ప్రపంచమే కోరుకునే అతివరా.. - story on republic song
close
Published : 19/07/2021 10:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రపంచమే కోరుకునే అతివరా..

కొత్తపాట..

 

పెను విప్లవాల విశ్వకన్య స్వేచ్ఛరా‘‘మనిషి జీవితంలో అత్యంత విలువైనది స్వేచ్ఛ. మన దగ్గర ఎన్ని కోట్లున్నా సరే.. స్వేచ్ఛ లేకపోతే ఉపయోగం లేనట్లే. ప్రపంచంలో జరిగిన ప్రతి విప్లవానికి కారణం అదే. అయితే మనం ప్రతిసారీ ఏదోక చోట మన హక్కుల విషయంలో రాజీ పడిపోతుంటాం. ప్రశ్నించలేకపోతుంటాం. నిలదీయాలనున్నా.. నోరు   విప్పలేక మనసులోనే మదన పడుతుంటాం. ఇది అందరిలో ఉండే ఎమోషనే. మరి అలా ప్రశ్నించలేకపోతున్న వేలాది గొంతుకల తరఫున ఓ యువకుడు గళం వినిపిస్తే ఎలా ఉంటుంది.. అతనిలోని భావనలను అందమైన ప్రేమ గీతంలా మలిస్తే ఎలా ఉంటుంది? అదే మా ‘గాన ఆఫ్‌ రిపబ్లిక్‌’ పాట’’ అన్నారు గీత రచయిత రెహమాన్‌. సాయితేజ్‌ - దేవ్‌ కట్టా కలయికలో తెరకెక్కిన ‘రిపబ్లిక్‌’ సినిమా కోసం ఆయన రాసిన గీతమిది. ఇటీవలే విడుదలైన ఈ పాట.. మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ‘ఈనాడు సినిమా’ రెహమాన్‌ను పలకరించగా.. పాట విశేషాలు పంచుకున్నారిలా..

ఇప్పటికీ స్వేచ్ఛ, విప్లవాల గురించి చర్చించాల్సి వస్తే.. చాలా గంభీరంగా, రెబల్‌గా చెబుతుంటారు. దర్శకుడు దేవ్‌ కట్టా మాత్రం దాన్ని ఏదో క్లాస్‌ పీకినట్లుగా కాకుండా, కొత్తగా అందరూ పాడుకోగలిగే అందమైన ప్రేమ గీతంలా చూపించాలనుకున్నారు. ఒక కాలేజీ కుర్రాడు స్వేచ్ఛని ఓ అమ్మాయిలా ఊహించుకుంటూ పాడితే ఎలా ఉంటుందో.. అలా పాట రాసివ్వమన్నారు. ఇదొక కొత్త ప్రక్రియ.    రచయితగా నాకూ కొత్త అనుభూతిని.. గొప్ప సంతృప్తిని పంచిచ్చింది. ముందే చెప్పినట్లు ఈ సినిమాలో స్వేచ్ఛని తన ప్రేయసిలా భావిస్తూ సాయితేజ్‌ ఈ పాటని ఆలపిస్తుంటాడు. మరి ఆ ప్రేయసి ఎలా ఉంటుంది అంటే.. ‘‘నా ప్రాణంలోని ప్రాణం.. నా దేహంలోని దాహం.. ఆ మౌనం పాడే గానం’’ అని చెబుతాడు. స్వేచ్ఛ అన్నది ప్రతిఒక్కరూ కోరుకునే అపురూప కన్య. చాలా విలువైంది. ఇంత వరకు జరిగిన విప్లవాలన్నీ ఆ కన్య కోసమే జరిగాయి. ఇదే విషయాన్ని ‘‘ఈ ప్రపంచమే కోరుకునే అతివరా.. పెను విప్లవాల విశ్వకన్య స్వేచ్ఛరా’’ అని అందంగా వివరించా. ఇందులో విశ్వ కన్య అనేది చాలా బరువైన మాట. ఇక్కడ ఈ పదం మరీ ఎక్కువైపోతుందేమో అనుకున్నా. కానీ, దేవ్‌ కట్టా ‘మనం చెప్పే అంశం చాలా బలమైనది. దాన్ని హత్తుకునేలా చెప్పాలంటే ఈ మాత్రం బరువైన పదాలు పడాల్సిందే’ అన్నారు. బ్రిటిష్‌ వారికి ప్రాణాలు ఎదురొడ్డి పోరాడి స్వేచ్ఛని సాధించి తెచ్చుకున్నాం. సంబరాలు చేసుకున్నాం. కానీ, నిజానికి సామాన్యులకి అది ఇప్పటికీ అందలేదు. మరింత ప్రమాదకరమైన పంజరంలో చిక్కుకుపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులే ఇందుకు ఉదాహరణ. ఇదే విషయాన్ని ‘‘తెల్లవాడి నెదురించి నల్లని చీకట్లనుంచి పిల్లను విడిపించి తెచ్చి సంబరాలు చేసుకుంటే అంతలోనే తెలిసిందది మాయమైపోయింద’’ని చెప్పా. మరి స్వేచ్ఛ మాయమైపోయినప్పుడు ఇక మనిషికి విలువేముంటుంది. ఏదోక పోరాటం చేసి దాన్ని సాధించుకోగలిగినప్పుడే జీవితానికి ఓ విలువ ఉంటుంది. అయితే ఇప్పుడు దాన్ని సాధించుకునే దారి కనిపించట్లేదు. ఇదే   విషయాన్ని ‘‘అదిలేక మనిషికింకా విలువేదిరా.. ఏ పోరాటంతో దానిని చేరాలిరా’’ అంటూ వివరించా.

రెండో చరణంలో ‘‘అనాదిగా ఎవడో ఒకడు అది నాకే సొంతమంటూ.. నియంతలై నిరంతరం చెరలో బంధించినారు. రెక్కలనే విరిచేసి హక్కులనే చెరిపేసి అడిగే ప్రతి ఒక్కడిని అణిచి అణచి వేసినారు’’ అని రాశా. ప్రతి కాలంలోనూ ఎవడో ఒక నియంత.. సామాన్యుల స్వేచ్ఛని, హక్కుల్ని హరిస్తూనే ఉంటున్నాడు. అది ఇప్పటికీ కొనసాగుతూనే వస్తోంది. ఇప్పుడు ఉత్తర కొరియాతో పాటు చాలా బయటి దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అక్కడి ప్రజలకు స్వేచ్ఛ ఉండదు. మనస్ఫూర్తిగా తమ భావాలను వ్యక్తీకరించలేరు. ఏ పనీ ధైర్యంగా చేయలేరు. వారి స్వేచ్ఛకు అనేక ఆటంకాలున్నాయి. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి పోరాడే ప్రయత్నం చేస్తే.. ఏదోక రకంగా వాళ్లని అణగదొక్కే ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయాలన్నీ ఆ చరణంలో చెప్పా. అయితే స్వేచ్ఛ కోసం సాగించే పోరాటాల్ని ఎంత అణగదొక్కాలని ప్రయత్నించినా.. ఆ స్వాతంత్య్ర కాంక్ష ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. అందుకే ఆఖర్లో ‘‘చల్లారని స్వాతంత్య్ర కాంక్ష స్వేచ్ఛరా.. నరనరాల్లోన ప్రవహించే ఆర్తిరా’’ అంటూ ముగించా. ట్యూన్‌కి తగ్గట్లుగా రాసిన పాట కాదిది. ఇలాంటి గీతాలకు పరిమితులు ఉండకూడదు. అలా ఉంటే చెప్పాలనుకున్న భావాలను బలంగా చెప్పలేం. ఈ ఆలోచనతోనే దేవ్‌ కట్టా నన్ను ముందు లిరిక్స్‌ రాయమని చెప్పారు. దాదాపు 10  రోజులు శ్రమించి పాట పూర్తి చేశా. ఆ తర్వాత అందులోని సాహిత్యానికి తగ్గట్లుగా మణిశర్మ చక్కటి బాణీలు కట్టారు.

పల్లవి: ఏయ్‌ రారో ఎయ్‌ రారో.. ఏయ్‌ రారో ఎయ్‌ రో //ఏయ్‌ రారో//
నా ప్రాణంలోని ప్రాణం
నా దేహంలోని దాహం
ఆ మౌనం పాడే గానం
నా ప్రశ్న సమాధానం
అది అందమైన అందరాని కన్నెరా
లక్ష అక్షరాలు రాయలేని కవితరా
ఈ ప్రపంచమే కోరుకునే అతివరా
పెను విప్లవాల విశ్వకన్య స్వేచ్ఛరా
నా కళ్లలోన రంగుల కలరా
నా ఊహలకే ఉనికే తనురా
నా బతుకులోన భాగం కదరా
నా ఊపిరికే అర్థం తనురా //ఏయ్‌ రారో//

చరణం 1: తెల్లవాడినెదురించి నల్లని చీకట్ల నుంచి
పిల్లను విడిపించి తెచ్చి సంబరాలు చేసుకుంటే
అంతలోనే తెలిసిందది మాయమైపోయిందని
ముందుకన్న ముప్పు ఉన్న పంజరానా వున్నదని
అసలెక్కడుందో తెలియకుంది చూడరా
అదిలేక మనిషికింకా విలువేదిరా
ఏ పోరాటంతో దానిని చేరాలిరా
ఏ ఆయుధంతో దానిని గెలవాలిరా //ఏయ్‌ రారో//

చరణం 2: అనాదిగా ఎవడో ఒకడు అది నాకే సొంతమంటూ
నియంతలై నిరంతరం చెరలో బంధించినారు
రెక్కలనే విరిచేసి హక్కులనే చెరిపేసి
అడిగే ప్రతి ఒక్కడిని అణిచి అణిచి అణిచి వేసినారు
నరజాతి చరిత్రలో నలిగి పోయేరా
చల్లారని స్వాతంత్య్ర కాంక్ష స్వేచ్ఛరా

నరనరాల్లోన ప్రవహించే ఆర్తిరా
కనిపించకనే నడిపించే కాంతిరా //ఏయ్‌ రారో//
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని