MAA Election: అలాగైతే ఎన్నికల నుంచి తప్పుకొంటా! - manchu vishnu on maa election
close
Updated : 12/07/2021 19:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Election: అలాగైతే ఎన్నికల నుంచి తప్పుకొంటా!

హైదరాబాద్‌: ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికలకు ఏకగ్రీవం చేయాలని సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. తాజాగా ‘మా’ అధ్యక్ష ఎన్నికలపై మరో లేఖరాశారు. పెద్దలు ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని అన్నారు. ఏకగ్రీవం చేయని పక్షంలో పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. ‘మా’ అసోసియేషన్‌ భవనాన్ని తాను, తన కుటుంబ సభ్యులం కట్టిస్తామని తెలిపారు.

‘‘నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మద్రాసులో ‘తెలుగు సినీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ ద్వారా తెలుగు సినీ నటీనటుల కష్టసుఖాలు తెలిసిన తెలుగువారే అధ్యక్షులుగా ఉంటూ చాలా మంచి పనులు చేశారు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌ వచ్చింది. ఇక్కడ పెద్దలందరూ కలిసి ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఏర్పాటు చేశారు. నాన్నగారు పదవిలో ఉన్నా, లేకపోయినా సినీ కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలబడ్డారు. ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను గానీ, నా కుటుంబం గానీ వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం’’

‘‘2015లో దాసరి నారాయణరావు గారు, మురళీ మోహన్‌గారు ఇద్దరూ కలిసి నన్ను అధ్యక్షుడిగా ఉండమని అడిగితే, ఆరోజు నాన్నగారు అడ్డుపడి ‘ఇప్పుడే ఈ వయసులో ఎందుకు’ అని నన్ను వద్దని గురువు గారికి సర్దిచెప్పారు. ఇంతకు ముందు పనిచేసిన వారందరూ చక్కగా చేశారు. ‘మా’ అసోసియేషన్‌లో చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కావని అనుకుంటున్నా. మనం గతాన్ని తవ్వుకోకుండా ముందుకెళ్లి మంచి పనులు ఎలా చేయాలో ఆలోచిద్దాం’’

‘‘మా’ అసోసియేషన్‌  కోసం కట్టించబోయే బిల్డింగ్‌ అజెండాగానే ఇప్పటికీ ఎన్నికలు జరుగుతున్నాయి. మా బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా నేను ఇస్తా. నా కుటుంబంతో కలిసి ఆ బిల్డింగ్‌ని నేను నిర్మిస్తా. మన దృష్టిలో అది అంత ముఖ్యమైన విషయం కాదు. ఇండస్ట్రీలో యూనియన్ మెంబర్‌షిప్‌ ఉన్న వాళ్లే సినిమాల్లో పని చేయాలి, కానీ, ఇక్కడ మెంబర్‌షిప్‌ లేని చాలామంది పనిచేస్తున్నారు. కొత్తవాళ్లని ప్రోత్సహిద్దాం! తప్పులేదు.. కానీ, సినిమాల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరు ‘మా’ సభ్యుడు అవ్వాల్సిందే. భారతదేశంలో ఉన్న అన్ని సినీ అసోసియేషన్స్‌తో  మన ‘మా’ గట్టి సంబంధాలు కలిగి ఉండాలి. మనమంతా నిర్మాతలకు సహకరించాలి’’

‘‘నిర్మాతలు లేకపోతే మనం లేం. ఇది ప్రతి నటుడు గుర్తుంచుకోవాల్సిన విషయం. నేను ఇప్పటికీ నమ్మేది ఒక్కటే.. ఇండస్ట్రీ ప్రముఖులు, ఇతర పెద్దలు కొంతమంది పెద్దలు కూర్చుని ‘మా’ కుటుంబాన్ని నడిపించడానికి వాళ్లే ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకుంటాను. ఏకగ్రీవం కాని పక్షంలో పోటీకి నేను సిద్ధం. పెద్దలను గౌరవిస్తాం.. వాళ్ల సలహాలు పాటిస్తాం.. మా యంగర్ జనరేషన్‌ని ఆశీర్వదించి.. ‘మా’ ప్రెసిడెంట్‌గా  నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ’’ -మీ విష్ణు మంచు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని