భాజపాతో కటీఫ్‌.. బీపీఎఫ్‌ ప్రకటన - no longer friends wht bjp says bpf in assam
close
Published : 28/02/2021 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపాతో కటీఫ్‌.. బీపీఎఫ్‌ ప్రకటన

గువాహటి: అసోంలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో కమలనాథులతో కలిసి నడవలేమని బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (బీపీఎఫ్‌) ప్రకటించింది. కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన కూటమితో కలిసి పనిచేస్తామని బీపీఎఫ్‌ నేత హగ్రామా మొహిలరీ వెల్లడించారు. ఈ నిర్ణయం కాంగ్రెస్‌ నేతృత్వంలోని అసోంలో ఏర్పాటైన కూటమి బలోపేతానికి ఎంతగానో ఉపకరించనుంది. రాష్ట్రంలో శాంతి, ఐక్యత, అభివృద్ధి, సుస్థిర ప్రభుత్వం, అవినీతి రహిత అసోం కోసం కాంగ్రెస్‌ కూటమితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు హగ్రామా ప్రకటించారు. భాజపాతో ఇక స్నేహం కొనగించలేమని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమితోనే కలిసి ముందుకెళ్తామని ఫేస్‌బుక్‌లో ప్రకటించారు.

2016లో జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 స్థానాలకు గాను బీపీఎఫ్‌ 12 స్థానాలు గెలుచుకుంది. అనంతరం భాజపా నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో చేరింది. సర్బానంద‌ సోనోవాల్‌ కేబినెట్‌లో బీపీఎఫ్ నుంచి ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. అయితే, ఇటీవల అసోం ఆర్థికమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా బీపీఎఫ్‌తో ఎన్నికల్లో పొత్తు ఉండదని స్పష్టంచేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.

గతేడాది డిసెంబర్‌లోనే అసోంలో స్వయం పాలిత బోడోలాండ్‌ ప్రాదేశిక మండలి (బీటీసీ)లో భాజపా తమ మిత్రపక్షమైన బీపీఎఫ్‌ను కాదని యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌ (యూపీపీఎల్‌)తో భాజపా చేతులు కలిపింది. దీంతో బీటీసీ నూతన ప్రధాన కార్యనిర్వాహక సభ్యుడు (సీఈఎం)గా యూపీపీఎల్‌ అధినేత ప్రమోద్‌ బోరో బాధ్యతలు చేపట్టారు. మొత్తం 40 స్థానాలు ఉన్న బీటీసీకి జరిగిన ఎన్నికల్లో బీపీఎఫ్‌ 17 సీట్లను దక్కించుకోగా.. యూపీపీఎల్‌కు 12 స్థానాలు, భాజపా తొమ్మిది చోట్ల విజయం సాధించాయి. భాజపా, బీపీఎఫ్‌ మిత్రపక్షాలు కావడంతో అవి రెండూ కలిసి బీటీసీ పరిపాలనా బాధ్యతలు చేపడతాయని తొలుత అంతా ఊహించారు. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ తమకు మద్దతివ్వాలని కమలదళాన్ని బీపీఎఫ్‌ అధ్యక్షుడు హగ్రామా మొహిలరీ కోరారు. అనూహ్యంగా యూపీపీఎల్‌కు అభినందనలు తెలుపుతూ అమిత్‌ షా ట్వీట్‌ చేయడం, ప్రధాని నరేంద్ర మోదీ కూడా యూపీపీఎల్‌ను తమ మిత్ర పక్షంగా సంబోధిస్తూ ట్వీట్‌ చేయడంతో బీపీఎఫ్‌ అసంతృప్తికి గురైనట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని