చిత్రం: మిడ్నైట్ మర్డర్స్
నటీనటులు: కుంచకో బోబన్, శ్రీనాథ్ బసి, షరాఫ్ యుద్దీన్, ఉన్నిమయ ప్రసాద్, జీనూ జెసెఫ్
సినిమాటోగ్రఫీ: సైజు ఖలీద్
ఎడిటింగ్: సైజు శ్రీధరన్
నిర్మాత: ఆషిక్ ఉస్మాన్
రచన, దర్శకత్వం: మిథున్ మ్యానువల్ థామస్
విడుదల: ఆహా
భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుడిని ఆకట్టుకునే చిత్రాలు కొన్ని ఉంటాయి. ఆ చిత్రాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండవు. పవర్ఫుల్ డైలాగ్‌లు ఉండవు. కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచ్‌లు ఉండవు. కేవలం చిన్న ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రేక్షకుడిని రెండున్నర గంటలపాటు కుర్చీలో కూర్చోబెడుతుంది. అదే క్రైమ్ థ్రిల్లర్. ప్రతి భాషలోనూ ఈ జోనర్లో వచ్చిన అనేక సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అలాంటి చిత్రాల్లో మలయాళంలో వచ్చిన ‘అంజామ్ పథిరా’ ఒకటి. 2020 జనవరిలో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా ‘మిడ్నైట్ మర్డర్స్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది? మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ కథ ఏంటి? ఎలా ఉంది?
కథేంటంటే: డాక్టర్ అన్వర్ హుస్సేన్ (కుంచకో బోబన్) సైకాలజిస్ట్. అంతేకాదు, తనుండే సిటీ పోలీస్‌శాఖలో అనధికారికంగా క్రిమినాలజిస్ట్‌గా పనిచేస్తూ పోలీసులకు సలహాలు ఇస్తుంటాడు. వివిధ కేసుల విచారణలో పోలీసులకు సహాయపడుతుంటాడు. ఒకరోజు విశాఖ పోలీస్‌శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న అభిమన్యు కౌశిక్ దారుణ హత్యకు గురవుతాడు. ఆయన కళ్లు, గుండెను తొలగించి శవాన్ని ఖాళీ ప్రదేశంలో పడేస్తారు. అయితే, ఎవరు హత్య చేశారో తెలియదు. ఈ కేసు విచారణలో ఉండగానే మరో పోలీస్ ఆఫీసర్ కూడా అదే విధంగా హత్యకు గురవుతాడు. దీంతో విశాఖలో పోలీస్‌లు రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు. మృతదేహం స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో కళ్లకు గంతలు లేకుండా ఉన్న న్యాయదేవత ప్రతిమను గుర్తిస్తారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, డాక్టర్ అన్వర్ హుస్సేన్ సహాయంతో హంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడతారు. మరి ఈ హత్యలు చేసేది ఎవరు? కేవలం పోలీసులనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు? అన్వర్ ఈ కేసును ఎలా ఛేదించాడు? హంతకుడిని పట్టుకున్నారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: ‘అతడు’ సినిమాలో ఒక డైలాగ్ ఉంది? ‘ఎవడైనా కోపంగా కొడతాడు.. లేదా బలంగా కొడతాడు.. వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు’’ ‘మిడ్ నైట్ మర్డర్స్’ చూస్తున్నంత ఇదే గుర్తొస్తుంది. క్రైమ్ థ్రిల్లర్‌కు ఏం కావాలో దర్శకుడు దాన్ని చాలా పద్ధతిగా, శ్రద్ధగా, ఉత్కంఠగా చూపించాడు. కథ, అందులోని కీలక పాత్రలను పరిచయం చేయడానికి మొదటి 10 నిమిషాలు తీసుకున్న దర్శకుడు 11 నిమిషం నుంచి అసలు కథ మొదలు పెట్టాడు. కాళ్లూ చేతులూ కట్టేసి.. కళ్లు, గుండెను పీకేసి అతి కిరాతంగా పోలీస్ ఆఫీసర్‌ను హత్య చేయడంతో మొదలైన ఉత్కంఠ, అటు కేసు విచారణ చేస్తున్న పోలీసులతో పాటు, థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలోనూ కలుగుతుంది. ఎక్కడా వేలి ముద్రలు, గుర్తులు కనిపించకుండా హత్య ఎలా జరిగిందన్న ఆసక్తి మొదలవుతుంది. అదే తరహాలో వరుసగా పోలీస్ అధికారులను హత్య చేయడంతో పాటు ఆ ప్రదేశంలో కళ్లకు గంతలు లేని న్యాయదేవత బొమ్మను హంతకుడు వదిలి వెళ్తాడు. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? న్యాయదేవత బొమ్మను ఉంచడం వెనుక కారణం ఏంటి? తదితర అంశాలను పోలీసులు అన్వేషించడంతో ప్రథమార్ధంలో సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి. న్యాయదేవత ప్రతిమ తయారు చేసిన వ్యక్తి సిగ్నేచర్‌ను డాక్టర్ అన్వర్ అనుకోకుండా గుర్తించడంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది.
ద్వితీయార్ధంలో కేసు విచారణ వేగంగా సాగుతుందేమోనని భావించిన ప్రేక్షకుడు కాస్త నిరాశకు గురవుతాడు. బొమ్మలు తయారు చేసిన వ్యక్తిని కూడా హంతకుడు అంధుడుని చేయడంతో కథ మళ్లీ మొదటకు వస్తుంది. ఇక్కడే సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా సాగుతాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా డాక్టర్ అన్వర్ కేసును పరిశోధిస్తూనే ఉంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్‌ను హంతకుడు చంపే క్రమంలో పడిపోయిన వస్తువు ఆధారంగా కేసు విచారణ చేయడం మొదలు పెట్టిన అన్వర్‌కు ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. అయితే, హంతకుడి ఫ్లాష్‌బ్యాక్ కాస్త రొటీన్‌గానే అనిపిస్తుంది. నేటి సమాజంలో పెద్ద మనుషుల ముసుగులో కొందరు చేసే అకృత్యాలు ఎలా సాగుతాయన్నది దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. తాము చేసే తప్పులను డబ్బు, అధికారంతో ఎలా కప్పిపుచ్చుకుంటారు? దాని వల్ల హాయిగా సాగిపోతున్న కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతాయన్నది చూపించాడు దర్శకుడు. ఒకళ్లిద్దరు పోలీసులు చేసిన పనికి అమాయకులైన మరో ముగ్గురు పోలీసులను హత్య చేయడం అతకలేదు. క్లైమాక్స్‌లో అందరూ ఊహించినట్లే పోలీసులు హంతకుడిని పట్టుకుంటారు. అది ఎలా అన్నది తెరపై చూడాలి. ఇక విచారణ సందర్భంగా హంతకుడు ‘న్యాయ దేవత బతికే ఉంది’ అంటాడు. ఎవరూ ఊహించని ట్విస్ట్‌తో క్లైమాక్స్ ముగించాడు దర్శకుడు.
ఎవరెలా చేశారంటే: ముందే చెప్పుకొన్నట్లు ఇది తెలుగు సినిమా కాదు. ఇందులో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఒక్క నటుడూ ఉండడు. కానీ, అందరూ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. ఏ పాత్ర అతి చేసినట్లు అనిపించదు. పాటలు, ఫైట్లు, పంచ్‌డైలాగ్‌లు క్రైమ్ థ్రిల్లర్‌లో ఆశించలేం. హ్యాకర్ ఆండ్రూగా శ్రీనాథ్ బసి పాత్ర అక్కడక్కడా నవ్వులు పూయిస్తుంది. డాక్టర్ అన్వర్ హుస్సేన్‌గా కుంచకో బోబన్ సహా పోలీసులుగా నటించిన వారందరూ సహజంగా నటించారు. ఇక సినిమాకు టెక్నికల్ టీమ్ అద్భుతంగా పనిచేసింది. ఖలీద్ ప్రతీ ఫ్రేమ్‌ను చక్కగా తెరకెక్కించాడు. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ కోసం పడిన కష్టం సినిమాలో కనిపిస్తుంది. సుశీన్ శ్యామ్ నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేస్తుంది. సైజు శ్రీధరన్ ఎడిటింగ్‌కు కాస్త పని చెప్పాల్సిందేమో. మలయాళ ప్రేక్షకులకు తెలిసిన నటులు కావడంతో అక్కడ నిడివి సరిపోతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు మిథున్ సినిమాను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అయితే, ద్వితీయార్ధాన్ని ఇంకాస్త బాగా చూపించాల్సింది. సన్నివేశాలన్నీ అక్కడక్కడే సాగుతున్నట్లు అనిపిస్తాయి. హంతకుడు హత్యలు చేయడానికి గల కారణం కూడా ఇప్పటికే తెరపై చాలా సార్లు చూశాం. అయితే, బిగి సడలని కథనంతో మిథున్ ఆకట్టుకున్నాడు.
బలాలు | బలహీనతలు |
+ ఉత్కంఠతో సాగే కథనం | - తెలిసిన పాయింట్ |
+ నటీనటులు | - ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు |
+ సాంకేతిక బృందం పనితీరు |
చివరిగా: ‘మిడ్నైట్ మర్డర్స్’ అలరించే మరో క్రైమ్ థ్రిల్లర్
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
మరిన్ని
కొత్త సినిమాలు
-
రామ్ సరసన కృతి ఖరారైంది
-
‘శ్రీకారం’.. ట్రైలర్ వచ్చేసింది
-
సందడి చేస్తోన్న ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
-
‘శ్రీకారం’ లాంటి కథలు మళ్లీ రావు: శర్వానంద్
- ‘పక్కా’గా నడుస్తున్న షూటింగ్!
గుసగుసలు
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
-
బాలకృష్ణ చిత్రంలో ప్రతినాయకురాలిగా పూర్ణ?
-
పారితోషికం వల్ల భారీ ప్రాజెక్ట్‌కు ఈషా నో
ఇంటర్వ్యూ
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
-
అతనొక అమాయక ‘జాతిరత్నం’: నాగ్ అశ్విన్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
కొత్త పాట గురూ
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
‘అరణ్య’ నుంచి అడవి గీతం
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!