CERT-In: భారత్‌లో 15వేల వెబ్‌సైట్లు హ్యాక్‌..! - telugu news 15k indian websites hacked till june says ce
close
Published : 04/08/2021 23:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CERT-In: భారత్‌లో 15వేల వెబ్‌సైట్లు హ్యాక్‌..!

లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: భారత్‌లో ప్రతిఏటా వేల సంఖ్యలో వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూన్‌ నాటికే 6లక్షల సైబర్‌ సెక్యూరిటీ ఘటనలు చోటుచేసుకోగా వాటిలో 15వేల భారత వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని పేర్కొంది. దేశంలో సైబర్‌ సెక్యూరిటీ సమస్యలను పర్యవేక్షించే ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (CERT-In) ఇచ్చిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు సమర్పించింది. దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్‌ హ్యాకింగ్ ఉదంతం పార్లమెంటును కుదిపేస్తున్న సమయంలో కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది.

దేశంలో పలు కీలక రంగాలైన పవర్‌ గ్రిడ్లను చైనాకు చెందిన హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు ఈ మధ్యే వార్తలు వచ్చాయి. వీటిపై ఇప్పటికే కేంద్ర విద్యుత్‌శాఖ దర్యాప్తునకు ఆదేశించారు. ఇదే సమయంలో పలు కీలక వ్యవస్థలపైనా ఇతర దేశాల హ్యాకర్లు దాడులకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా అల్జీరియా, బ్రెజిల్‌, చైనా, కెనడా, జర్మనీ, పాకిస్థాన్‌, రష్యా, అమెరికా, సింగపూర్, ఉత్తర్‌ కొరియాతో పాటు ఇతర దేశాల కేంద్రంగా ఈ హ్యాకింగ్‌ దాడులు జరుగుతున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ లోక్‌సభలో పేర్కొన్నారు.

దేశంలో సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించి 2018లో 2లక్షలు, 2019లో 3.94లక్షలు, 2020లో 11.5లక్షలు, 2021లో 6లక్షల ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో 2018లో 17వేల వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురవ్వగా ఈ ఏడాది జూన్‌ నాటికే 15,651 వెబ్‌సైట్లు హ్యాకింగ్‌ బారినపడినట్లు CERT నివేదికను కేంద్రమంత్రి లోక్‌సభలో వెల్లడించారు. భారత సైబర్‌ స్పేస్‌పై ఇటువంటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయని.. అలాంటి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నామని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి చెప్పారు.

ఇదిలాఉంటే, గతేడాది లద్దాఖ్ సరిహద్దులో ఘర్షణలు జరుగుతున్న సమయంలో, భారత్‌ విద్యుత్ గ్రిడ్‌లపై చైనా సైబర్ దాడులకు పాల్పడిందంటూ అమెరికా సంస్థ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ సంచలన విషయాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. గత అక్టోబర్‌లో ముంబయిలో పవర్ గ్రిడ్ విఫలం వెనక చైనా హస్తం ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ఇలా చైనాతో పాటు ఇతర దేశాలకు చెందిన హ్యాకర్లు భారత వెబ్‌సైట్లపై దాడికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని