ANR: అలుపెరుగని అక్కినేని.. నేడు ఏఎన్నార్‌ జయంతి - telugu news interesting facts about anr
close
Published : 20/09/2021 09:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ANR: అలుపెరుగని అక్కినేని.. నేడు ఏఎన్నార్‌ జయంతి

పూర్తిపేరు: అక్కినేని నాగేశ్వరరావు; జన్మదినం: 20, సెప్టెంబరు 1923; ప్రదేశం: రామాపురం, కృష్ణాజిల్లా; తల్లిదండ్రులు: వెంకటరత్నం, పున్నమ్మ; ఆర్థిక స్థితి: సాధారణ రైతు కుటుంబం
భార్య: అన్నపూర్ణ; సినిమాలు: 255 (తెలుగు, తమిళం, హిందీ భాషల్లో.. సుమారు); పురస్కారాలు: పద్మ విభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ, దాదా సాహెబ్‌ ఫాల్కే

మాటలు చెప్పడం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనలో ఒక మంచి చేతల మనిషి, చిన్న రచయిత ఉన్నాడు. తప్పులని విజయాలకు మెట్లుగా చేసుకున్న మనిషి అయన. అదృష్టాన్ని ఎన్నడూ నమ్మలేదు పడిన శ్రమనే విశ్వసించిన వ్యక్తి. జీవితాన్ని తనదైన కోణంలో చూసినా ఆ కోణం అందరికి దిక్సూచే అయ్యింది. శ్రమయేవ జయతే అన్నదే అయన నినాదం అయ్యింది. ఒక చిన్న చీమ పడే శ్రమ ఆయనకి జీవితపు స్ఫూర్తి అయ్యింది. అయన ఎవరో కాదు నేడు జయంతి వేడుకను చేసుకుంటున్న అక్కినేని నాగేశ్వరావు... తెలుగు వారు ముద్దుగా పిలుచుకొనే ఏఎన్నార్‌.

మద్రాసు మహానగరంలో సినిమాల కోసం ప్రయత్నించే రోజు నుంచి అయన తన చుట్టూ జరిగే ప్రతి చిన్న విషయం నుంచీ ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. అది చీమ కావచ్చు లేక తన మీద బురద నీరు చల్లి ఫొటో షూట్‌కి వెళుతున్నప్పుడు సమయాన్ని పాడు చేసిన కారు కావచ్చు. ఇటువంటి ఉదాహరణలు అయన జీవితంలో చాలానే ఉండటం మూలాన కావచ్చు అ..ఆ లు అక్కినేని ఆలోచనలు అనే మంచి పుస్తకాన్ని రాయగలిగారు. తన జీవితం నుంచి నేర్చుకున్న కొన్ని జీవిత అనుభవాలను 1993లో అక్కినేని తన ఆప్త మిత్రుడు పేకేటి శివరాంతో పంచుకున్న కొన్ని అరుదైన విశేషాలివి... వాటిని అక్కినేని మాటల్లోనే ఇక్కడ చదవండి.

‘‘ఒక రోజు నేను మైలాపూర్‌ అద్దె రూమ్‌లో కూర్చుని ఉండగా నా దృష్టి కిటికీ తలుపు పక్క నుంచి ఒక బిస్కెట్‌ ముక్కను భారంగా మోసుకెళుతున్న చిన్న చీమ మీద పడింది. నా కళ్లకి దాని ప్రయత్నం గొప్పగా కనిపించింది. ఇంతలో గాలి వీచి ఆ చీమతో పాటుగా బిస్కెట్‌ ముక్క మట్టిలో పడిపోయింది. ఆ చీమ తన పట్టు వదలలేదు. మళ్లీ పాక్కుంటూ వచ్చి మరో బిస్కెట్‌ ముక్కను చేత పట్టుకుని వెళుతోంది. దాని ప్రయత్నం రాబోయే రోజుల కోసం ఇప్పట్నుంచే పొదుపు అన్నా అయ్యి ఉండాలి లేక తనపైన ఆధారపడిన వారి కోసమైనా అయ్యి ఉండాలి అనిపించిది నాకు. ఈ చీమలకి ఆశ ఎక్కువా? లేక వాటి పనే అదా? అనిపించింది. మరుక్షణమే ఒక్కో చీమా కష్ట్టపడితే కానీ పుట్టలోని లక్షల చీమలు బతకలేవు మరి అనుకున్నాను. నాకు చీమల్లో ముందు దురాశ కనిపించింది, కానీ వెంటనే వాటిలో సహజమైన భవిష్యత్తుపై ఆశ కనిపించింది. ఈ రెంటిండిలో ఏది నిజం? ఏది అబద్ధం? అనే మీమాంస లో పడ్డా. ఆ చీమ నుంచి గొప్ప జీవిత సత్యం తెలుసుకున్నా. అదే నా చిత్ర, జీవిత విజయాలకు పరోక్ష సోపానమైంది.

‘‘నేను నాటకాలు వేస్తున్న తొలి రోజుల్లో, మా పొరుగున ఉండే ఓ కుర్రవాడు సంగీత సాధన చేసే వాడు. ఎలా అంటే చలికాలంలో నాలుగింటికి లేచి మరీ సాధన చేస్తూ చుట్టు పక్కల వాళ్ల నిద్రను చెడగొట్టేవాడు. అతని గోల తప్పించుకోవాలని యోచించారు స్థానికులు. చెరువులో మొల లోతు నీటిలో కూర్చుని సాధన చేస్తే సంగీతం బాగా వస్తుందని చెప్పారతనికి. అతను దానిని తు.చ తప్పక ఆచరించాడు. ఇంట్లో సాధన చేసే సమయంలో పక్క వారికి అంతరాయం ఉండకూడదని ఒక గాత్ర స్థాయిలోనే పాడేవాడు. ఎప్పుడైతే చెరువు నీటి మధ్యకి చేరాడో వాడికా భయం లేకపోయింది. పూర్తి స్థాయిలో గాత్రాన్ని తెరచి సాధన మొదలుపెట్టాడు. దీంతో ఊరు మొత్తం వాడి సాధనకి ఉదయం నాలుగింటికే మేలుకొని వారి, వారి పనులు చేసుకోవడంలో సాయపడింది. ఏతా-వాతా ఈ సంఘటన గురుంచి నాకు తోచింది ఏమంటే... ఒకరు ఆశ పడినా-దురాశ పడినా వాడు కలిగించే అలజడి అనండి లేక అంతరాయం అనండి, చెరువులో నిశ్చలంగా ఉన్న నీటిలో కలిగిన అలజడి లాగానే తోటి వాళ్ళ జీవితాలలో అలజడి కలిగిస్తుందని... సదరు అలజడి వలన జీవితం వొక చోట ఆగిపోదూ అని. ఇలా ప్రతి పనిలోనూ దాగిన ప్రయోజనాన్ని మాత్రమే చూశాను నేను.’’

‘‘అనుభవం మీద నేను నేర్చుకున్నది ఏమంటే నాకు ఎదురైన ప్రతి కీడూ కూడా మేలుగా పరిణమించిందని. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా తరచు ప్రయత్నించే చీమలా అపజయాన్ని అంగీకరించకూడదనేదే నా మతం. సదరు అపజయాన్ని సవాలు చేస్తూ మనిషి తిరిగి.. తిరిగి ప్రయత్నం చేయాలి.’’.... అలా చేశారు కాబట్టే... ఆయన అంత ఎత్తుకు ఎదిగారు... చివరి క్షణాల వరకూ పనిచేస్తూ గడిపారు. పనే దైవమని... పనే జీవితమని... చాటారు.

*‘పెళ్ళినాటి ప్రమాణాలు’, ‘పెళ్లి సందడి’, ‘కృష్ణ మాయ’ అక్కినేని అభిమాన సినిమాలు. అయితే ఈ మూడు చిత్రాలే ఆయన్ని నటుడిగా పలు విమర్శల పాలు చేశాయి. ఈ విమర్శలే ఆయనలోని నటుడిని రెచ్చగొట్టి విజయ పథానికి నడిపించాయి.

*ఏఎన్నార్‌... చెన్నై తేనాంపేటలో అద్దె గదిలో ఉండేవారు. ఒక రోజు ఇస్త్రీ చేసిన లాల్చీ-పైజామా ను ధరించి వేషం అడగడం కోసం ఫిల్మ్‌ కంపెనీకి సైకిల్‌ మీద బయలుదేరాడు. ఆయన్ని క్రాస్‌ చేసిన కారు వేగం వల్ల బురద నీరు చిమ్మి ఏఎన్నార్‌ దుస్తులు పాడయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని అక్కినేని ఎప్పుడూ కారుని వేగంగా   నడపేవారు కాదు... నడపనిచ్చే వారు కాదు. - జయదేవ్‌.చల్లా, చెన్నైమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని