Prakash raj: ఒకప్పటి పవన్‌ వేరు.. ఇప్పుడు వేరు - prakash raj interview
close
Published : 17/04/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Prakash raj: ఒకప్పటి పవన్‌ వేరు.. ఇప్పుడు వేరు

కొందరు ఆయా పాత్రల్లో నటిస్తారు.. మరికొందరు జీవిస్తారు. రెండో రకానికి చెందిన వారే ప్రకాశ్‌ రాజ్‌. ‘బద్రి’ చిత్రంలో నందాగా మెప్పించిన ఆయన మరోసారి అదే పేరుతో ‘వకీల్‌సాబ్‌’లో నటించారు. లాయరుగా ప్రశ్నలు సంధించారు. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవలే విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలోనే పవన్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు ప్రకాశ్‌ రాజ్‌. 

పవన్‌ కల్యాణ్‌, ప్రకాశ్‌ రాజ్‌, నందా.. ఈ మూడింటి గురించి ఏం చెప్తారు?

నందాగా తొలిసారి ‘బద్రి’ చిత్రంలో నటించా. అందులోని ‘నువ్వు నందా అయితే నేను బద్రి’ అనే డైలాగ్‌ ఇప్పటికీ ఆకట్టుకుంటుంది. ఆ సంభాషణతోనే మా కాంబినేషన్‌కి మంచి పేరొచ్చింది. ఆ క్రెడిట్‌ అంతా దర్శకుడు పూరి జగన్నాథ్‌దే. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

ఇన్నేళ్లుగా పవన్‌లో మీరు గమనించిన మార్పు?

నేను పవన్‌తో కలిసి ‘సుస్వాగతం’, ‘బద్రి’, ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’, ‘జల్సా’ చిత్రాల్లో నటించాను. ‘వకీల్‌ సాబ్‌’ ఐదో సినిమా. కెరీర్‌ ప్రారంభంలో కల్యాణ్ వేరు.. ఇప్పటి కల్యాణ్‌ వేరు. పవన్‌ అప్పుడు ఎక్కువగా మాట్లాడేవారు కాదు. చాలా సిగ్గు పడేవారు. నటించడం మాత్రమే మన పని అనుకునేవారు. అప్పటికి ఇప్పటికీ ఆయనలో చాలా మార్పు వచ్చింది. చాలా క్రేజ్‌ ఏర్పడింది. వ్యక్తిగా, నటుడిగా ఎంతో ఎదిగారు. పవన్‌లో ఇంకా షైనెస్‌ (సిగ్గు) ఉందని ఆయన్ను తొలినాళ్ల నుంచి చూస్తున్న వారికే అర్థమవుతుంది.

‘వకీల్‌’లో పోటాపోటీగా సాగిన కోర్టు సన్నివేశం గురించి ఏం చెప్తారు?

ఈ చిత్రంలో కోర్టు నేపథ్యంలో సాగే 8 సన్నివేశాలున్నాయి. సెట్‌కి వెళ్లే ముందు వాటిని బాగా చదివి ఎలా చేస్తే బాగుంటుందని నేనూ పవన్‌ చర్చించుకునేవాళ్లం. ఓ సారి వెళ్లాల్సిన సమయానికంటే ముందే పవన్‌ సెట్‌కి వెళ్లడం చూసి ఆశ్చర్యపోయాను. సినిమాపై ఆయనకున్న ప్యాషన్‌ అర్థమైంది. ఇలాంటి సన్నివేశాలు రక్తికట్టించాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలి. పవన్‌ సహా ఇతర నటులంతా ఎంతో అద్భుతంగా నటించడం వల్లే అది సాధ్యమైంది. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు కథని ఎంపిక చేసుకున్న దర్శకుడు, నిర్మాతకి క్రెడిట్ ఇవ్వాలి.

ఈ పాత్ర ఎంపిక సమయంలో దాని ప్రభావం ఎలా ఉంటుందనుకున్నారు?

ప్రేక్షకులు నేను ఏ పాత్ర ఎంపిక చేసుకున్నానో చూడరు. చక్కగా నటిస్తాడా లేదా అనేదే చూస్తారు. నా వరకు నేను బాగా నటించానని ఎప్పుడూ అనుకోను. నా పాత్రతో కథని చెప్పగలిగానా లేదా అనేదే ఆలోచిస్తాను. నా మీద ఉన్న నమ్మకంతో దర్శకుడు  శ్రీరామ్‌ వేణు, నిర్మాత దిల్‌ రాజు ఈ అవకాశం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకున్నానంతే. పవన్ని, నన్ను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని పవన్‌ అభిమానులు, ప్రేక్షకులు కోరుకున్నారు. అలా వాళ్లకి కావాల్సిన వినోదం అందించాం.

ఈ చిత్రంలోని సంభాషలపై మీ అభిప్రాయం?

మహిళా సమస్యలపై నేనూ పవన్‌ అనర్గళంగా మాట్లాడగలం. పవన్‌ ఇందులో ఆయన నమ్మే విషయాల్నే చెప్పారు. సినిమా కోసం డైలాగులు చెప్పినట్టు కాకుండా చాలా సహజంగా మాట్లాడారు. అమ్మాయిలపై జరుగుతోన్న అన్యాయాన్ని ప్రశ్నించారు.

దిల్‌ రాజు, ప్రకాశ్‌ రాజ్‌ కాంబినేషన్‌ గురించి?

నేను ఆయనతో ‘దిల్‌’ చిత్రం నుంచి ప్రయాణిస్తున్నా. అన్నయ్య అని పిలుస్తాడు. ఫలానా సినిమాలో నటించాలని అని చెప్పకుండా ‘కథ ఇది. ఇందులో నువ్వు ఉంటే బాగుంటుంది’ అని అప్పజెప్తాడు. దీన్ని నువ్వు మోయాలి అంటాడు. ఆయన వ్యక్తిత్వం నాకు ఇష్టం. పని చెప్పాడంటే నేను చేయాల్సిందే. నా గురించి నా కన్నా ఎక్కువగా ఆయనకే తెలుసు.

మంచి కథలు, పాత్రలు ప్రకాశ్ రాజ్‌ని వెతుక్కుంటూ వస్తాయా?

అది నా పుణ్యం. దాదాపు 200 దర్శకులతో పనిచేశాను. అన్ని భాషల్లోనూ ప్రేక్షకులు ఆదరించారు. దర్శకుడిగా పరిచయమయ్యే చాలామంది నా కోసం ఒక పాత్రను రాసుకుంటారు. ఫలానా పాత్రకి ప్రకాశ్ రాజ్‌ న్యాయం చేయగలడని ఫిక్సవుతుంటారు. ఇంతటి పేరు రావడానికి కారణం నాకోసం మంచి పాత్రలు సృష్టించిన గత దర్శకులు, రచయితలే.

పవన్‌ ప్రతి సినిమాకు వసూళ్లు గురించి మాట్లాడతారు. కానీ, తొలిసారి పవన్‌ ఇచ్చిన సందేశం గురించి చెప్పుకుంటున్నారు.

అది ఆయన వ్యక్తిత్వం వల్లే. కొన్నాళ్ల విరామం అనంతరం మంచి కథతో వచ్చారు. రానాతో కలిసి చేస్తోన్న చిత్రమూ వైవిధ్యంగా ఉండబోతుంది.

ఏ కల్యాణ్‌ మీకు బాగా కనెక్ట్ అయ్యారు?

అప్పుడు.. ఇప్పుడు అని కాదు పవన్‌ని నేను ఎప్పుడూ ఇష్టపడతాను. అనుకుంది సాధించేశాం అని కాకుండా ప్రజలకు ఏదో చేయాలని ఆరాటపడుతుంటారు. సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి పవన్‌.

ఈ చిత్రంలోని ‘నో ఈజ్‌ నో’ అనే పాయింట్ గురించి?

నో అంటే నో అనే. మీరు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారో ఇతరుల్ని అలానే గౌరవించాలి. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడం అంటే మనకు మనం ఇచ్చుకోవడమే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని