటలీ, ఫ్రెంచ్‌ భాషల్లోనూ తన గళం వినిపించి అంతర్జాతీయంగా అభిమానుల్ని సంపాదించుకుంది. ఇదంతా ఎలా సాధ్యమైందో ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా పంచుకుంది.  

తాజాగా పాడిన ‘ఏవో ఏవో కలలే’(లవ్‌స్టోరీ) పాటకి మంచి ఆదరణ లభిస్తోంది. ఎలా ఫీలవుతున్నారు?

చాలా చాలా ఆనందంగా ఉంది. తెలుగులో ఇది నా కమ్‌ బ్యాక్‌ సాంగ్‌ అని చెప్పొచ్చు. ‘నెక్ట్స్‌ ఏంటి?’ చిత్రం తర్వాత కాస్త విరామం వచ్చింది. తమిళ డబ్బింగ్‌ చిత్రాల్లోని గీతాలతో అలరించినప్పటికీ నేరుగా తెలుగు సినిమాలో పాడే అవకాశం ‘లవ్‌ స్టోరీ’ ఇచ్చింది. ఎప్పుడైనా తెలుగు శ్రోతలు సాదరంగా ఆహ్వానిస్తుంటారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి కృతజ్ఞతలు.

తెలుగులో చక్కగా ఆలపించే మీకు తెలుగు సాహిత్యం అర్థమవుతుందా?

నాకు తెలుగు తెలీదు. కానీ, ప్రతి పదాన్ని నా మాతృకలో అనువదించుకుని పాటని ఆస్వాదిస్తా.

‘లవ్‌ స్టోరీ’ సంగీత దర్శకుడు పవన్‌ సి.హెచ్‌.తో పనిచేయడం ఎలా అనిపించింది?

పవన్‌ నాకు ఎప్పటి నుంచో తెలుసు. తను ఎ.ఆర్‌. రెహమాన్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి వచ్చారు. నేను రెహమాన్‌ స్టూడియోకి వెళ్లినప్పుడు తన ప్రతిభని గమనించేదాన్ని. తెలుగు చిత్రంతో సంగీత దర్శకుడిగా మారడం సంతోషం. ఆయన స్వరానికి నా గళం తోడవడం థ్రిల్లింగ్‌గా ఉంది.

రెహమాన్‌, పవన్‌.. వీళ్లిద్దరి మధ్య తేడా గమనించారా?

ఇది చెప్పడం కష్టమైన పని. ఒకరితో ఒకరిని పోల్చలేం. రెహమాన్‌ చాలా సింపుల్‌గా, కూల్‌గా ఉంటారు. ఉన్నత వ్యక్తిత్వం ఆయనది. అలాంటి మనిషి దగ్గర పనిచేసిన పవన్‌ సైతం ఎంతో స్నేహంగా ఉంటారు. రెహమాన్‌ గారి దగ్గర పనిచేసిన వారిలో ది బెస్ట్‌ మెంటార్‌ తను.

మీ పాటకి డ్యాన్స్‌ చేసిన నటులు నాగ చైతన్య, సాయి పల్లవిని కలిశారా?

లేదండీ! వాళ్లిద్దరికీ నేను అభిమానిని. అయినా కలవలేకపోయాను. సాయి పల్లవి డ్యాన్స్‌ని అమితంగా ఇష్టపడతా. నేను పాడిని పాటకు ఆమె నర్తించడం నాకో సర్‌ప్రైజ్‌. త్వరలోనే వాళ్లని కలుస్తానని ఆశిస్తున్నాను.

మీరు పాడిన తెలుగు పాటల్లో మీకు బాగా నచ్చింది?

హా.. హా.. అలా చెప్పడం కష్టం. ఎందుకంటే అన్ని నాకు ఇష్టమైనవే. కానీ, మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా ‘నువ్వే నువ్వే’ (కిక్‌-2) గీతమంటే ఎక్కువ ఇష్టం. తర్వాత ‘దైవం రాసిన కవిత’ (24), ‘ఓఎంజీ పిల్లా’ (సర్కార్‌).

వేరే గాయనీగాయకుల ప్రభావం మీపై ఉంటుందా? ఫలానా వాళ్ల స్టైల్‌లో పాడాలనుకుంటారా?

అలా ఎప్పుడూ అనుకోలేదు. ఎవరి స్టైల్‌ వాళ్లది కదా. నాదైన శైలిలోనే ప్రత్యేకత చూపించేందుకు ఇష్టపడతా.

మీ అభిమాన గాయకులెవరు?

పెద్ద జాబితా ఉంది. ఆశాభోంస్లే, జెస్సీ జే, హరిచరణ్‌, చిన్మయి తదితరుల పాటలు ఎక్కువగా వింటుంటా.

ఏ గాయకుడితో మరోసారి పాట ఆలపించాలని ఉంది?

సిధ్‌ శ్రీరామ్‌. గతంలో తనతో కలిసి ‘సర్కార్‌’లో, ‘24’లో పాడాను.

జొనితా గాయని కాకపోయి ఉంటే?

గాయని కాకపోయి ఉంటే ఫైనాన్స్‌ రంగంలో స్థిరపడేదాన్ని.

పాటలు పాడేముందు ఎలాంటి కసరత్తులు చేస్తారు?

ఓ సారి పాటకు సంబంధించిన డెమో వింటాను. దాని కోసం ఎక్కువగా అభ్యాసం చేయను. సంగీత దర్శకుడి సలహాలు తీసుకుని మైక్‌ ముందుకెళ్లి పాడేస్తుంటా.

ఒకటి కాదు రెండు కాదు చాలా భాషల్లో పాడటం మీకెలా సాధ్యమవుతోంది? భాష పరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు?

అది మన ఆసక్తి మీదే ఆధారపడి ఉంటుంది. సంగీతానికి భాషాబేధం లేనట్టే  నేనూ కొన్ని భాషలకే పరిమితం అవ్వాలనుకోలేదు. నాకు తెలిసిన వాళ్ల సహకారంతో ఆయా భాషల పాటల్ని ఇంగ్లిష్‌లో అనువదించుకుంటాను.

ఏ భాషలో తేలికగా పాడగలుగుతారు?

ఇంగ్లిష్‌. ఆ తర్వాత హిందీ.

తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మీ అభిప్రాయం?

భాష రాకపోవడం వల్ల నేను ఎప్పుడూ తెలుగు సినిమాలు చూడలేదు. కానీ, నాతో పాటు నా స్నేహితులకి టాలీవుడ్‌తో అనుబంధం ఉంది. గాయకులుగా, సంగీత దర్శకులుగా చాలా మంది ఇక్కడ పనిచేస్తున్నారు. తెలుగు సినిమాల్లోని సంగీతం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నేను దాన్ని ప్రేమిస్తాను. అందుకే  మళ్లీ మళ్లీ తెలుగు సినిమాలకి పాడాలనుకుంటాను.

యూట్యూబర్‌ నుంచి గాయనిగా ప్రయాణం ఎలా సాగింది?

ఏడేళ్ల వయసులో సంగీతంపై ఆసక్తి పెరిగింది. చదువు కొనసాగిస్తూనే పాటలు పాడటం అలవాటుగా మారింది. అలా నేను చేసిన ఆల్బమ్స్‌ని యూట్యూబ్‌ వేదికగా పంచుకునేదాన్ని. వాటికి ఆదరణ పెరగడంతో నాకు కాస్త ధైర్యం వచ్చింది. గాయనిగా స్థిరపడాలని లక్ష్యంగా చేసుకున్నాను.

సినీ అవకాశం ఎలా వచ్చింది?

యూట్యూబ్‌లో నా మ్యూజిక్‌ ఆల్బమ్ప్‌ చూసిన సంగీత ద్వయం విశాల్‌-శేఖర్‌ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇందులో టైటిల్‌ సాంగ్‌ ఆలపించాను. తొలి గీతమే ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యంతో కలిసి పాడటం, షారుఖ్‌ ఖాన్‌-దీపికా పదుకొణె చిత్రం కావడం మరిచిపోలేని అనుభూతి పంచాయి.

ప్రైవేటు ఆల్బమ్స్‌, సినిమా పాటలకీ వ్యత్యాసం ఏంటి?

సినిమా పాటలకు కొన్ని పరిధులుంటాయి. హీరోని, కథని.. దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా రాయాలి, పాడాలి. అదే ప్రైవేటు ఆల్బమ్స్‌కి అవేవీ ఉండవు. పూర్తి స్వేచ్ఛ తీసుకోవచ్చు.

మీకు ఈ రెండింటిలో ఏది సౌకర్యంగా ఉంటుంది‌?

60 శాతం ఆల్బమ్స్‌ , 40 శాతం సినిమా పాట.

నేను దిల్లీలో పుట్టాను. నా తొమ్మిది నెలల వయసులో  టొరంటో(కెనడా)కి వెళ్లాం. అక్కడి వెస్టర్న్‌ ఒంటారియో విశ్వవిద్యాలయం  నుంచి బి.హెచ్.ఎస్‌సి, హెచ్‌బీఏ పట్టా పొందాను. ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నా. నాన్న దీపక్‌ గాంధీకి సంగీతమంటే ఇష్టం. ఆయన వల్ల నాకూ ఈ అభిరుచి కలిగింది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని