రివ్యూ: వకీల్‌ సాబ్‌ - pawan kalyan vakeel saab telugu movie review
close
Updated : 09/04/2021 13:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రివ్యూ: వకీల్‌ సాబ్‌

చిత్రం: వకీల్‌ సాబ్‌; నటీనటులు: పవన్‌కల్యాణ్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌, శ్రుతి హాసన్‌, నరేశ్‌; సంగీతం: తమన్‌; సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌; ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి; మూల కథ: పింక్‌(అనిరుధ్‌ రాయ్‌ చౌదరి, సూజిత్‌ సిర్కార్‌); నిర్మాత: దిల్‌రాజ్‌; సమర్పణ: బోనీకపూర్‌; రచన, దర్శకత్వం: వేణు శ్రీరామ్‌; బ్యానర్‌: శ్రీ వేంకటేశ్వరక్రియేషన్స్‌; విడుదల: 09-04-2021

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా విడుద‌ల అంటే చాలు... ప్రేక్ష‌కుల్లోనూ, ప‌రిశ్ర‌మ‌లోనూ క‌నిపించే ఉత్సాహమే వేరు.  అమెరికా నుంచి అమ‌లాపురం వ‌ర‌కూ బాక్సాఫీసు ద‌గ్గర పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంటుంది.  బ‌ల‌మైన అభిమాన గ‌ణాన్ని సొంతం చేసుకున్న క‌థానాయ‌కుడాయ‌న. రాజకీయ వ్య‌వ‌హారాల‌తో బిజీగా ఉండ‌టంతో మూడేళ్లుగా ఆయ‌న నుంచి సినిమా రాలేదు.  హిందీలో విజ‌య‌వంత‌మైన  ‘పింక్’ సినిమా రీమేక్‌గా త‌న రీఎంట్రీ సినిమా ‘వ‌కీల్‌సాబ్‌’ని  ప్ర‌క‌టించ‌డంతో అప్ప‌ట్నుంచి ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు. ప్ర‌చార చిత్రాలు సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల్ని పెంచాయి. మ‌రి ప‌వ‌న్ రీఎంట్రీ  ఎలా ఉంది? ‘వ‌కీల్‌సాబ్’గా ప‌వ‌న్ చేసిన సంద‌డి మాటేమిటి?

క‌థేంటంటే: ముగ్గుర‌మ్మాయిల‌కి ఎదురైన చేదు సంఘ‌ట‌న నేప‌థ్యంలో సాగే క‌థ ఇది.  వేముల ప‌ల్ల‌వి (నివేదా థామ‌స్‌), జ‌రీనా (అంజ‌లి), దివ్య నాయక్ (అన‌న్య నాగ‌ళ్ల‌) ముగ్గురూ ఉద్యోగాలు చేసుకుంటూ ఓ ఇంట్లో అద్దెకుంటారు. అనుకోకుండా  ఓ రోజు రాత్రి ముగ్గురూ ప్ర‌యాణం చేయాల్సి వ‌స్తుంది. క్యాబ్ మ‌ధ్య‌లోనే చెడిపోవ‌డంతో మ‌రో కార్‌లో లిఫ్ట్ అడిగి ఓ రిసార్ట్‌కి చేరుకుంటారు.  అక్క‌డ ఎంపీ కొడుకు వంశీ (వంశీ)తో వేముల ప‌ల్ల‌వికి చేదు అనుభ‌వం ఎదుర‌వుతుంది. రిసార్ట్ నుంచి త‌ప్పించుకుని ఇంటికొస్తారు. ఆ త‌ర్వాత  ప‌ల్ల‌విపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదవుతుంది. అమాయ‌కులైన ఆ ముగ్గుర‌మ్మాయిలు క‌ష్టాల్లో ప‌డ‌తారు. న్యాయం కోసం ఎదురు చూస్తున్న‌ వాళ్ల‌ని కాపాడేవారే క‌ర‌వవుతారు. ఆ సంద‌ర్భంలోనే స‌త్య‌దేవ్ అలియాస్ వకీల్‌సాబ్ (ప‌వ‌న్‌క‌ల్యాణ్‌) గురించి తెలుసుకుని ఆయ‌న్ని ఆశ్ర‌యిస్తారు. వాళ్ల ప‌రిస్థితిని చూసి రంగంలోకి దిగుతాడు వ‌కీల్‌సాబ్‌. మ‌రి ఆయ‌న ప‌ల్ల‌వి కేసుని గెలిచాడా?  కోర్టులో ఆయ‌న వాద‌న‌లు ఎలా సాగాయి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: మ‌హిళ‌లకి ఎదుర‌వుతున్న సంఘ‌ట‌నల్ని...  వాళ్ల విష‌యంలో స‌మాజ ధోర‌ణిని ఎత్తి చూపే చిత్ర‌మిది. అమ్మాయి న‌వ్వినా, ఒకరిని ట‌‌చ్ చేస్తూ మాట్లాడినా, ఒంట‌రిగా బ‌య‌టికొచ్చినా వంకర బుద్ధితో చూసే ధోర‌ణి గురించి ఇందులో వ‌కీల్‌సాబ్ చెప్పిన విష‌యాలు ఆలోచ‌న రేకెత్తిస్తాయి. ఇలా జ‌ర‌గొద్దు... జ‌ర‌గ‌కూడ‌ద‌నే ఓ బ‌ల‌మైన సందేశాన్నిస్తాయి.  మ‌గువా... పాట‌తో  సినిమా మొద‌ల‌వుతుంది. భిన్న‌మైన కుటుంబాల నుంచి ముగ్గుర‌మ్మాయిలు త‌మ క‌ల‌ల్ని సాకారం చేసుకోవ‌డం కోసం న‌గ‌రానికి చేరుకోవ‌డం, ప‌నులు చేసుకుంటూ కుటుంబానికి ఆస‌రాగా నిల‌వ‌డం వంటి స‌న్నివేశాల‌తో ఆ పాట సాగుతుంది. ముగ్గుర‌మ్మాయిల‌కి ఎదురైన సంఘట‌న‌ల త‌ర్వాత వ‌కీల్‌సాబ్‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. అక్క‌డ్నుంచి క‌థ ఊపందుకుంటుంది. స‌త్య‌దేవ్ ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు.. ఆ త‌ర్వాత ప‌ల్ల‌వి కేసు కోసం రంగంలోకి దిగ‌డం వంటి విష‌యాలు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. 

ప్ర‌థ‌మార్ధం వ‌ర‌కు అభిమానుల్ని అల‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా స‌న్నివేశాలుంటాయి. ద్వితీయార్ధంలో కోర్టు రూమ్ డ్రామా సినిమాకు ప్రాణం.  వాద ప్ర‌తివాద‌న‌లు శ‌క్తిమంత‌మైన పోరాటాల్ని, ఇత‌ర‌త్రా మాస్ అంశాల్ని త‌ల‌ద‌న్నే రీతిలో సాగుతాయి. హిందీ చిత్రం ‘పింక్‌’కి రీమేక్ అయినా... దాన్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్  ఇమేజ్‌కి త‌గ్గట్టుగా తీర్చిదిద్దిన విధానం, అభిమానుల్ని అల‌రించేలా వాణిజ్యాంశాల్ని జోడించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. అదే స‌మ‌యంలో క‌థ ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా బ్యాలెన్స్ చేసిన వైనం మెప్పిస్తుంది.  అమ్మాయిలు నో చెబితే నో అనే అర్థం అనే విష‌యం ఆలోచ‌న రేకెత్తిస్తుంది. చీడ పురుగు మ‌గ‌వాడి మెద‌డులో పెట్టుకుని... మందు ఆడ‌వాళ్ల మొహం మీద కొడ‌తాం అంటే ఎలా? అంటూ సాగే సంభాష‌ణ‌లు చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ పొలిటిక‌ల్ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా కూడా ఇందులో సంభాష‌ణ‌ల్ని జోడించారు. ‘ఆశ‌యం కోసం ప‌నిచేసేవాడికి గెలుపు ఓట‌ముల‌తో ప‌ని ఉండ‌దు’ త‌ర‌హా సంభాష‌ణ‌ల్ని ఈ క‌థ‌కి మేళ‌వించారు. పొలిటిక‌ల్ ఇమేజ్ ఈ సినిమా విష‌యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌‌కి బాగా క‌లిసొచ్చింది కూడా.  ప్ర‌జ‌ల్లో ఉంటున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈ సినిమా చేయ‌డం  మ‌రింత స‌ముచితంగా అనిపిస్తుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ప్ర‌కాశ్‌రాజ్ మ‌ధ్య కోర్టులో మాట‌ల యుద్ధం  ఆక‌ట్టుకుంటుంది.

ఎవ‌రెలా చేశారంటే: వ‌కీల్‌సాబ్‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒదిగిపోయారు. న్యాయం కోసమే పోరాటం చేసే న్యాయ‌వాదిగా అత్యంత స‌హ‌జంగా ఆ పాత్ర‌లో  క‌నిపించారు. కోర్ట్ రూమ్ స‌న్నివేశాల‌పై ఆయ‌న మ‌రింతగా ప్ర‌భావం చూపించారు. ప్ర‌థ‌మార్ధంలో వచ్చే స‌న్నివేశాల్లో ఆయ‌న కాస్త బొద్దుగా ఉన్న‌ట్టు క‌నిపిస్తారు. నివేదా, అంజ‌లి, అన‌న్య వారి పాత్రల్లో జీవించారు.  నందా పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్ న‌ట‌న సినిమాకి మ‌రింత బ‌లాన్నిచ్చింది. సాంకేతిక విభాగం ప‌రంగా ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు ప‌నిత‌నాన్ని ప్ర‌త్యేకంగా మెచ్చుకోవాలి. ఆయ‌న ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా ఈ క‌థ‌ని తీర్చిదిద్దిన తీరు అల‌రించింది. అయితే  ప్ర‌థ‌మార్ధంపై ఆయ‌న మ‌రింత‌గా దృష్టి పెట్టాల్సింది. ర‌చ‌యిత తిరుతో క‌లిసి ఆయ‌న రాసుకున్న మాట‌లు కూడా ప్రేక్ష‌కుల‌తో చ‌ప్ప‌ట్లు కొట్టిస్తాయి.  త‌మ‌న్ పాట‌లు, నేప‌థ్య  సంగీతం,   పి.ఎస్‌.వినోద్ కెమెరా ప‌నిత‌నం సినిమాకి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లుగా నిలిచాయి. నిర్మాణపరంగా దిల్‌రాజు ఎక్కడా వెనుకడుగు వేయలేదు. తెరపై అది స్పష్టంగా కనిపిస్తుంది.

బలాలు బలహీనతలు
+ ప‌వ‌న్‌క‌ల్యాణ్ - ప్ర‌కాష్‌రాజ్‌ల మ‌ధ్య స‌న్నివేశాలు -ప్ర‌థ‌మార్ధంలో కొన్ని స‌న్నివేశాలు
+ ద్వితీయార్ధం  
+ సంభాష‌ణ‌లు, న‌టీన‌టులు  

చివ‌రిగా: వ‌కీల్‌సాబ్... ఆలోచింప‌జేస్తాడు!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని