close
Published : 08/04/2021 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇక్కడ అల్లు అర్జున్‌.. అక్కడ మల్లు అర్జున్‌ 

బన్ని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం

యూత్‌కు స్టైలిష్‌ ఐకాన్‌.. అమ్మాయిలకు ప్రేమను పంచే ‘ఆర్య’.. ‘డీజే’ సైతం పగిలిపోయేలా స్టెప్‌లు వేసే డ్యాన్సర్‌.. కథ, అందులోని పాత్ర కోసం తనని తాను మలుచుకునే నటనా శిల్పి.. కేవలం నటనే కాదు, కుటుంబానికీ ప్రాధాన్యం ఇచ్చే ఫ్యామిలీమన్‌.. అభిమానులకు ముద్దుల బన్ని.. ఇది అల్లు అర్జున్‌ గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. ‘గంగోత్రి’ నుంచి ‘అల వైకుంఠపురములో’ వరకూ అల్లు అర్జున్‌ సినీ ప్రయాణం చూస్తే దేనికదే ప్రత్యేకం. మాస్‌, క్లాస్‌, యూత్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఇలా అందరినీ మెప్పిస్తూ ప్రస్తుతం దక్షిణాదిన అత్యంత విజయవంతమైన హీరోల్లో ముందు వరుసలో ఉన్నారు. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ జన్మదినం. ఆయనకు పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

అభిమానుల ‘ఆర్య’

‘ఆర్య’ సినిమా తర్వాత బన్నికి కేవలం తెలుగులోనే కాదు, పొరుగు ఇండస్ట్రీల్లోనూ విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్‌ అని పిలుచుకునే బన్ని మలయాళంలో మల్లు అర్జున్‌ అయ్యారు. మన దగ్గర ఆయన సినిమాలు ఎంతలా అలరిస్తాయో.. అందుకు ఏమాత్రం తగ్గకుండా.. మలయాళంలోనూ ఆడుతుంటాయి. సెలబ్రిటీగా ఎంత ఫాలోయింగ్‌ వచ్చినా సరే.. అభిమానుల విషయంలో బన్ని రూటే సెపరేటు. సినిమా సెట్టయినా.. తన సొంత ఇల్లయినా.. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను పలకరించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ‘కన్నవాళ్ల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదే’ అని చెబుతూ.. అభిమానులనూ తన కుటుంబ సభ్యుల్లాగే భావిస్తారు. ‘ఎవరికైనా ఫ్యాన్స్‌ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. నా జీవితంలో నేను సాధించిన అతిపెద్ద ఆస్తి అభిమానులే’ అంటూ ఆయన మురిసిపోతుంటారు.

ఫ్యామిలీ ఫస్ట్‌

చిత్ర పరిశ్రమలో చాలామంది నటులకు తమ కుటుంబంతో గడిపేందుకు తగినంత సమయం దొరకదు. బన్నిలాంటి స్టార్‌ హీరోలకు మరీ కష్టం. అయితే.. అల్లు అర్జున్‌ మాత్రం ఫ్యామిలీ ఫస్ట్‌ అని నమ్ముతుంటారు. అందుకే షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వీలు కల్పించుకొని మరీ భార్య, పిల్లలతో గడిపేందుకు సమయం కేటాయిస్తుంటారు. ఇక తన తండ్రి అల్లు అరవింద్‌పై బన్నికి ఎంత ప్రేమ ఉందంటే.. ఈ మధ్య ఓ కార్యక్రమంలో బన్ని తన తండ్రి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎంత ఎదిగినా తన తండ్రి అంత గొప్ప స్థాయికి చేరుకోలేన’ని చెప్పి తండ్రికి గౌరవమిచ్చే మంచి కొడుకు అని నిరూపించుకున్నారు. ఇక భార్య విషయంలోనూ.. ‘పెళ్లయిన తర్వాతే సమాజాన్ని మరింత మెరుగ్గా చూడగలుగుతున్నాను. నా జీవితంలో ఆమె ప్రభావం ఎంతో ఉంది’ అని చెప్పి ఒక మంచి భర్త అనిపించుకున్నారు. తన పిల్లలతో భయపెట్టే తండ్రిలా కాకుండా.. ఒక స్నేహితుడిలా సరదాగా ఉంటూ.. కొన్ని ఆనంద క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లలతో సమయం గడుపుతూ బాధ్యతగల తండ్రిగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్‌ అనిపించుకుంటున్నారు.

ట్రెండ్‌ సెట్టర్‌..

టాలీవుడ్‌లో సిక్స్‌ప్యాక్‌ మొదలైంది బన్నితోనే. ‘దేశ ముదురు’ చిత్రంలో అల్లు అర్జున్‌ తొలిసారిగా ఆరు పలకల దేహంతో కనిపించారు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్రసీమలో ఒక హీరో సిక్స్‌ప్యాక్‌తో కనిపించడం ఆ సినిమాతోనే మొదలు. ఆ తర్వాత రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, నాగార్జున, నితిన్‌ ఇలా చాలామంది హీరోలు సిక్స్‌ప్యాక్‌ చూపించారు.

స్టైలిష్‌ స్టార్‌ అయ్యారిలా..

సినిమాకు నటన ఒక్కటే సరిపోదు.. నటులు తమ అభిమానుల అభిరుచిని గ్రహించగలగాలి. అందుకు తగ్గట్టుగా తమను తాము మలుచుకోవాలి. ఆ విషయంలో అందరికంటే ముందుంటారు అల్లు అర్జున్‌. ‘గంగోత్రి’లో అందర్నీ నటనతో కట్టిపడేసిన బన్ని.. తర్వాత వచ్చిన ‘ఆర్య’తో మొదలు పెట్టి  ‘బన్ని’, ‘హ్యాపీ’, ‘దేశ ముదురు’, ‘పరుగు’ సినిమాలతో టాలీవుడ్‌లో తన మార్కు వేశారు. అప్పటి నుంచి దక్షిణాది స్టైలిష్‌ స్టార్‌గా మారారు. ఆయన స్టైల్‌ విషయంలో ఎప్పటికప్పుడు ఎలా అప్‌డేట్‌ అవుతారని అడిగితే.. సినిమా సినిమాకు కొత్తగా ఉండేలా జాగ్రత్త పడటమే అని జవాబిస్తారు.

స్టెప్పేస్తే ‘డీజే’ బద్దలవ్వాల్సిందే

‘టాలీవుడ్‌లో డ్యాన్స్‌ ఇరగదీసే ఓ ముగ్గురు హీరోల పేర్లు చెప్పండి’ అని అడిగితే అందులో అల్లు అర్జున్‌ తప్పక ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే బన్ని స్టెప్పేస్తే ‘టాప్‌ లేచిపోద్ది’. ఇటీవల బుట్టబొమ్మ అంటూ పూజాహెగ్డేతో కలిసి ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో బన్ని వేసిన స్టెప్పులు దేశదేశాలను చుట్టేశాయి. ప్రస్తుతం దక్షిణాదిలోనే మంచి డ్యాన్సర్‌గా పేరున్నప్పటికీ.. ‘నన్ను అందరూ మంచి డ్యాన్సర్‌ అంటుంటారు. నా డ్యాన్స్‌లోనూ తప్పులుంటాయి. కానీ ఆ సంగతి ఎవరికీ తెలీదు. అయినా.. డ్యాన్స్‌ పెద్ద విషయం కాదనేది నా అభిప్రాయం. చిరంజీవిగారి పాటలు రీమేక్‌ చేయాలంటే.. ఆయనకు సరితూగలేమని భయమేస్తుంది’ అని అనడం బన్నిలోని నిరాడంబరతను తెలియజేస్తుంది.

హీరో ఎలా అయ్యాడంటే..

చిరంజీవి ప్రతీ పుట్టినరోజుకు అభిమానులు పెద్ద సంబరాలు చేసే విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి ఏడాది మాదిరిగానే ఒకసారి చిరంజీవి పుట్టినరోజు వేడుకలో చాలామంది డ్యాన్సులు చేస్తున్నారు. బన్ని కూడా స్టెప్పులేశారు. అలా అప్పుడే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కంట్లో పడ్డారు. రాఘవేంద్రరావు వెంటనే నిర్మల (అల్లు అర్జున్‌ తల్లి) దగ్గరకు వెళ్లి.. వంద రూపాయలు ఇచ్చి.. ‘మీవాడు పెద్దయ్యాక.. నేనే హీరోను చేస్తాను’ అని చెప్పారు. ఆ తర్వాత నిజంగానే ‘గంగోత్రి’ ద్వారా బన్ని హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అయితే.. రాఘవేంద్రరావు ఇచ్చిన ఆ వంద రూపాయల నోటు ఇప్పటికీ అల్లు అర్జున్‌ దగ్గర ఉండటం విశేషం.

 

-ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని