Mangli: ‘బోనం పాట’లో మార్పు - mangli bonam song with new lyrics
close
Published : 22/07/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mangli: ‘బోనం పాట’లో మార్పు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి ఏడాది బోనాలు, బతుకమ్మ, సంక్రాంతి పండగల సందర్భంగా భక్తిపాటలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని మంగ్లీ. ఈసారి కూడా ఆమె బోనాల సందర్భంగా అమ్మవారిని ఉద్దేశిస్తూ ఓ పాటను విడుదల చేసింది. అయితే.. ‘చెట్టు కింద కూసున్నవమ్మ.. సుట్టం లెక్క ఓ మైసమ్మా..’ అంటూ సాగే పాట వివాదాల్లో చిక్కుకుంది. అందులో కొన్ని లిరిక్స్‌ అమ్మవారిని తక్కువ చేసేలా ఉన్నాయంటూ కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గాయని మంగ్లీ సోషల్‌ మీడియా వేదికగా సుదీర్ఘమైన పోస్టుతో స్పందించింది. ఈ పాట తాను రాసింది కాదని, జానపద రచయితగా ఎంతో అనుభవం ఉన్న పాలమూరు రామస్వామి రాశారని, ఆయన మీద గౌరవంతోనే పాటలో లిరిక్స్‌ మార్చకూడదని అనుకున్నామని, మొత్తానికి ఆయన అనుమతితోనే పాటలో మార్పులు చేసినట్లు ఆమె పేర్కొంది. లిరిక్స్‌ మార్చి కొత్త పాటను ఆమె మళ్లీ విడుదల చేసింది.

‘‘నన్ను, నా పాటను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న అందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం నేను పాడిన బోనాల పాట గురించి చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ పాటను ప్రఖ్యాత జానపద పాటల రచయిత, గాయకులు, 80 ఏళ్ల పాలమూరు రామస్వామిగారు 25 ఏళ్ళ క్రితమే రచించారు. పాలమూరు ప్రాంతంలో కోలాటంలో ఈ పాట చాలా ప్రసిద్ది. 2008లో ఈ పాటను సీడీ రూపంలో కూడా విడుదల చేశారు. రామస్వామిగారు 300 జానపదాలతోపాటు గ్రామదేవత మైసమ్మ మీద ఆయన 100 కోలాటం పాటలు రచించారు. ఆ పాటలన్నీ నిందాస్తుతిలోనే ఉన్నాయి. ‘చెట్టుకింద కూసున్నవమ్మ చుట్టం లెక్క ఓ మైసమ్మ’ అని సాగే ఈ పాటలో ‘మోతెవరి’ అనే పదంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రచయిత రామస్వామిగారి అభిప్రాయం ప్రకారం మోతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థం. ప్రస్తుతం ఆ పదం వ్యతిరేక పదంగా వాడుకలోకి వచ్చిందన్నది వాదన. నిందాస్తుతిలో కోలాటం రూపంలో సాగే ఈ పాటను మాకు తెలిసిన కొంతమంది కళాకారులు, పెద్దల సలహాలు తీసుకుని చిత్రీకరించాం.

నేను పండితుల కుటుంబం నుంచి రాలేదు. చెట్లు, పుట్టలను కొలిచే గిరిజన జాతికి చెందిన తండా నుంచి వచ్చిన ఆడబిడ్డను. బతుకమ్మ, బోనాలు పండగల్లాగే మా బంజారాలో తీజ్, శీతలా (సాతి భవాని) పండగల్లో పకృతినే దేవతలుగా పూజిస్తాము. మాకు కష్టం కలిగినా సంతోషం వొచ్చినా మేము చెప్పుకునేది నమ్ముకున్న గ్రామదేవతలకే. వారిని మా ఇంట్లో సభ్యులుగా నమ్ముతాం. మేము తినేదే, తాగేదే ఆ దేవతలకు నైవేద్యంగా పెడతామం. నేను సింగర్‌గా అంతో ఇంతో ఎదిగింది కూడా అమ్మవారి కృప, ఆంజనేయ స్వామి దీవెన, మీ అభిమానం, ఆదరణ వల్లనే అని నమ్ముతాను. అందుకే నేను పుట్టిన తండాలో ఆంజనేయ స్వామి గుడికట్టించాను. మా తాతలనాటి ఆంజనేయస్వామి విగ్రహానికి గుడికట్టించి నేడు ధూప దీప, నైవేద్యాలతో పూజలు చేస్తున్నా.. ఏనాడు గుడికి వెళ్ళని వాళ్ళు, బోనం ఎత్తని వాళ్ళు కూడా నా జాతి, ప్రాంతం, కులం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసమో గమనించాలి. ఇంట్లో ఓ ఆడబిడ్డగా కడుపులో పెట్టుకున్నారు. ఇంత అదృష్టం, అవకాశం కల్పించిన మీకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనాలు’’ అని ఆమె ఆ పోస్టులో పేర్కొంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని