Tollywood: ఇది అదే.. ఒకే కథ.. రెండు చిత్రాలు - special story on tollywood movies
close
Published : 07/10/2021 10:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: ఇది అదే.. ఒకే కథ.. రెండు చిత్రాలు

ఇతర భాషల నుంచి సినిమాలు తెలుగులోకి రీమేక్‌ అవడం, మన సినిమాలు ఇతర భాషల్లో తెరకెక్కడం సర్వసాధారణం. అయితే ఇది వరకే తెలుగులో అనువాద చిత్రంగా అలరించి ఇప్పుడు రీమేక్‌లుగా సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. అంతేకాదు తెలుగు నుంచి ఇతర భాషల్లోకి రీమేక్‌ అయినవి కూడా మళ్లీ టాలీవుడ్‌లోకే అనువాదమైన సందర్భాలున్నాయి. అలా ఒకే కథతో తెలుగు ప్రేక్షకులను మళ్లీ మళ్లీ పలకరించిన సినిమాలేంటో చూద్దాం!

దియా.. డియర్‌ మేఘ

తెలుగులో ఇటీవలే  విడుదలైన సినిమా ‘డియర్‌ మేఘ’. గుండెల్ని పిండేసే విషాద ప్రేమకథగా కన్నడ ప్రేక్షకులను ఏడిపించిన ‘దియా’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. ముక్కోణపు ప్రేమకథతో ఫీల్‌గుడ్‌ మూవీగా వచ్చి అందరినీ ఆకట్టుకుంది.  దియా హక్కులు కొని ‘డియర్‌ మేఘా’ను తెరకెక్కించారు దర్శక-నిర్మాతలు. మేఘా ఆకాశ్‌  హీరోయిన్‌. అయితే కొన్ని రోజుల ముందే ‘దియా’ తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ యూట్యూబ్‌లో విడుదలైంది. తాజాగా దియా రీమేక్‌గా ‘డియర్‌ మేఘా’ థియేటర్లలో సందడి చేస్తుండటం విశేషం.  టాలీవుడ్‌లో వచ్చిన ‘అందాల రాక్షసి’ని ఈ చిత్ర కథ పోలి ఉందని సినీ వర్గాలు వ్యాఖ్యానించడం మరో గమ్మత్తు. 


వీరుడొక్కడే- కాటమరాయుడు

తమిళ హీరోలు సూర్య, కార్తి, విజయ్‌ల మాదిరిగా తెలుగునాట అజిత్‌కు ప్రత్యేకంగా మార్కెట్‌ లేదు. అయినా అజిత్‌ సినిమాలన్నీ డబ్‌ అవుతూనే ఉంటాయి. ఆయన నటించిన ‘వీరమ్‌’ తమిళంలో బ్లాక్‌ బస్టర్‌. తెలుగులో ‘వీరుడొక్కడే’గా అనువాదమైంది. తెలుగునాట అంతగా మెప్పించలేకపోయిన ఈ చిత్రాన్ని రీమేక్‌ చేశారు పవన్‌కల్యాణ్‌.  శ్రుతిహాసన్ జంటగా ‘కాటమరాయుడు’ని తెలుగు ప్రేక్షకులకు అందించారు.  నలుగురు తమ్ముళ్లకి అన్నయ్యగా పవన్‌ కల్యాణ్‌ అభిమానులను అలరించిన విషయం తెలిసిందే.  


లక్ష్మీ నరసింహ - స్వామి ఐపీస్‌

బాలకృష్ణ, అసిన్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘లక్ష్మీ నరసింహా’.  విక్రమ్‌ హీరోగా తమిళంలో చేసిన ‘సామి’కి రీమేక్‌గా వచ్చిన చిత్రమిది. రెండు చోట్ల ఈ చిత్ర ఘనవిజయం సాధించింది. పోలీసాఫీసర్లుగా విక్రమ్‌, బాలకృష్ణ ఇద్దరు అదరగొట్టారు. బాక్సాఫీస్‌ వద్ద ఖాకీచొక్క పవర్‌ చూపించారు. విక్రమ్‌కు తెలుగులోనూ మార్కెట్‌ ఏర్పడ్డాక  ‘సామి’ చిత్రాన్ని  తెలుగులోకి ‘స్వామీ ఐపీఎస్‌’గా డబ్‌ చేశారు. తమిళంలో త్రిష హీరోయిన్‌గా నటించగా, కోట శ్రీనివాస రావు విలన్‌గా మెప్పించాడు.


చెప్పవే చిరుగాలి - నీ ప్రేమతో

తమిళంలో సూపర్‌ హిట్టై సూర్య కెరీర్‌కు ఊతమిచ్చిన సినిమా ‘ఉన్నై నినత్తు’. 2002లో విడుదలై అక్కడ సిల్వర్‌ జూబ్లీ జరుపుకుందీ చిత్రం. స్నేహ, లైలా ఇందులో హీరోయిన్లుగా చేశారు‌.  తెలుగులో ‘నీ ప్రేమతో’గా అనువాదం అయింది. ఇదే సినిమాను  2004లో వేణు హీరోగా ‘చెప్పవే చిరుగాలి’గా రీమేక్‌ చేశారు. తెలుగులోనూ సూపర్‌ హిట్‌గా నిలిచి వేణు కెరీర్‌ను గాడిన పడేసిన సినిమా ఇది. ఇలా ఒకే చిత్రం ఇద్దరు హీరోలకు కీలకంగా మారింది.


టెంపర్‌-అయోగ్య

తెలుగు కథతో కోలీవుడ్‌లో రీమేక్‌ చేసి హిట్టు కొట్టిన తమిళ హీరో విశాల్‌. ఎన్టీఆర్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ తీసిన ‘టెంపర్‌’ను ‘అయోగ్య’గా రీమేక్‌ చేశారు. తెలుగులో టెంపర్ సూపర్‌ హిట్‌గా నిలిచింది. తమిళంలో రాశీఖన్నా హీరోయిన్‌గా విశాల్‌ చేసిన అయోగ్య కూడా అక్కడ హిట్టైంది. టాలీవుడ్‌లో విశాల్‌కు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని దాన్ని తెలుగులో డబ్‌ చేశారు.


లూసిఫర్‌- గాడ్‌ ఫాదర్‌

తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ బాటలోనే అన్నయ్య చిరంజీవి కూడా ఇలాంటి ప్రయత్నమొకటి చేస్తున్నారు. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ ‘లూసిఫర్’‌. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ చిత్రం కేరళలో వసూళ్ల సునామీని సృష్టించింది.  అదే పేరుతో తెలుగులో కూడా డబ్ అయింది. ఇప్పుడు మళ్లీ ఇదే సినిమాను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’గా  తెరకెక్కిస్తున్నారు.  మోహన్‌ రాజా దర్శకుడు. ఈ చిత్రం ఏ మేరకు అలరిస్తుందో చూడాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.  తెలుగులో విడుదలైన అజిత్‌ చిత్రం ‘ఎంతవాడు గానీ’ సినిమాను కూడా మెగాస్టార్‌ చేయనున్నారని సమాచారం. 


రెండోసారి పలకరించిన మరికొన్ని చిత్రాలు

తెలుగు ప్రేక్షకులను రెండుసార్లు పలకరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

* రజనీకాంత్‌ తొలినాళ్లలో హీరోగా మంచి బ్రేక్‌ ఇచ్చిన సినిమా ‘ముల్లుం మలరుమ్‌’, నటుడిగా కోలీవుడ్‌లో పాతుకుపోయేలా చేసిన సినిమా అది. దాన్ని తెలుగులోకి ‘ముల్లు పువ్వు’గా అనువాదం చేశారు. ఇదే కథాంశంతో తెలుగులో మోహన్‌బాబు ‘సీతమ్మ పెళ్లి’గా రీమేక్‌ చేశారు.

* మలయాళం క్లాసిక్‌ ‘కిరీడమ్‌’ను రాజశేఖర్‌ ‘రౌడీయిజం నశించాలి’గా 1989లోనే రీమేక్‌ చేశాడు. దీన్నే తమిళంలో 2007లో అజిత్‌ రీమేక్‌ చేయగా, తెలుగులో అది ‘పూర్ణ మార్కెట్‌’గా డబ్‌ అయింది. 

* బాలకృష్ణ సూపర్‌ హిట్‌ చిత్రం ‘నరసింహనాయుడు’, దాన్నే తమిళంలో రీమేక్‌ చేసిన అర్జున్‌ తిరిగి తెలుగులో ‘సింహబలుడు’ పేరుతో డబ్‌ చేశాడు.

* తమిళంలో హిట్టైన ఒక సూర్య చిత్రాన్ని ‘ఆడంతే అదో టైపు’ పేరుతో ఈవీవీ సత్యనారాయణ రీమేక్‌ చేశారు. ఆ సూర్య చిత్రమే మళ్లీ ‘కంచు’ పేరుతో తిరిగి అనువాదమైంది.  

* విజయ్‌ కథానాయకుడిగా తమిళంలో సూపర్‌ హిట్టైన ‘శివకాశి’ని తెలుగులో కళ్యాణ్‌ రామ్‌ ‘విజయదశమి’గా రీమేక్‌ చేశాడు. అదే ‘శివకాశి’ చిత్రాన్ని  ‘మాస్‌ రాజా’ పేరుతో తెలుగులో అనువాదమైంది.

* ‘ఏమాయ చేసావే’ కూడా ‘ఎందుకిలా చేసావే’ పేరుతో యూట్యుబ్‌లో అందుబాటులో ఉంది. ఇలా ఒకే కథతో రెండు సార్లు తెలుగు తెరపై చాలా చిత్రాలే వచ్చాయి. అలా విడుదలైన రెండు సినిమాలు విజయం సాధించిన సందర్భాలు లేవు. వాటిలో ఏదో ఒకటి మాత్రమే మన ప్రేక్షకులను మెప్పించగలిగాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని