close
ఓటీటీ సంగతులు
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నెట్‌ఫ్లిక్స్‌లో Top10‌ సినిమాలివీ... 

ఇంటర్నెట్‌ డెస్క్‌: డిజిటల్‌ యుగంలో ఇప్పుడందరూ అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ5, ఆహా వంటి ఓటీటీలపై మొగ్గుచూపుతున్నారు. లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడటంతో ఓటీటీ వాడకం మరింత పెరిగింది. యూజర్లను తమవైపు తిప్పుకోవడం కోసం ఓటీటీలు ఏకంగా సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ .. చాలా కాలంగా సినిమాలను నేరుగా విడుదల చేస్తూ వస్తోంది. గత ఏప్రిల్‌లో ‘ఎక్స్‌ట్రాక్షన్‌’ చిత్రాన్ని విడుదల చేసింది. ఆ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినా.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది చూసిన చిత్రంగా నిలిచింది. గత మూడేళ్లలో తాము విడుదల చేసిన సినిమాల్లో బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ కొట్టిన టాప్‌ 10 చిత్రాల జాబితాను ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. సినిమా విడుదలైన నాలుగు వారాల్లో చూసిన ప్రేక్షకుల సంఖ్య ఆధారంగా నెట్‌ఫ్లిక్స్‌ ఈ జాబితాను రూపొందించింది. మరి నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ 10 బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలేవో చూద్దామా..!

1. ఎక్స్‌ట్రాక్షన్‌: 99 మిలియన్‌

ఈ ఏడాది ఏప్రిల్‌ 20న ‘ఎక్స్‌ట్రాక్షన్‌’ విడుదలైంది. క్రిస్‌ హెమ్స్‌వర్త్‌, రణదీప్‌ హుడా, పంకజ్‌ త్రిపాఠి తదితరులు  నటించారు. సామ్‌ హర్గ్రేవ్‌ దర్శకత్వం వహించారు. భారత్‌కు చెందిన ఓ డాన్‌ కుమారుడిని కొందరు కిడ్నాప్‌ చేసి బంగ్లాదేశ్‌లోని ఢాకాకు తీసుకెళ్తారు. దీంతో ఆ డాన్‌ తన కుమారుడిని కాపాడి తీసుకురావడం కోసం క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ను నియమిస్తాడు. మరి క్రిస్‌ అతడిని ఎలా కాపాడి తీసుకొచ్చాడనేది సినిమా కథ. ఈ ఫుల్‌లెన్త్‌ యాక్షన్‌ చిత్రం.. విడుదలయ్యాక మిశ్రమ స్పందన అందుకుంది. కానీ తొలి నాలుగు వారాల్లో 9 కోట్ల 90లక్షల మంది ఈ సినిమాను వీక్షించడం విశేషం.


2. బర్డ్‌ బాక్స్‌: 89 మిలియన్‌

‘బర్డ్‌ బాక్స్‌’ 2018 నవంబర్‌ 12న కొన్ని చోట్ల థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్‌ 21న అందుబాటులోకి వచ్చింది. ఇక కథేంటంటే... దుష్టశక్తుల వల్ల అందరూ ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఆ శక్తుల నుంచి ఓ తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు ఎలా బయటపడ్డారనేది ఈ చిత్రంలోని కథ. హర్రర్‌, సై-ఫై జోనర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని మొదటి నాలుగు వారాల్లో 8 కోట్ల 90 లక్షల మంది వీక్షించారు. 


3. స్పెన్సర్‌ కాన్ఫిడెన్షియల్‌: 85 మిలియన్‌

బోస్టన్‌లో ఇద్దరు పోలీసులు హత్యకు గురవుతారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ పోలీసు అధికారి స్పెన్సర్‌ ఓ బృందాన్ని తయారు చేసుకొని హత్య చేసిన నేరస్థులను పట్టుకుంటాడు. ఇదీ ‘స్పెన్సర్‌ కాన్ఫిడెన్షియల్’‌ కథ. ఈ సినిమా గత మార్చి 6న విడుదలైంది. పీటర్‌ బర్గ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విడుదలైన నెలలోపే 8 కోట్ల 50 లక్షల మంది చూశారు. 


4. 6 అండర్‌గ్రౌండ్‌: 83 మిలియన్‌

2019 డిసెంబర్‌ 13న నెట్‌ఫ్లిక్స్‌లో ‘అండర్‌ గ్రౌండ్‌’ విడుదలైంది. మైఖేల్‌ బే దర్శకత్వం వహించిన ఈ చిత్రం కథేంటంటే.. ప్రపంచాన్ని కాపాడటం కోసం విభిన్న నైపుణ్యం ఉన్న ఆరుగురు యోధులు ఒక్కటవుతారు. వారి గతాన్ని ఎవరికీ చెప్పకుండా మాఫియాను మట్టుబెడతారు. ఈ యాక్షన్‌.. థ్రిల్లర్‌ చిత్రాన్ని విడుదలైన నాలుగు వారాల్లో 8 కోట్ల 30 లక్షల మంది చూశారు. 


5. మర్డర్‌ మిస్టరీ: 83 మిలియన్‌

కొత్తగా పెళ్లయిన ఓ జంట హానీమూన్‌ కోసం యూరప్‌ వెళ్తుంది. అక్కడ ఓ సంపన్నుడు హత్యకు గురి కాగా.. ఆ కేసులో ఈ జంట ఇరుక్కుంటుంది. వీరిద్దరు ఆ కేసు నుంచి ఎలా బయటపడతారన్నదే ఈ చిత్రంలోని కథ. కామెడీ - మిస్టరీ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రం 2019 జూన్‌ 14న విడుదలైంది. కైలి నెవాచెక్‌ దర్శకత్వం వహించారు. తొలి నాలుగు వారాల్లో ఈ సినిమాని 8 కోట్ల 30 లక్షల మంది వీక్షించారు. 


6. ది ఐరిష్‌ మ్యాన్‌: 64 మిలియన్‌

2019 నవంబర్‌ 1 కొన్ని థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. నవంబవర్‌ 27న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఛార్లెస్‌ బ్రాండిట్‌ రాసిన ‘ఐ హియర్డ్‌ యూ పెయింట్‌ హౌసెస్‌’ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఫ్రాంక్‌ షెరీర్‌ అనే వ్యక్తి రస్సెల్‌ బుఫాలినో అనే మాఫియా డాన్‌ కుటుంబం వద్ద పనిచేస్తుంటాడు. యజమాని చెప్పిన పనులు చేస్తూ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ నేర ప్రపంచంలో నంబర్‌వన్‌ స్థానాన్ని చేరుకుంటాడు. 1950 కాలంలో జరిగే కథతో వచ్చిన ఈ చిత్రం విడుదలైన నెలలోపల 6 కోట్ల 40 లక్షల మంది చూశారు. 


7. ట్రిపుల్‌ ఫ్రంటియర్‌: 63 మిలియన్‌

దక్షిణ అమెరికాలో డ్రగ్‌ మాఫియాను పట్టుకోవడం కోసం ఐదుగురు మాజీ యూఎస్‌ ఆర్మీ డెల్టా ఫోర్స్‌ జవాన్లు ఒక్కటవుతారు. మాఫియాను తుదిముట్టించే క్రమంలో ఎలాంటి సమ్యలు ఎదుర్కొన్నారు. చివరికి విజయం సాధించారో లేదో తెలియాలంటే ట్రిపుల్‌ ఫ్రంటియర్‌ చూడాల్సిందే. ఈ యాక్షన్‌-అడ్వెంచర్‌ చిత్రానికి జే.సీ చాండోర్‌ దర్శకత్వం వహించారు. 2019 మార్చి 13న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం విడుదలైంది. మొదటి నాలుగు వారాల్లో 6 కోట్ల 30 లక్షల మంది ఈ సినిమాను వీక్షించారు.


8. ది రాంగ్‌ మిస్సీ: 59 మిలియన్‌

‘ది రాంగ్‌ మిస్సీ’ గత మే 13న విడుదలైంది. ఈ చిత్రానికి టేలర్‌ స్పిండెల్‌ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో టిమోటీ తనను కలిసిన ఓ అమ్మాయిని ఉద్యోగరీత్యా హవాయికి రమ్మని మెసెజ్‌ పెడతాడు. అయితే ఆ మెసెజ్‌ వేరే అమ్మాయికి వెళ్తుంది. టిమోటీ పిలిచిన అమ్మాయికి బదులు మరో అమ్మాయి తన ఆఫీసుకు వస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది. ఆ అమ్మాయి ప్రవర్తనతో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడనేది సినిమా కథ. ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రాన్ని విడుదలైన నెలలో 5 కోట్ల 90 లక్షల మంది చూశారు. 


9. ది ప్లాట్‌ఫాం: 56 మిలియన్‌

‘ది ప్లాట్‌ఫాం’... ఓ సై-ఫై హర్రర్‌ చిత్రం. ఇందులో కొందరు ఖైదీలు నిట్టనిలువగా ఉండే ఓ జైలులో ఉంటారు. ఒక్కో ఫ్లోర్‌లో ఇద్దరు చొప్పునే ఉంటారు. ఆ భవంతి మధ్యలో ఆహారంతో కూడిన ఓ ప్లాట్‌ఫాం పై నుంచి కిందకి వెళ్తుంటుంది. దీనిపై ఉన్న ఆహారాన్ని తినడానికి వారికి రోజులో రెండు నిమిషాల సమయం మాత్రమే ఇస్తారు. ఈ క్రమంలో బతకడానికి ఖైదీలు చేసే పోరాటమే సినిమా కథ. ఈ చిత్రాన్ని 2019లో పలు చోట్ల ప్రీమియర్‌ షోగా ప్రదర్శించారు. అయితే ఈ ఏడాది మార్చి 20న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. నాలుగు వారాల్లో 5 కోట్ల 60 లక్షల యూజర్లు ఈ సినిమాని వీక్షించారు. 


10. ది పర్‌ఫెక్ట్‌ డేట్‌: 55 మిలియన్‌

క్రిస్‌ నెల్సన్‌ దర్శకత్వం వహించిన ‘ది పర్‌ఫెక్ట్‌ డేట్‌’ గత ఏడాది ఏప్రిల్‌ 12న విడుదలైంది. స్టీవ్‌ బ్లూమ్‌ రాసిన ‘ది స్టాండ్‌-ఇన్‌’ నవల ఆధారంగా టీన్‌ రొమాంటిక్‌ కామెడీ చిత్రంగా మలిచారు. ఇందులో బ్రూక్స్‌ రాటిగన్‌ అనే కాలేజీ కుర్రాడు ఖర్చుల కోసం ఓ యాప్‌ రూపొందిస్తాడు. అమ్మాయిలు ఎవరైనా సరే తనను బాయ్‌ఫ్రెండ్‌గా అద్దెకు తీసుకెళ్లొచ్చని చెబుతాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడిన బ్రూక్స్‌ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. తను ప్రేమించిన అమ్మాయి మనసు గెలుచుకున్నాడా లేదా అనేది సినిమాలోనే చూడాలి. ఈ చిత్రం విడుదలైన నెల రోజుల్లో 5 కోట్ల 50 లక్షల మంది చూశారు. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.