నా లైఫ్‌లో తొలిసారి కంపించిపోయా!  - shaken for the first time in my life says mukesh khanna on his sisters death
close
Published : 13/05/2021 20:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా లైఫ్‌లో తొలిసారి కంపించిపోయా! 

ఆ దేవుడు ఎలా కాలిక్యులేట్‌ చేస్తున్నాడో అర్థంకావట్లేదు

సోదరి మృతిపై నటుడు ముకేశ్‌ ఖన్నా ఆవేదన

ముంబయి: తన సోదరి మరణంపై బాలీవుడ్‌ నటుడు ముకేశ్‌ ఖన్నా తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే, కరోనాతో తానూ చనిపోయినట్టు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున జరిగిన దుష్ప్రచారం పైనా విచారం వ్యక్తంచేశారు. ముకేశ్‌ ఖన్నా సోదరి కమల్‌ కపూర్‌ కరోనా నుంచి బయటపడినప్పటికీ ఊపిరితిత్తుల్లో సమస్యతో ప్రాణాలు విడిచారు. ఈ మేరకు ముకేశ్‌ ఖన్నా ఆమెతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘‘నేను చనిపోయినట్టు చెలరేగిన దుష్ప్రచారంపై నిజం చెప్పేందుకు నిన్న గంటలకొద్దీ  కష్టపడ్డాను. నాపై ఇంత భయంకరంగా దుష్ప్రచారం జరుగుతున్నట్టు తెలీదు. ఈ రోజు నా ఏకైక సోదరి కమల్‌ కపూర్‌ దిల్లీలో చనిపోయారు. ఆమె మరణం పట్ల చాలా బాధపడుతున్నా. 12 రోజుల్లో కొవిడ్‌ 19ని ఓడించిన ఆమె.. ఊపిరితిత్తుల్లో ఇబ్బందితో ప్రాణాలు కోల్పోయారు. దేవుడు ఎలా కాలిక్యులేట్‌ చేస్తున్నాడో అర్థం కావడంలేదు. నిజంగా, నా జీవితంలో తొలిసారి కంపించిపోయా’’ అని తన గుండెలోని బాధను వెల్లడించారు. 

అలాగే, అంతకముందు తనపై జరిగిన దుష్ప్రచారం పట్ల ఓ ప్రత్యేక వీడియోను ముకేశ్‌ ఖన్నా విడుదల చేశారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని.. కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చేరినట్టు వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. సామాజిక మాధ్యమాలతో ఇదే సమస్య అని, ఇలాంటి వాటిని సృష్టించే మానసిక అస్థిరత్వం కలిగిన వ్యక్తులకు చికిత్స ఏముంటుందని ప్రశ్నించారు. వారు చేసే పాపాలకు ఎవరు శిక్షలు వేస్తారన్నారు. ఫేక్‌ న్యూస్‌ ఆపాలని కోరారు. 

‘‘మీ ఆశీస్సులతో నేను పూర్తి ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నాను. నాకు కరోనా సోకలేదు.. ఏ ఆస్పత్రిలోనూ చేరలేదు. ఇలాంటి పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారో, ఏ ఉద్దేశంతో వీటిని వ్యాప్తి చేస్తున్నారో నాకు తెలియదు. ఫేక్‌ వార్తలతో ప్రజల భావోద్వేగాలను దెబ్బతీస్తున్నారు’’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. 
ముకేశ్‌ ఖన్నా పలు సినిమాలతో పాటు అనేక టీవీ సీరియళ్లలోనూ నటించారు. శక్తిమాన్‌తో మంచి ప్రాచుర్యం పొందారు. అంతేకాకుండా మహాభారతంలో భీష్ముడి పాత్రలో ఆయన ప్రేక్షకుల్ని మెప్పించారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని