రివ్యూ: స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌ - state of siege temple attack telugu movie review
close
Updated : 10/07/2021 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రివ్యూ: స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌

చిత్రం: స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌; నటీనటులు: అక్షయ్‌ ఖన్నా, గౌతమ్‌ రాడే, శివమ్‌ భార్గవ, మంజరి, ప్రవీణ్ దబాస్‌, అభిలాష్‌ చౌదరి, అభిమన్యు సింగ్‌ తదితరులు; సంగీతం: కార్తీక్‌ షా, అనిల్‌ కుమార్‌ కొనకండ్ల(మిక్సింగ్‌); సినిమాటోగ్రఫీ: తేజల్‌ ప్రమోద్‌ సత్యే; ఎడిటింగ్‌: ముఖేశ్‌ ఠాకూర్‌; యాక్షన్‌ డైరెక్టర్‌: మనోహర్‌ వర్మ, రింకూ బచ్చన్‌; నిర్మాత: అభిమన్యు సింగ్, రూపాలి సింగ్‌, కాంటిలోయ్‌ పిక్చర్స్‌; రచన: విలియమ్‌ బ్రోత్విక్‌, సిమన్‌ ఫాంటూజో; దర్శకత్వం: కెన్‌ ఘోష్‌; విడుదల: జీ5 ఒరిజినల్‌

దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులను అంతమొందించటం, లేదా పొరుగు దేశంలో దాక్కున్న వారిని ఆర్మీ ఆపరేషన్‌ ద్వారా హతమార్చడం అన్న పాయింట్‌ ఎప్పటికీ అలరించేదే. ఈ కథా నేపథ్యంతో అన్ని భాషల్లోనూ చిత్రాలు తెరకెక్కాయి. అయితే, సినిమా మొదలైన దగ్గరి నుంచి చివరి వరకూ ఆర్మీ ఆపరేషన్‌తో వచ్చిన కథలు చాలా తక్కువ. హాలీవుడ్‌లో ఇలాంటి కథలు చాలానే వచ్చినా ఇక్కడ ‘ఉరి’, ‘గగనం’లాంటి  సినిమాలు మాత్రమే తెరకెక్కాయి. అలాంటి కోవలో తెరకెక్కిన చిత్రమే ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌’. 2002 గుజరాత్‌లోని అక్షరధామ్‌పై ఉగ్రదాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? ఎన్‌ఎస్‌జీ కమాండోలు ఆపరేషన్‌ ఎలా చేశారు? ఉగ్రవాదులను ఎలా మట్టుబెట్టారు?

కథేంటంటే: మేజర్‌ హనుత్‌(అక్షయ్‌ ఖన్నా) తన బృందంతో కలిసి ఉగ్రవాదుల చెరలో చిక్కిన మంత్రి కుమార్తెను రక్షిస్తారు. అయితే, ఆ ఆపరేషన్‌లో తోటి సైనికుడు ప్రాణాలు కోల్పోవడం, తాను గాయాల పాలవడంతో తీవ్ర మానసిక వేదన అనుభవిస్తుంటాడు. ఆ తర్వాత గుజరాత్‌లో విధులు నిర్వర్తిస్తుంటాడు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చోక్సీ(సమీర్‌ సోని)కి అపాయం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందండంతో ఆయనకు రక్షణగా నియమించిన బృందంలో సభ్యుడిగా వెళ్తాడు. అదే సమయంలో అక్కడి ప్రఖ్యాత అక్షరధామ్‌ ఆలయంలోకి నలుగురు ఉగ్రవాదులు చొరబడి, కనపడిన వారిని కనపడినట్లు కాల్చేస్తుంటారు. కొంతమందిని బందీలుగా చేసుకుని తమ నాయకుడు బిలాల్‌ను విడిచిపెట్టాలని డిమాండ్‌ చేస్తారు. అప్పుడు మేజర్‌ హనుత్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? మేజర్‌ సమర్‌(గౌతమ్‌ రాడే)తో కలిసి చేసిన ఆపరేషన్‌ ఏంటి? అది సఫలమైందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: యాక్షన్‌ జోనర్‌ను ఇష్టపడే వాళ్లకు ఆర్మీ ఆపరేషన్‌ కథా నేపథ్యంలో సాగే సినిమాలు భలే అలరిస్తాయి. ఈ కథా నేపథ్యంతో వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఆకట్టుకునేవే. ముఖ్యంగా దేశభక్తికి సంబంధించిన భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుడికి బాగా కనెక్ట్‌ అవుతాయి. ఆ చిత్రాల్లాగానే ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌’ కూడా అలరిస్తుంది. కశ్మీర్‌లో ఆర్మీ ఆపరేషన్‌తో మొదలైన సినిమా మొదటి నుంచే ఉత్కంఠతో సాగుతుంది. అక్కడ నుంచి కథ గుజరాత్‌కు షిఫ్ట్‌ అవుతుంది.  ఉగ్రవాదుల శిక్షణ, భారత్‌లోకి ప్రవేశించటం, అక్కడి నుంచి గుజరాత్‌లోని ఆలయంలోకి వెళ్లడంతో ఇలా ఒక్కో సన్నివేశంతో ప్రేక్షకుడిని కథలో లీనం చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఉగ్రవాదులు ఎప్పుడైతే ఆలయంలోకి ప్రవేశించారో అక్కడి నుంచి కథ మరింత ఉత్కంఠగా సాగుతుంది. ఆలయంలో ఎవరు కనపడితే వారిని ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్చి చంపేస్తుండటం, కూతురు ప్రాణాలు కాపాడుకునేందుకు తండ్రి చేసే త్యాగం ఇలా ప్రతి సీన్‌ భావోద్వేగానికి గురి చేస్తుంది. ఎన్‌ఎస్‌జీ కమాండో అయిన హనుత్‌, తన టీమ్‌తో కలిసి గుడిలోకి ప్రవేశించడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఇక్కడి నుంచి తర్వాత ఏం జరుగుతుందన్న విషయం ప్రేక్షకుడికి తెలిసిపోతున్నా, ప్రతి సన్నివేశాన్నీ అలరించేలా తీర్చిదిద్దాడు దర్శకుడు.

ద్వితీయార్ధం మొత్తం ఆలయం, అందులో బందీలుగా ఉన్న వారిని రక్షించటానికి జరిగే ఆపరేషన్‌తో కథ నడుస్తుంది. క్లైమాక్స్‌ ఏంటో ప్రేక్షకుడికి తెలిసినా కూడా ఉగ్రవాదులను ఎన్‌ఎస్‌జీ ఎలా మట్టుబెడుతుందన్న అంశం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆయా సన్నివేశాల్లో వినిపించే నేపథ్య సంగీతం, భావోద్వేగాలు పతాక స్థాయిలో ఉంటాయి. అయితే, ఇలాంటి సన్నివేశాలు ఇంకొన్ని ఉంటే సినిమా మరింత బాగుండేది. కథ తెలిసిపోతున్నా, ఉత్కంఠతో సాగే కథనంతో ఆకట్టుకున్నాడు దర్శకుడు. యథార్థ ఘటలను చూపించే ప్రయత్నంలో నాటకీయతకు చోటు ఇవ్వలేదు. దీంతో సినిమా రెండు గంటల్లోపే ముగిసిపోతుంది. ఇంకాస్త సమయం తీసుకుని మరికొన్ని బలమైన భావోద్వేగ సన్నివేశాలను రాసుకుని ఉంటే బాగుండేది.

ఎవరెలా చేశారంటే: మేజర్‌ హనుత్‌గా అక్షయ్‌ ఖన్నా అదరగొట్టారు. ఎన్‌ఎస్‌జీ కమాండోగా చక్కగా సరిపోయారు. ఇతర కమాండోలుగా కనిపించిన గౌతమ్‌ రాడే, వివేక్‌ దహియా, అక్షయ్‌ ఒబెరాయ్‌లు తమ పరిధి మేరకు నటించారు. ఉగ్రవాదులుగా నటించిన నలుగురు యువకులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమా ప్రధాన బలం నేపథ్య సంగీతం కార్తీక్‌ షా సంగీతం, అనిల్‌ కుమార్‌ కొనకండ్ల మిక్సింగ్‌ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. తేజల్‌ ప్రమోద్‌ సత్యే సినిమాటోగ్రఫీ బాగుంది. ఆలయం, యాక్షన్‌ సన్నివేశాలను చూపించిన విధానం అలరిస్తుంది. ముఖేశ్‌ ఠాకూర్‌ ఎడిటింగ్‌ ఓకే. అనవసర సన్నివేశాలు పెద్దగా లేవు. ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌’ సిరీస్‌లో వస్తున్న రెండో చిత్రమిది. గతంలో 26/11 చూపించారు. ఇప్పుడు అక్షరధామ్‌ అటాక్‌ కథా నేపథ్యాన్ని ఎంచుకున్నారు. దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను సూటిగా చెప్పే ప్రయత్నం చేశాడు. స్క్రిప్ట్‌నకు అనుగుణంగా ప్రతి సన్నివేశం సాగింది. కాస్త నాటకీయత జోడించి, మరికొన్ని భావోద్వేగ సన్నివేశాలను జోడించి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సిరిస్‌లో మరో సినిమా రాబోతోందని చెప్పడానికి క్లైమాక్స్‌ లీడ్‌ కూడా ఇచ్చారు. ఈసారి చిత్ర బృందం ఏ పాయింట్‌ ఎంచుకుంటుందో చూడాలి.

చివరిగా: ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌’ మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌

 

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని