PM Modi: అఫ్గాన్‌లో అస్థిరత కొనసాగితే ప్రపంచానికి పెను ముప్పే: మోదీ హెచ్చరిక - pm modi speech on afghan developments at sco meeting
close
Updated : 17/09/2021 22:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PM Modi: అఫ్గాన్‌లో అస్థిరత కొనసాగితే ప్రపంచానికి పెను ముప్పే: మోదీ హెచ్చరిక

దిల్లీ: అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకుంటోన్న పరిణామాలు భారత్‌ లాంటి పొరుగు దేశాలపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ దేశంలో అస్థిరత కొనసాగడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం తజకిస్థాన్‌ రాజధాని దుషాన్బేలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో వర్చువల్‌గా పాల్గొని మోదీ ప్రసంగించారు. అఫ్గాన్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రాంతీయ దృష్టి, సహకారం అవసరమన్నారు. అఫ్గానిస్థాన్‌లో అస్థిరత కొనసాగితే అది ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించేలా దారితీస్తుందని హెచ్చరించారు. అఫ్గాన్‌లో అధికార మార్పిడి ఎలాంటి చర్చల్లేకుండా జరిగిందన్న మోదీ.. ఇతర తీవ్రవాద గ్రూపులు కూడా హింస ద్వారా అధికారంలోకి వచ్చేలా ప్రోత్సహించే అవకాశాలపై హెచ్చరించారు. అక్కడ నెలకొన్న మానవాళి సంక్షోభంపైనా ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించడంతో ప్రజలకు ఆర్థిక కష్టాలు పెరుగుతున్నాయన్నారు. ప్రస్తుత పరిణామాలతో అక్కడ మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలు, మానవ అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరిగేందుకు దారితీస్తాయని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్‌లో భారీగా అధునాతన ఆయుధాలు ఉన్నాయని.. వీటి ద్వారా ఆ మొత్తం ప్రాంతానికే అస్థిరత ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. 

ఉగ్రవాద సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు షాంఘై సహకార సంస్థ ప్రణాళికలను అభివృద్ధి చేయాలని మోదీ సూచించారు. మధ్య ఆసియా ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలకు మూలకారణం పెరుగుతున్న ఉగ్రవాదమేనన్నారు. అఫ్గాన్‌ పరిణామాలే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ‘‘చరిత్రను తరచిచూస్తే మధ్య ఆసియా ప్రాంతం ఆధునిక, ప్రగతిశీల సాంస్కృతిక విలువలకు ఓ రకంగా ఇరుసులా ఉండేదని తెలుస్తోంది.  మధ్య ఆసియా ప్రాంతంలో అతి పెద్ద సవాళ్లు శాంతి, భద్రత, విశ్వాస లోపంతో సంబంధం ఉన్నవేనని నా నమ్మకం. ఈ సమస్యలన్నింటికీ మూల కారణం.. పెరుగుతున్న ఉగ్రవాదమే. అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలు ఈ సవాళ్ల విషయాన్ని మరింతగా స్పష్టంచేస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారంపై షాంఘై సహకార సంస్థ చొరవతీసుకొని పనిచేయాలి. ఉగ్రవాదంపై పోరాటం మన యువత ఉజ్వల భవిష్యత్తు కోసం కూడా ఎంతో అవసరం’’ అని తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని