Cinema News: తరతరాల రక్తపాతం - review of city of god
close
Published : 04/07/2021 10:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: తరతరాల రక్తపాతం

ప్రేక్షకాలమ్‌

చిత్రం: సిటీ ఆఫ్‌ గాడ్‌; భాష: పోర్చుగీస్; విడుదల: 2002; దర్శకుడు: ఫెర్నాండో మిరెలిస్, కాటియలండ్‌; నటీనటులు: అలాగ్జెండ్రా రోడ్రిగెజ్, లీనార్డో ఫిర్మినో, జోనాథన్‌ హాగెన్‌సన్‌ తదితరులు; సంగీతం: ఆంటోనియో పింటో, ఎడ్‌ కార్టెస్‌; సినిమాటోగ్రఫీ: సీజర్‌ చార్లోన్‌; నిడివి: 130 నిమిషాలు; ఎక్కడ చూడొచ్చు: అమెజాన్‌ ప్రైమ్‌

‘సిటీ ఆఫ్‌ గాడ్‌’ పోర్చుగీస్‌ భాషలో తెరకెక్కిన బ్రెజిలియన్‌ సినిమా. పోర్చుగీసులో ‘సిడాడె డె డెవుస్‌’ పేరుతో 2002లో విడుదలైంది. బ్రెజిల్‌ రాజధాని పక్కన ఉండే చిన్న పట్టణం పేరది. షార్ట్‌ ఫిల్మ్స్, యాడ్‌ ఫిల్మ్స్‌ మేకర్‌గా బ్రెజిల్‌లో మంచి పేరున్న ఫెర్నాండో మిరెలిస్‌ ఈ చిత్రాన్ని కాటియలండ్‌తో కలిసి తీశాడు. పాలో లిన్స్‌ అనే రచయిత రాసిన పుస్తకం ఆధారంగానే ‘సిటీ ఆఫ్‌ గాడ్‌’ రూపొందింది. మొత్తం నాలుగు విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్‌ సాధించిందీ చిత్రం. ఎందులోనూ అవార్డు వరించలేదు. అయితే మంచి కలెక్షన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. 3 మిలియన్‌ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం 30 మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించింది.

కథ: సినిమా కథంతా బ్రెజిల్‌ రాజధాని రియో డి జనీరో శివార్లలో ఉండే సిడాడె డె డెవుస్‌ మురికి వాడల్లో జరుగుతుంది. విద్యుత్తు, రవాణా లాంటి కనీస అవసరాలు తీరని ప్రాంతమది. అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా, పేదరికానికి  ప్రతీకగా ఉంటుంది. అట్లాంటి చోట టెండర్‌ ట్రైయో అనే పేరుతో ముగ్గురు సభ్యుల ముఠా దొంగతనాలు, దోపిడీలు చేస్తూ వచ్చిన డబ్బును పంచుకుంటుంటారు. పోలీసుల నుంచి తెలివిగా తప్పించుకు తిరుగుతారు. పెద్ద హోటల్‌లో దోపిడీ చేస్తే ఇంకా ఎక్కువగా దోచుకోవచ్చని లిటిల్‌ డైస్‌ అనే పిల్లాడు ఐడియానిస్తాడు. హోటల్‌లో బస చేస్తున్న వారిని దోచుకోవాలని ప్రణాళిక వేసి  అక్కడికి చేరకుంటారు. పోలీసులు వస్తే సిగ్నల్‌ ఇచ్చేందుకు లిటిల్‌ డైస్‌ను బయటే కాపలా ఉంచి లోపలికి వెళ్తారు. ఒక్కరినీ  చంపొద్దనేది వీరు పెట్టుకున్న నియమం. కొంత సేపటికి లిటిల్‌ డైస్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆ ముగ్గురు హోటల్‌ నుంచి పారిపోతారు. మరుసటి రోజు పత్రికల్లో మాత్రం అక్కడ చాలా మందిని చంపినట్లు కథనాలు కనిపిస్తాయి. దీంతో పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉంటుందా ముఠా. హోటల్లో హత్య   కాండకు తెగబడింది ఎవరు? దీని తర్వాత ఆ ముగ్గురు మిత్రుల బృందానికి ఎదురైన ఘటనలు ఏంటి? సిటీ ఆఫ్‌ గాడ్‌ అయిందెవరు? అనేది మిగతా కథ.

* ‘సిటీ ఆఫ్‌ గాడ్‌’ కథంతా ఫొటోగ్రాఫర్‌ అవ్వాలని కలలు కనే బుస్కేప్‌ కోణంలోనే   సాగుతుంది. అతడికి రాకెట్‌ అనే మరో ముద్దుపేరు ఉంటుంది. ‘టెండర్‌ ట్రైయో’ ముఠాలోని గూస్‌ ఈ రాకెట్‌కి స్వయంగా సోదరుడు. గ్యాంగ్‌స్టర్‌ ముఠాకు, పోలీసులకు మధ్య బుస్కేప్‌ ఇరుక్కుపోవడంతోనే సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి 1960ల కాలంలోకి వెళ్లి అక్కడి నుంచి ఫ్లాష్‌బ్యాక్‌ మొదలవుతుంది.   యవ్వనంలోకి అడుగుపెడుతున్న కుర్రాళ్లంతా డ్రగ్స్‌ వ్యాపారంలోకి దిగి డబ్బును పోగేసుకుంటారు. ఆ డబ్బుతో తుపాకులు కొని హత్యలతో చెలరేగుతూ సిటీని ఆధీనంలోకి తెచ్చుకుంటారు. నిర్దాక్షిణ్యంగా ఒకరినొకరు కాల్చుకుంటూ నగరమంతా రక్తపు మరకలతో నింపేస్తారు. అవినీతి అధికారుల తీరును చూపిస్తూనే, ఆ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైన తీరును కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. ఆధిపత్యం కోసం తాపత్రాయపడటంలో మొదటి రెండు తరాలు నాశనమయ్యాక మూడో తరం కూడా అటు వైపు అడుగులేస్తుంటే సినిమా ముగుస్తుంది. చివరి వరకు ఉత్కంఠ రేపే స్క్రీన్‌ప్లే, అందుకు తగినట్లుగా నేపథ్య సంగీతం ఒక బిగ్‌ బడ్జెట్‌ మాఫియా సినిమాలా అనిపిస్తుంది. సినిమా వాస్తవంగా ఉండేందుకు     స్థానికులనే నటులుగా ఎంచుకున్నారు. వారికి వంద రోజులు ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఆ కష్టం, ప్రతిభ అంతా తెరపై కనిపిస్తుంది. ఈ సినిమా విజయం తర్వాత ఫిల్మ్‌ మేకింగ్‌ నచ్చి దర్శకుడు ఫెర్నాండో మిరెలిస్‌కు హాలీవుడ్‌లో పనిచేసే అవకాశం దక్కింది. అక్క కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా చేశాడు.

* ఈ సినిమా బ్రెజిల్‌ ప్రభుత్వం దృష్టిని ఆకర్షించింది. ఆ ప్రాంతంపై దృష్టి పెట్టేలా చేసింది. అంతేకాదు ‘సిటీ ఆఫ్‌ గాడ్‌’ విజయంతో రియోలో సినిమాల నిర్మాణం విపరీతంగా పెరిగింది. ఇండిపెండెంట్‌ చిత్రాలతో పాటు ఫీచర్‌ సినిమాలూ అనేకం రూపుదిద్దుకున్నాయి. చేగువేరా జీవితం అధారంగా తెరకెక్కిన ‘మోటర్‌ సైకిల్‌ డైరీస్‌’ అలా తెరకెక్కిందే. అలా సామాజికంగా, సినిమా పరంగా మార్పులకు దోహదం చేసిందీ సినిమా. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని