Cinema News: పాత్రే అస్త్రం..పరిధి విస్తృతం.. పాన్‌ ఇండియా స్థాయిలో కొత్త కలయికలు - telugu news new combinations in upcoming movies
close
Published : 05/08/2021 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: పాత్రే అస్త్రం..పరిధి విస్తృతం.. పాన్‌ ఇండియా స్థాయిలో కొత్త కలయికలు

అమితాబ్‌-రణ్‌బీర్‌-నాగార్జున, ఆమిర్‌ఖాన్‌-నాగచైతన్య, అక్షయ్‌ కుమార్‌-సత్యదేవ్‌.. ఇలాంటి కలయికలు గతంలో సినీప్రియులకు ఊహకీ వచ్చేవి కాదేమో. పాన్‌ ఇండియా సినిమాల రూపకల్పన వల్ల ఇలాంటి అపురూప కలయికల్ని ఇప్పుడు తెరపై చూసుకునే అవకాశం దొరుకుతోంది. వాస్తవానికి మొదటి నుంచీ తెలుగు హీరోలు  పరభాషా చిత్రాల్లో మెరవడం చాలా తక్కువే. గతంలో చిరంజీవి, నాగార్జున వంటి వారు ఇతర భాషల్లో అతిథి పాత్రల్లో తళ్కున మెరిసినా.. కీలక పాత్రధారిగా మరో హీరోతో తెర పంచుకున్న సందర్భాలు తక్కువే. ఓ భాషలో స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకుని.. మరో భాషలో సహ నటుడిగా కనిపిస్తే ఇమేజ్‌ ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయాలు వెంటాడేవి. అందుకే ఆ తరహా ప్రయత్నాలు చేసేవారు కాదు.  పాన్‌ ఇండియా సంస్కృతి ఆ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. ప్రతి కథానాయకుడు విభిన్న పాత్రలతో అలరిస్తూ.. తన మార్కెట్‌ పరిధిని విస్తృతపరచుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తమ ప్రతిభను అన్ని చిత్రసీమలకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

తండ్రీకొడుకులు...

తెలుగులో వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు   నాగార్జున. దక్షిణాదిలో అగ్ర హీరోగా వెలుగొందుతున్న ఆయన.. ఇప్పుడు హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. ఇతిహాసాల నేపథ్యంతో అల్లుకున్న ఓ సైన్స్‌ఫిక్షన్‌ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో నాగ్‌ ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్‌సత్తార్‌ దర్శకత్వంలో తెరకెకుతున్న చిత్రం చేస్తున్నారు. బుధవారం నుంచి దీని షూటింగ్‌ ప్రారంభమైంది. ఆమిర్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘లాల్‌సింగ్‌ చద్దా’ సినిమాతో బాలీవుడ్‌లో తొలి అడుగు వేసేందుకు సిద్ధమయ్యారు హీరో నాగచైతన్య. ఆమిర్‌ స్నేహితుడిగా బాలా అనే ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇటీవలే లద్దాఖ్‌లో ఓ మేజర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ వారంలో శ్రీనగర్, కశ్మీర్‌ ప్రాంతాల్లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించనున్నారు. ఈ ఏడాది క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది.

అక్షయ్‌తో సత్యదేవ్‌.. దుల్కర్‌తో సుమంత్‌

‘బ్లఫ్‌మాస్టర్‌’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి వైవిధ్యభరిత చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు సత్యదేవ్‌. ఇటీవలే ‘తిమ్మరుసు’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆయన.. తెలుగులో హీరోగా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడాయన హిందీలో అక్షయ్‌ కుమార్‌ ‘రామ్‌సేతు’లో ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. అభిషేక్‌ శర్మ తెరకెక్కిస్తున్న చిత్రమిది. లైకా  ప్రొడక్షన్స్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ మొదలైంది. త్వరలోనే సత్యదేవ్‌ ఈ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. తెలుగులో కథానాయకుడిగా వరుస సినిమాలు చేస్తున్నారు సుమంత్‌ అక్కినేని. ఇప్పుడాయన దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న త్రిభాషా చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు సమాచారం. దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్నారు. కథలో ఎంతో ప్రాధాన్యమున్న ఓ పాత్రని సుమంత్‌ పోషిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక సెట్‌ని సిద్ధం చేశారు. ఇప్పుడా సెట్‌లోనే కీలక సన్నివేశాలు తెర కెక్కించనున్నారు.

అజిత్‌ కోసం  ప్రతినాయకుడిగా..

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో తొలి అడుగులోనే సినీ దృష్టిని ఆకర్షించాడు హీరో కార్తికేయ. ఓవైపు కథానాయకుడిగా అలరిస్తూనే.. నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాలో   విలన్‌గానూ మెప్పించాడు. ఇప్పుడు అజిత్‌ హీరోగా నటిస్తున్న ‘వాలిమై’తో తమిళ ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. హెచ్‌.వినోద్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందింది. ఇందులో అజిత్‌ సీబీసీఐడీ అధికారిగా దర్శనమివ్వనున్నారు. ఆయనతో తలపడే ప్రతినాయకుడిగా కార్తికేయ నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని