Bigg boss 5: నామినేట్‌ అయింది వీళ్లే.. సన్నీ వేట.. దమ్ముంటే ముందు మాట్లాడు! - telugu news bigg boss telugu 5 seventh week nominations
close
Updated : 19/10/2021 06:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg boss 5: నామినేట్‌ అయింది వీళ్లే.. సన్నీ వేట.. దమ్ముంటే ముందు మాట్లాడు!

Bigg boss telugu 5: ఏడో వారానికి సంబంధించి ఎవరెవరు నామినేషన్స్‌లో ఉంటారా? అని సోమవారం బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ను ఆసక్తిగా వీక్షించారు ప్రేక్షకులు. నామినేషన్స్‌ కంటే ముందు హౌస్‌మేట్స్‌ మధ్య గతవారం జరిగిన పరిణామాలపై చర్చ జరిగింది. శ్వేత నామినేష‌న్స్‌లో లేకపోయుంటే తాను కచ్చితంగా ఎలిమినేట్‌ అయ్యేదాన్ని అని సిరి వాపోయింది. లోబో సీక్రెట్‌ రూమ్‌లో ఉన్నాడని తెలియక, అనీ మాస్టర్‌, రవిలు అతడిపై జోకులేసుకున్నారు. ‘ఈ బతుకులు ఏంటి మాస్టర్‌. యాపిల్స్‌, కీరాదోసలు దాచుకోవాల్సి వస్తోంది’ అని రవి అనగా, లోబో ఉంటే తన యాపిల్స్‌ కూడా తినేసి, మన దగ్గర ఉన్నవి అడుగుతుండేవాడని చెప్పుకొంటూ నవ్వుకున్నారు. లోబో మనసులో ఏదీ పెట్టుకోడని రవి చెప్పుకొచ్చాడు. కాజల్‌, రవి ఇద్దరూ హౌస్‌మేట్స్‌ను ప్రభావితం చేస్తారని మోజ్ రూమ్‌లో ఉన్న షణ్ముఖ్‌ జెస్సీ, సిరిలు మాట్లాడుకున్నారు.

ఇది నామినేషన్ ప్రక్రియ..

ఈసారి నామినేషన్స్‌ ప్రక్రియను కాస్త విభిన్నంగా డిజైన్‌ చేశారు. హౌస్‌మేట్స్‌లో సన్నీ, జస్వంత్‌, శ్రీరామ్‌లు వేటగాళ్లుగా ఉంటారు. బయట సేవ్ ట్రీకి మిగిలిన ఇంటి సభ్యుల ముఖాలు అతికించి ఉన్న కోతుల బొమ్మల్ని వేలాడదీశారు. గన్‌ సౌండ్‌ వినిపించినప్పుడల్లా వేటగాళ్లు ముగ్గురూ తమకు కేటాయించిన డేరాలో నుంచి బయటకు వచ్చి కోతుల్ని చంపి నామినేట్ చేయాల్సి ఉంటుంది. కోతుల లక్ష్యం వేటగాళ్లని ఒప్పించి వారిని చంపకుండా కాపాడుకోవడం. ఇతరుల్ని నామినేట్ చేసేట్టు చేయడం. ముగ్గురు వేటగాళ్లలో ఎక్కువ సార్లు డేరా నుంచి బయటకు వచ్చి.. ఎక్కువ కోతుల్ని వేటాడి నామినేట్ చేసిన వేటగాడు సేవ్ అవుతాడు. మిగిలిన ఇద్దరూ నామినేట్ అవుతారు. అలాగే జంగిల్ సౌండ్ వచ్చిన ప్రతిసారి.. లివింగ్‌ ఏరియాలో టేబుల్‌పై పెట్టిన రెండు అరటి పండ్లను హౌస్‌మేట్స్‌ పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అరటి పండ్లను పట్టుకున్న వాళ్లు వేటగాడితో చర్చించి.. ఒకరిని నామినేట్ అయ్యేలా ఒప్పించాలి.

అనీ మాస్టర్‌ పేరు చెప్పిన షణ్ముఖ్‌-సిరి

తొలిసారి జంగిల్‌ సౌండ్‌ వినిపించగానే, సిరి, షణ్ముఖ్‌లు చెరొక అరటి పండును దక్కించుకున్నారు. మరోవైపు గన్‌ సౌండ్‌ వినగానే డేరా నుంచి సన్నీ మొదట బయటకు వచ్చాడు. సిరి, షణ్ముఖ్‌లు గతవారం అనీ మాస్టర్‌ ప్రవర్తనను ఎత్తి చూపిస్తూ ఆమెను నామినేట్‌ చేశారు. వాళ్లు చెప్పిన కారణంతో ఏకీభవించిన సన్నీ అనీ మాస్టర్‌ను నామినేషన్‌కు ఒప్పుకొని, ఆమె ఫొటో అంటించిన కోతి బొమ్మను కట్‌ చేసి, నామినేషన్‌ బిన్‌లో వేశాడు. ఆ తర్వాత మళ్లీ జంగిల్‌ సౌండ్‌ వినపడగానే అనీ మాస్టర్‌, సిరిలు అరటి పండు దక్కించుకున్నారు. సిరి ఈ సారి మానస్‌ను నామినేట్‌ చేయగా, అనీ మాస్టర్‌.. సిరిని నామినేట్‌ చేసింది. రెండో సారి కూడా డేరా నుంచి బయటకు వచ్చిన సన్నీ అనీ మాస్టర్‌ చెప్పిన కారణంతో ఏకీభవించి, సిరిని నామినేట్‌ చేశాడు.

ప్రియ చెత్త రీజన్‌.. సన్నీ వేట షురూ..

మూడోసారి అరటి పండును సిరి, కాజల్‌ దక్కించుకున్నారు.  సిరి మళ్లీ మానస్‌ను నామినేట్ చేయగా, ప్రియను కాజల్‌ నామినేట్‌ చేసింది. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ టాస్క్‌ సందర్భంగా ప్రియ వాడిన భాష సరిగా లేదంటూ కాజల్‌ చెప్పిన కారణంతో ఏకీభవించిన సన్నీ ఆమె నామినేషన్‌ను ఒప్పుకొన్నాడు. నాలుగోసారి జంగిల్‌ సౌండ్‌ వినపడగానే అరటి పండును సిరి, ప్రియలు దక్కించుకున్నారు. అయితే, ఈసారి అరటి పండును సిరి, ప్రియాంకకు ఇచ్చింది. దీంతో ప్రియాంక కాజల్‌ను నామినేట్‌ చేసింది. ‘సోఫాపై రవి తువాలు ఆరేయడం బాగోలేదు’ అనే చెత్త రీజన్‌ చెప్పి, ప్రియ అతడిని నామినేట్‌ చేయగా, అందుకు సన్నీ ఒప్పుకొని రవిని నామినేట్‌ చేసేందుకు ముందుకు కదిలాడు. దీంతో ప్రియాంక కస్సున లేచింది ‘చెత్త రీజన్స్‌ చెబుతారా? ఫేక్‌ పీపుల్‌.. వారితో ఆడలేను. హౌస్‌లో ఉండలేను’ అంటూ ఏడుపు అందుకుంది. కొందరు ఇంటి సభ్యులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ‘ఆరు వారాల నుంచి నామినేట్‌ అవుతూనే ఉన్నా. ఆ రీజన్‌ను నువ్వు ఒప్పుకోవద్దు’ అని నామినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు  సన్నీని ఒప్పించే ప్రయత్నం చేశాడు రవి. అయినా సన్నీ వెనక్కి తగ్గలేదు.

‘శ్వేత వెళ్లిపోతూ బాధపడింది. అంతేకాకుండా నాతో గేమ్‌ ఆడాలని చెత్త రీజన్‌ చెప్పి, ప్రియ నిన్ను నామినేట్‌ చేశారు. ఇప్పుడు నా ఆట ఏంటో చూపిస్తా. నువ్వు తప్పకుండా సేవ్‌ అవుతావన్న నమ్మకం ఉంది. ఈ వారం నీకు అన్ని విధాలా సహాయం చేస్తా’ అని సన్నీ మాటిచ్చి, రవి ఫొటో ఉన్న కోతి బొమ్మను కట్‌చేసి నామినేషన్‌ బిన్‌లో వేశాడు. స‌న్నీ ఎలాంటోడో చెప్పడానికే రవిని నామినేట్‌ చేశానంటూ ప్రియ చెప్పుకొచ్చింది. చివరిగా అరటి పండును సిరి, రవి దక్కించుకున్నారు. ఈసారి కూడా సిరి తన అరటి పండును ప్రియాంకకు ఇచ్చింది. ప్రియాంక, రవిలు ఇద్దరూ కాజల్‌ను నామినేట్‌ చేయడంతో సన్నీ ఒప్పుకోక తప్పలేదు. అలా ఈ వారం అనీ మాస్టర్‌, ప్రియ, సిరి, రవి, కాజల్‌తో పాటు, డేరా నుంచి ఒక్కసారి కూడా బయటకు రాని కారణంగా వేటగాళ్లు అయిన శ్రీరామ్‌, జెస్సీలు నామినేట్‌ అయ్యారు. ఇక సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న లోబో హోస్ట్‌ ద్వారా నేరుగా నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. మరి ఈ వారం ఎవరు సేవ్‌ అవుతారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? తెలియాలంటే వేచి చూడాల్సిందే. కెప్టెన్సీ పోటీదారులకు కోడి గుడ్లను కాపాడుకునే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచి కెప్టెన్‌ అయ్యారో తెలియాలి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని