close
Published : 26/03/2021 22:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘తెల్లవారితే గురువారం’లో అదే ఆసక్తికరం

దర్శకుడు మణికాంత్‌

తెలుగు చిత్ర పరిశ్రమలో యువ దర్శకుల హవా కొనసాగుతుంది. ఈ వరసలో నిలిచేందుకు వచ్చేస్తున్నారు మణికాంత్‌ గెల్లీ. శ్రీ సింహా కథానాయకుడిగా ‘తెల్లవారితే గురువారం’ చిత్రం తెరకెక్కించారాయన. వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మించాయి. ఈ  సినిమా మార్చి 27న విడుదలవుతున్న సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు మణికాంత్‌. 

అలా దర్శకుడిగా...

చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. అలా అని చదువుని నిర్లక్ష్యం చేయలేదు.  ఎన్‌.ఐ.టి. వరంగల్‌లో బీటెక్‌ చేశాను. ఆ సమయంలో సినిమాలపై ఉన్న ఆసక్తితో లఘు చిత్రాలు తీశాను. ఆ తర్వాత సినిమాల్లోకి వద్దామంటే ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఉద్యోగం చేయాల్సి వచ్చింది. కొన్నాళ్లకు మా సోదరుడికి ఉద్యోగం రావడంతో నేను ఇటువైపు వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే నా భార్యే కారణం. తను ఎంతో ప్రోత్సాహం అందించింది.  ప్రయత్నాల్లో భాగంగా ‘ఆర్ ఎక్స్‌ 100’ చిత్రానికి అసోసియేటివ్‌ దర్శకుడిగా  పని చేశా. నా ప్రతిభని గుర్తించి ఆ చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి నేను దర్శకుడిగా మారొచ్చని చెప్పారు. అలా దర్శకుడ్ని అయ్యాను.

అదే ఆసక్తికరం..

నా స్నేహితుడు ప్రశాంత్‌ వల్ల శ్రీ సింహాకి ఈ స్ర్కిప్టు వినిపించాను. ఆయనకు బాగా నచ్చి నిర్మాతల దగ్గరకి తీసుకెళ్లారు. పెళ్లి నేపథ్యంలో సాగే కథ ఇది. పెళ్లి కొడుకు పెళ్లి మండపం నుంచి ఎందుకు పారిపోయాడు? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? అనేదే ఆసక్తికరం. గోదావరి యాసలో సాగుతూ మంచి వినోదం పంచుతుంది. ముఖ్యంగా సత్య, హీరో మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి.

పాట విని తీసుకున్నా..

నాకు జూనియర్‌ ఎన్టీఆర్‌  అంటే అభిమానం. ‘అరవింద సమేత’లోని పెనివిటి పాట నన్ను అమితంగా ఆకట్టుకుంది. దాన్ని పాడిన కాల భైరవతో నా సినిమాలో ఓ పాటైనా పాడించాలనుకున్నాను. అయితే ఆయన సంగీత దర్శకుడిగా మారడంతో ఈ సినిమాకు ఆయన్నే తీసుకున్నాను. కథలో భాగంగా మూడు పాటలు అందించారు. వాటి వల్లే సినిమాపై అంచనాలు పెరిగాయి. నేపథ్య సంగీతమూ అలరిస్తుంది.

తారక్‌తో కథ చెప్పించాలనుకున్నా..

శ్రీ సింహా చాలా బాగా నటించాడు. చిత్రశుక్ల ఇప్పటికే పలు చిత్రాల్లో కనిపించి మెప్పించింది. ఇందులోనూ మంచి నటన చూపింది. మిశా నారంగ్‌ కొత్త అమ్మాయి అయినా పాత్ర మేరకు  బాగా చేసింది.  కథ, మాటలు నాగేంద్ర అందించారు. రెండు కథలు రాసుకున్నాను. ఈ చిత్రం విడుదలయ్యాక వాటి గురించి ఆలోచిస్తాను. ఎప్పటికైనా తారక్‌తో సినిమా చేయాలనే కోరిక ఉంది. ఆయనతో ఈ సినిమాకి వాయిస్‌ ఓవర్‌ చెప్పించాలనుకున్నా. కానీ సినిమాలో నటించిన హీరో చెబితేనే బాగుంటుందని చెప్పించలేదు. అది జరగకపోయినా ముందస్తు విడుదల వేడుకకు ఎన్టీఆర్‌ రావడం చాలా ఆనందంగా ఉంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని