ఏకాంతవాసం.. ఉత్కంఠ భరితం - story line of hollywood horror movie the shinning
close
Published : 12/05/2021 09:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏకాంతవాసం.. ఉత్కంఠ భరితం

ప్రేక్షకాలమ్‌

సినిమా: ది షైనింగ్; భాష: ఇంగ్లీష్‌; విడుదల: 1980; దర్శకుడు: స్టాన్లీ కుబ్రిక్‌; తారాగణం: జాక్‌ నికల్సన్, షెల్లీ డువాల్‌ తదితరులు; నిడివి: 144 నిమిషాలు; ఎక్కడ చూడొచ్చు: యూట్యూబ్‌(డబ్బు చెల్లించి)

కరోనా దెబ్బకు ‘ఐసోలేషన్‌’ కష్టాలేంటో అందరికీ తెలిసొచ్చాయి. ఆ పదం ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంటికో, ఓ ప్రాంతానికి పరిమితమైపోయి స్వీయ నిర్బంధంలో ఉండటం కష్టమే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాణాలు నిలుపుకోవాలంటే ఉండక తప్పదు. ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయిన కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఓ హాలీవుడ్‌ చిత్రానికి కాసుల వర్షం కురిసింది. ఇది మంచి ఫీల్‌గుడ్‌ మూవీనో, చక్కటి కుటుంబ కథా చిత్రమో కాదండోయ్‌. వెన్నులో వణుకు పుట్టించే ఓ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘ది షైనింగ్‌’. ఆ సినిమా విశేషాలతో మీ ముందుకు వచ్చింది ఈనాటి ప్రేక్షకాలమ్‌.

స్టాన్లీ కుబ్రిక్‌ తీసినవి కొన్ని సినిమాలైనా హాలీవుడ్‌లో మేటి దర్శకుడిగా గుర్తింపు పొందాడు. యుద్ధం, చరిత్ర, హింస ఇలా అన్ని రకాల చిత్రాలు చేసిన కుబ్రిక్‌కి మంచి హారర్‌ చిత్రాన్ని చేయాలన్న కోరికుండేది. 1985లో తీసిన పిరియాడిక్‌ డ్రామా ‘బారీ లిండన్‌’ చిత్రం భారీ నష్టాన్ని మిగిల్చింది. విమర్శలూ వెల్లువెత్తాయి. అప్పుడే ఆయనకు హారర్‌ తీయాలన్న కోరిక మరింత బలపడింది. అలా ‘ది షైనింగ్‌’కి బీజం పడింది. ప్రఖ్యాత రచయిత స్టీఫెన్‌ కింగ్‌ పుస్తకం ది షైనింగ్‌ పుస్తకం ఆధారంగానే దీన్ని తెరకెక్కించాడు స్టాన్లీ. సినిమా కోసం కింగ్‌ రాసిన స్క్రీన్‌ప్లే నచ్చకపోవడంతో స్టాన్లీనే మరో రచయితతో కలిసి స్వయంగా రాసుకున్నాడు. అయితే చిత్ర బృందం ఎంపిక, పతాక సన్నివేశాల్లో మార్పుపై బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేశాడు స్టీఫెన్‌ కింగ్‌. చిత్రీకరణకు ఎక్కువ సమయం తీసుకున్న ఈ సినిమా 1980 మే 28న విడుదలైంది. కలెక్షన్ల వర్షం కురిపించింది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో ‘ది షైనింగ్‌’ని ఇప్పటికీ ఉత్తమ చిత్రంగానే అభివర్ణిస్తోంది సినీలోకం.

కథ: జాక్‌ టోరెన్స్‌(జాక్‌ నికెల్సన్‌)కి నిలకడైన ఉద్యోగమంటూ ఉండదు. రచయితగా ఎదగాలన్న కోరిక.  అలాంటి సమయంలో ఓవర్లుక్‌ అనే హోటల్‌లో కేర్‌టేకర్‌గా జాక్‌కి ఉద్యోగం దొరుకుతుంది. అది సాధారణ హోటల్‌ కాదు. చలికాలంలో ఆ ప్రాంతమంతా మంచులో మునిగిపోతుంది. గడ్డకట్టే మంచు వాతావరణం ఉండటంతో హోటల్‌ పూర్తిగా మూసేసి ఉంటుంది. సందర్శకులు వచ్చే అవకాశం లేదు. అలాంటి హోటల్‌ బాగోగులు చూసుకునేందుకు జాక్‌ టోరెన్స్‌ తన భార్య వెండీ, కుమారుడు డానీ టోరెన్స్‌లతో కలిసి వస్తాడు. డానీ ఓ మానసిక వ్యాధితో బాధపడుతుంటాడు. టోనీ అనే ఊహాజనిత వ్యక్తితో మాట్లాడుతూ వింతగా ప్రవర్తిస్తుంటాడు. జాక్‌ ఒంటరిగా కూర్చొని తన రచనలో మునిగిపోతాడు. క్రితం ఏడాది ఇలాగే కేర్‌టేకర్‌గా వచ్చిన వ్యక్తి మొత్తం కుటుంబాన్ని చంపి, ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ విషయాలన్ని జాక్‌ కుమారుడు డానీకి ముందుగానే కనిపిస్తూ హెచ్చరికలు వస్తూ ఉంటాయి. పైగా అతడొక వింత వ్యాధితో బాధపడుతుంటాడు. హోటల్‌కి వెళ్లాక కొన్నాళ్లు సాఫీగానే సాగినా ఆ తర్వాతే అక్కడ జరిగే సన్నివేశాలు వణికిస్తాయి. సినిమా ఆరంభంలో ఎంతో సున్నితంగా ఉండే జాక్‌ కిరాతకుడిగా మారతాడు. కొడుకుని, భార్యని చంపడానికి సిద్ధపడతాడు. అక్కడి పరిస్థితుల నుంచి వారి కుటుంబం ఎలా బయటపడింది. అక్కడలాంటి భయంకర వాతావరణం ఏర్పడేందుకు దోహదం చేసిన పరిస్థితులు ఏంటనేవి సినిమాలో చూడాల్సిందే.

తీసినవి పదమూడే.. సినీ ఔత్సాహికులకు స్టాన్లీ సినిమాలు డిక్షనరీలాంటివని చెప్పుకొంటారంటే అతిశయోక్తి కాదు. కుబ్రిక్‌ తీసినవి 13  సినిమాలే అయిన 20వ శతాబ్ద గొప్ప దర్శకుల్లో ఒకడిగా సినీలోకం ఆయన్ను కీర్తిస్తుంది. చిన్నప్పటి నుంచి అత్తెసరు చదువులతోనే నెట్టుకొచ్చిన స్టాన్లీకి ఫొటోగ్రఫీ, సాహిత్యం,  సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండేవాడు. కొన్నాళ్లు ‘లుక్‌’ అనే మ్యాగజైన్‌కి ఫొటోగ్రాఫర్‌గా పనిచేసి అక్కడ మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం వదిలేసి సినిమాలపై ఇష్టంతో డాక్యుమెంటరీస్‌ తీయడం మొదలెట్టాడు. అలా 1951లో ‘డే ఆఫ్‌ ది ఫైట్‌’ని తీశాడు. ఆ తర్వాత మరో రెండు డాక్యుమెంటరీను తెరకెక్కించిన ఆయన ‘కిల్లర్‌ కిస్‌’ సినిమాతో దర్శకుడిగా హాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. కిర్క్‌ డగ్లస్‌తో ‘పాథ్స్‌ ఆఫ్‌ గ్లోరీ’, ‘స్పార్టకస్‌’ లాంటి క్లాసిక్స్‌ను అందించాడు. 1968లో వచ్చిన ‘2001: ఏ స్పేస్‌ ఒడిస్సీ’ సినిమాతో తానెంత ముందుచూపున్న దర్శకుడో సినీలోకానికి తెలియజెప్పాడు. ఆ తర్వాత ‘ది షైనింగ్‌’, ‘ఫుల్‌ మెటల్‌ మెటల్‌ జాకెట్‌’ సినిమాలకూ మంచి ప్రశంసలు దక్కాయి. చివరి చిత్రం టామ్‌ క్రూయిజ్‌తో ‘ఐస్‌ వైడ్‌ షట్‌’ను తెరకెక్కించారు. సాహిత్య విలువలు, పరిశోధనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. నెపోలియన్‌ జీవితాన్ని సినిమాగా తీయాలనేది చిరాకల కల. అది కలగానే మిగిలిపోయింది. ఆ సినిమా కోసం రెండేళ్లపాటు విస్తృతమైన పరిశోధన చేశారాయన. అదే ‘నెపోలియన్‌: ది గ్రేటెస్ట్‌ మూవీ నెవర్‌ మేడ్‌’ పేరుతో పుస్తకంగా వచ్చింది.

ఒక సన్నివేశం.. 127 టేక్స్‌.. అనుకున్నది అనుకున్నట్లుగా సన్నివేశం పండేందుకు కుబ్రిక్‌ ఏదైనా చేస్తాడనేందుకు ఈ సినిమానే నిదర్శనం. నటీనటులతో కొన్ని వందల సార్లు రీటేక్స్‌ తీసుకునేవాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇందులో భర్త తనని చంపేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వెండీ పాత్రధారి మెట్లు ఎక్కే సన్నివేశాన్ని మొత్తం మూడు రోజుల పాటు తెరకెక్కించారట. మొత్తం 127 టేకులు తీసుకుని చివరకు సన్నివేశాన్ని ముగించారట. ఎక్కువ టేకులు తీసుకున్న సన్నివేశంగా గిన్నిస్‌ రికార్డు కూడా ఉంది. సినిమాలో ఉండే ఆ భయం, ఆందోళన, నిరాసక్తత మొహంలో   కనిపించేందుకు నటి షెల్లీ ఎప్పుడూ ఏడుపుగొట్టు పాటలు వినేదంట. చిత్రీకరణ అనంతరం ఆ ఒత్తిడికి నటి అనారోగ్యం పాలయినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొందంటే ఎంత ఆందోళనకు గురయిందో అర్థం చేసుకోవచ్చు. అలా ‘ది షైనింగ్‌లో చేసిన వెండీ టోరన్స్‌ పాత్రే తాను చేసిన పాత్రలన్నింట్లోకి ఉత్తమైందని చెప్పుకొంటుంది షెల్లీ.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని