close
Published : 26/02/2021 10:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రివ్యూ: అక్ష‌ర‌

నటీన‌టులు: న‌ందిత శ్వేత‌,  సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, సంజ‌య్ స్వ‌రూప్‌, అజయ్ ఘోష్ త‌దిత‌రులు; ఛాయాగ్ర‌హ‌ణం: నగేష్ బ‌న్నెల్, సంగీతం : సురేష్ బొబ్బిలి, కూర్పు: జి.సత్య, క‌ళ‌: నరేష్ బాబు తిమ్మిరి, నిర్మాణం: సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ, రచన - దర్శకత్వం : బి. చిన్నికృష్ణ; సంస్థ:  సినిమా హాల్ ఎంటర్‌టైన్‌మెంట్‌; విడుద‌ల‌:  26-02-2021

క‌రోనా ప్ర‌భావంతో  కొన్ని నెల‌లపాటు  సినిమా థియేట‌ర్ల‌కి దూర‌మైన  ప్రేక్ష‌కులు ఇప్పుడిప్పుడే  మునుప‌టిలా వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. వంద శాతం సీటింగ్ కెపాసిటీతో ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కి అనుమ‌తులు వ‌చ్చాక థియేట‌ర్ల ద‌గ్గ‌ర మ‌ళ్లీ సంద‌డి వాతావ‌ర‌ణం కనిపిస్తోంది. సినీ రూప‌క‌ర్త‌లు ప్ర‌తివారం నాలుగైదు సినిమాల్ని విడుద‌ల చేస్తూ సినీ ప్రియులకి వినోదాల కొర‌త తీరేలా చేస్తున్నారు. ఈ వారం కూడా అర‌డ‌జ‌ను చిత్రాలు విడుదల‌య్యాయి. అందులో ఒక‌టి... ‘అక్ష‌ర‌’.  క‌థానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్ర‌మిది. ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? నందిత శ్వేత నటన ఏ మేరకు ఆకట్టుకుంది?

క‌థేంటంటే: అక్ష‌ర  (నందిత శ్వేత‌)  అమ్మానాన్న‌లు లేని ఓ యువ‌తి.  విశాఖ‌లోని  విద్యా విధాన్  కాలేజీలో లెక్చ‌ర‌ర్‌గా చేరుతుంది. విద్యార్థుల్లో భ‌యాల్ని  పోగొడుతూ చ‌దువులు చెబుతుంటుంది.  క్ర‌మంగా ఆ కాలేజీ డైరెక్ట‌ర్ శ్రీతేజ (శ్రీతేజ్‌)కీ, అక్ష‌ర‌కీ మ‌ధ్య  సాన్నిహిత్యం పెరుగుతుంది.  అక్ష‌ర‌ని  ప్రేమిస్తున్న విష‌యం ఆమె ముందు  బ‌య‌ట పెట్టే ప్ర‌య‌త్నంలో ఉండ‌గానే శ్రీతేజ హ‌త్య‌కి గుర‌వుతాడు. శ్రీతేజ‌తోపాటు, ఏసీపీని కూడా  తానే హ‌త్య చేశానంటూ అక్ష‌ర పోలీసుల‌కి లొంగిపోతుంది. మ‌రి ఆ ఇద్ద‌రినీ అక్ష‌ర‌నే హ‌త్య చేసిందా?  చేస్తే అందుకు కార‌ణ‌మేమిటి?  త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే?: నేటి విద్యా వ్య‌వ‌స్థ తీరునీ...  ర్యాంకుల  కోసం కార్పొరేట్ సంస్థ‌లు విద్యార్థుల జీవితాలతో  చెల‌గాట‌మాడుతున్న వైనాన్నీ స్పృశిస్తూ సాగే క‌థ ఇది. నిత్యం  ప‌త్రిక‌ల్లోనూ, టీవీ ఛానెళ్లలోనూ చ‌ర్చ‌కొచ్చే అంశాలే ఇందులోని క‌థ‌. అయితే  విద్యావ్య‌వ‌స్థ‌లోని మంచి చెడుల కంటే కూడా...  ఓ యువ‌తి  ప్ర‌తీకార క‌థే హైలైట్ అయ్యింది.  విద్యాసంస్థ‌ల్ని న‌డుపుతున్న ఓ కార్పొరేట్  శ‌క్తి త‌న‌కి చేసిన అన్యాయానికి ఓ యువ‌తి  ఎలా బ‌దులు తీర్చుకున్న‌ద‌నేది ఇందులో కీల‌కంగా క‌నిపిస్తుంది. విద్యావ్య‌వ‌స్థ నేప‌థ్యంలో సినిమా అనేది ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్న‌మే.  సినిమాల్లో  అక్క‌డ‌క్క‌డా ఒక‌ట్రెండు స‌న్నివేశాలు క‌నిపిస్తుంటాయి త‌ప్ప పూర్తి స్థాయిలో ఇదే అంశంతోనే వ‌చ్చిన సినిమాలు అరుదు.  అందరూ సుల‌భంగా క‌నెక్ట్ అయ్యే ఈ అంశాన్ని ఆలోచ‌న, ఆస‌క్తి రేకెత్తించేలా తీయాల్సిన దర్శ‌కుడు ఓ సాధార‌ణ ప్ర‌తీకార క‌థ‌లా మార్చేశాడు. మ‌ధ్య‌లో అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు మాత్రం  ప్ర‌సంగాల త‌ర‌హాలో కొన్ని విష‌యాల్ని చెప్పించారు. 

పిల్ల‌లు ఎదుర్కొంటున్న ఒత్తిడిని, ర్యాంకుల కోసం విద్యాసంస్థ‌లు పాకులాడే విధానం ఎలా ఉందో ఆ ప్ర‌సంగాల్లో వినిపిస్తుంది త‌ప్ప‌... వాటిని క‌థ‌లో మిళితం చేసి  చెప్ప‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ఈ సినిమాలో అస‌లు క‌థ మొద‌ల‌వ్వ‌డానికే బోలెడంత స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌థ‌మార్ధం సినిమా  దాదాపుగా కాల‌నీ  ప్రెసిడెంట్ (అజ‌య్ ఘోష్‌),  వాల్తేరు కింగ్స్ (మ‌ధునంద‌న్, ష‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య‌) నేప‌థ్యంలోనే సాగుతుంది.  ఆ స‌న్నివేశాల‌న్నీ కూడా చ‌ప్ప‌గా... ఎలాంటి ఆస‌క్తి , వినోదం లేకుండా సాగుతాయి.  శ్రీతేజ్ హ‌త్య నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది.  ద్వితీయార్ధంలోనే ఫ్లాష్ బ్యాక్‌తోపాటు, చెప్పాల్సిన క‌థంతా ఉంటుంది.  క‌థ‌నంలో లోపంతో  సినిమా ఎక్క‌డా ఆస‌క్తిగా అనిపించదు.  ప‌తాక స‌న్నివేశాలు కూడా ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే సాగుతాయి.

ఎవ‌రెలా చేశారంటే?: అక్ష‌ర‌గా నందిత శ్వేత  చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించింది.  ద్వితీయార్ధంలో ఆమె  పాత్ర ఆక‌ట్టుకుంటుంది.  కార్పొరేట్ విద్యాసంస్థ‌ల అధిప‌తి సంజ‌య్‌గా  సంజ‌య్ స్వ‌రూప్ కీల‌క పాత్ర‌ని పోషించారు. ఆయ‌న విల‌నిజం సినిమాకి హైలైట్ అయ్యింది.  మ‌ధునంద‌న్‌,  ష‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య తదిత‌రులు  సినిమా  ఆద్యంతం క‌నిపిస్తారు కానీ...  ఆ పాత్ర‌ల్లోనూ, స‌న్నివేశాల్లోనూ బ‌లం లేక‌పోవ‌డంతో వినోదం పండ‌లేదు.   హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, అప్పాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, శ‌త్రు తదిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.  సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. కెమెరా, సంగీతం విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. ద‌ర్శ‌కుడు  చిన్నికృష్ణ  ఎంచుకున్న నేప‌థ్యం బాగుంది కానీ, క‌థ‌కుడిగా ఆయ‌న ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు.

బలాలు బ‌ల‌హీన‌త‌లు
+ నందిత శ్వేత న‌ట‌న‌ - క‌థ‌నం
+ విరామానికి ముందు మ‌లుపు - ప్ర‌థమార్ధం
+ ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు  

చివ‌రిగా:  అక్ష‌ర... ఓ ప్ర‌తీకార క‌థ

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని