వీళ్ల కథను మూవీ తీస్తే హిట్‌ పక్కా - kannada young actor rishi and his wife swathi love story
close
Updated : 10/06/2021 17:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీళ్ల కథను మూవీ తీస్తే హిట్‌ పక్కా

బయటకు వచ్చిన యువ నటుడి లవ్‌ స్టోరీ

బెంగళూరు: ‘ప్రేమ.. ఇది ఎప్పుడు?ఎలా? పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు’ అని ఓ సినిమాలో డైలాగ్‌ ఉంది.. అచ్చం అలాగే వీళ్ల స్టోరీలోనూ జరిగింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌ కావాలని కలలు కనే ఓ అబ్బాయి.. ఓ సాధారణ యువతితో ప్రేమలో పడితే.. వాళ్ల జీవితానికి పెళ్లి అనే శుభం కార్డు ఎలా పడింది.. వింటుంటే సినిమా కథలా ఉన్నప్పటికీ.. ఇది రియల్‌ లైఫ్‌ స్టోరీ. కన్నడంలో ఇప్పుడిప్పుడే స్టార్‌గా ఎదుగుతున్న యువ నటుడు రిషి అతని సతీమణి స్వాతిల ప్రేమకథ ఇది. 2019లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. తమ ప్రేమ కథ గురించి తాజాగా బయటపెట్టారు.

‘పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం నిమిత్తం బెంగళూరు వెళ్లాను. ఆ ప్రాంతం నాకెంతో కొత్త.. దాంతో ఓరోజు సాయంత్రం నగరంలోని ఓ డ్రామా థియేటర్‌కు వెళ్లాను. మొదటిసారి రిషిని స్టేజ్‌పై చూశాను. ఆ డ్రామాలో అతనే కథానాయకుడు. ఎంతో అందంగా.. చూడగానే ఆకర్షించేలా ఉన్నాడు. అతని చిరునవ్వు నాకెంతో నచ్చింది. విరామ సమయంలో రిషిని కలిసి.. ‘మీ నటన చాలా బాగుంది. డ్యాన్స్‌ చాలా బాగా చేస్తున్నారు’ అని చెప్పాను. దానికి అతను ఎంతో సిగ్గుపడ్డాడు. ఎందుకో తెలియదు రిషి నాకు తొలి చూపులోనే నచ్చేశాడు. అందుకే ఇంటికి రాగానే ఫేస్‌బుక్‌లో అతని గురించి సెర్చ్‌ చేసి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టాను. అలా మేమిద్దరం చాట్‌ చేసుకుంటూ ఉండేవాళ్లం’

‘‘మా మధ్య పరిచయం కాస్త స్నేహంగా మారింది. తరచూ ఫోన్‌లు, వాట్సాప్‌ సందేశాలు పెరిగాయి. కొన్ని నెలలు గడిచేసరికి మేమిద్దరం తరచూ కలుసుకోవడం ప్రారంభించాం. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకునేవాళ్లం. నటుడిగా అతను చేస్తున్న ప్రయత్నాలు, అందుకు పడుతున్న శ్రమనంతా నాతో పంచుకునేవాడు. వ్యక్తిగత విషయాలు కూడా పంచుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగింది. అలా, ఓసారి ‘నువ్వంటే నాకిష్టం’ అని చెప్పాను. దానికి రిషి.. ‘నేను కూడా అదే చెప్పాలి అనుకుంటున్నాను’ అన్నాడు. అదే రోజు సాయంత్రం ఫోన్‌లో మేమిద్దరం ‘ఐ లవ్‌ యూ’ చెప్పుకున్నాం. అప్పటికి రిషి ఇంకా అవకాశాల వేటలోనే ఉన్నాడు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు నేను నా ఉద్యోగ జీవితంలో బిజీ అయిపోయాను. ఎప్పుడో ఉదయం వెళ్తే, ఆఫీస్‌ నుంచి వచ్చేసరికి సాయంత్రం అయ్యేది. దాంతో మేమిద్దరం వారంలో ఒక్కసారి కూడా సరిగ్గా కలవలేకపోయాం. అయితే, కలిసిన ప్రతిసారీ నన్ను ఎంతో ఉత్సాహ పరిచేవాడు. అతనితో మాట్లాడితే ఆఫీస్‌లో నేను పడిన శ్రమనంతా మర్చిపోయేదాన్ని. తను కూడా అవకాశాల కోసం తిరుగుతూ ఎంత బిజీగా ఉన్నా, ఎల్లప్పుడూ నన్ను సపోర్ట్‌ చేస్తూనే ఉండేవాడు. నాకు కథలు రాయడం అలవాటు. ఈ విషయంలో రిషి ఎప్పుడూ సాయం చేస్తూ, ప్రోత్సహిస్తూ ఉండేవాడు. నేను రాసిన కథలు చదివి బాగున్నాయో లేవో చెప్పేవాడు. తనకి వచ్చిన ఆలోచనలను నాతో పంచుకునేవాడు. కొత్త కొత్త పుస్తకాలు కొని నాకు బహుమతులు పంపుతూ సర్‌ప్రైజ్‌ చేసేవాడు’’

‘రిషి కథానాయకుడిగా నటించిన మొదటి చిత్రం ‘ఆపరేషన్‌ అలమేలమ్మ’ విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ‘ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా! నీకు ఓకేనా?’ అని అడిగాడు. దానికి నేను ఓకే అన్నాను. అలా మేమిద్దరం తమిళ, కన్నడ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నాం. అయితే, తాళి కట్టే సమయంలో.. ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అంటూ రిషి అడిగాడు. దానికి నేను.. ‘ఇప్పటికే చాలా ఆలస్యమైంది’ అన్నాను. రిషితో జీవితం సంతోషంగా ఉంది’ అని స్వాతి తమ ప్రేమ కథ గురించి చెప్పేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని