అందుకే ఆంధ్రాలో తొలి ఆక్సిజన్‌ ప్లాంట్‌: సోనూసూద్‌ - that written in my hand says sonusood
close
Updated : 17/06/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే ఆంధ్రాలో తొలి ఆక్సిజన్‌ ప్లాంట్‌: సోనూసూద్‌

 రాజకీయాల్లోకి వచ్చేందుకు మానసికంగా సిద్ధంగా లేను

తమ తల్లిదండ్రులకు ఎవరూ సాయం చేయలేదని పిల్లలకు అనిపించకూడదు

ఇంటర్నెట్‌డెస్క్‌: సోనూభాయ్‌.. దేశంలో ఇప్పుడు ఎవరికి ఏ కష్టమొచ్చినా తలచుకుంటున్న తొలి పేరు. పిలిస్తే పలుకుతా అంటూ.. ఎవరు ఎప్పుడు సాయం కోరినా.. తనకు తోచినంత తోడ్పాటు అందిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. తెరపై ప్రతినాయకుడి పాత్రలు పోషించిన ఆయన ఈ కరోనా కష్టకాలంలో సూపర్‌ హీరో అయ్యారు. వలస కార్మికులను సొంతగూటికి చేర్చడంతో పాటు ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపడం వరకూ ఆయన చేయని పని లేదు. సామాజిక మాధ్యమాల్లో ఆయన పేరు మార్మోగిపోతోంది. అసలు ఇంత సేవ చేయడం వెనుక స్ఫూర్తి ఏంటి..? సాయం అడిగితే చాలు సోనూసూద్‌ ఎందుకు అంతలా స్పందిస్తున్నారు.? సేవాగుణాన్ని రాజకీయం చేయడంపై ఆయన అభిప్రాయం ఏంటి..? ఇవన్నీ  ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు సోనూసూద్‌. ప్రత్యేక ముఖాముఖిలో ఇంకెన్నో ఆసక్తికర విశేషాలు చెప్పారు.

ఈటీవీ భారత్‌: మీరు ప్రధాని కావాలని కొందరు కోరుకుంటున్నారు..? కొందరు దేవుడంటున్నారు, మరికొందరు సూపర్‌ మ్యాన్‌ అని పిలుస్తున్నారు. ఇవన్నీ మీ దృష్టికి వచ్చినప్పుడు మీకెలా అనిపిస్తుంది.?

సోనూసూద్‌: నేను ఓ మామూలు మనిషినే. సామాన్యులతో కలిసి బతికినప్పుడే జీవితంలో వాస్తవాలు తెలిసివస్తాయని నాకు అనిపిస్తుంది. అవసరంలో ఉన్నవారికి, మన అవసరం ఉన్నవారికి సాయం చేయడం కన్నా పెద్ద పదవి లేదనిపిస్తుంది.

ఈటీవీ భారత్‌: మీరు చేస్తున్న పనులన్నీ ప్రభుత్వాలు, అధికారుల బాధ్యత కదా! ప్రజల నమ్మకాన్ని చిత్తశుద్ధితో పనిచేసి నిలబెట్టుకున్నారు. మీరు సంపాదించుకున్న ఈ విశ్వాసం వెనుక ఉన్న ప్రణాళిక ఏంటి..? బృందం ఎలాంటిది..? అసలు దేశ ప్రజలకు ఇలా సాయం చేయాలని ఎందుకు అనిపించింది..?

సోనూసూద్‌:  సహాయం చేయాల్సిన అవసరం ఎప్పుడూ ఉంది. కాలం మారుతూ వచ్చింది. కరోనా కాలంలో ప్రజలకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. రోడ్లపై తిరుగుతూ వలస కూలీల కష్టాలను చూసినప్పుడు సాయం చేయాల్సిందేనని అనిపించింది. తమ తల్లిదండ్రులకు ఎవరూ సాయం చేయలేదని వారి పిల్లలకు అనిపించకూడదు. ఎదిగే సమయంలో ఆ భావన వాళ్లను ఇబ్బందులకు గురిచేస్తుంది. సాయం చేసే ఆ చేయి నాదే ఎందుకు కాకూడదు అనిపించింది. అందుకే ఈ చిన్న ప్రయత్నం. జమ్ము-కశ్మీర్‌ మొదలుకొని, కన్యాకుమారి వరకు మేం రైళ్లు, బస్సులు, విమానాలు పంపని రాష్ట్రం లేదు. 10లక్షల మందికిపైగా సహాయం చేశాం. ఇళ్లకు చేర్చడంతోనే పని పూర్తయిందనుకోలేదు. కొందరికి ఉద్యోగాలు ఇప్పించాం. చదువుకునేందుకు ఏర్పాట్లు చేశాం. వైద్యం చేయించాం. ఒకరితో మరొకరం చేతులు కలుపుకొంటూ ముందుకుసాగాం. ‘పిడికిలి తెరిచి చూడు, నీ చేతిగీతల్లో ఎవరో ఒకరి ప్రాణం కాపాడుతావని రాసుంటుందేమో’ అని మా అమ్మ చెప్పే మాట నాకు ఎప్పుడూ గుర్తొస్తుంది. నేను నా పిడికిలి తెరిచి చూశా.. వీళ్ల ప్రాణాలు కాపాడాలని రాసి ఉంది. అదే నేను చేస్తున్నా.

ఈటీవీ భారత్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ కార్యక్రమాలకు ముందుకొచ్చాయి. కానీ, ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాయి. మీరైతే నిరంతరాయంగా చేస్తూనే ఉన్నారు. నిధులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయి..?ప్రభుత్వాలు చేయలేని పనులు సోనూసూద్‌ ఎలా చేశాడన్న ప్రశ్న అందరి మదిలోనూ ఉంది.

సోనూసూద్‌: నా మార్గాన్ని నేనే నిర్మించుకున్నా. మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో చేయాల్సిన పనులు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వేలెత్తి చూపేవాళ్లమని ప్రజలు చెప్తున్నారు. అది సరైనదే. ప్రభుత్వాలని ప్రశ్నించడం, ఫిర్యాదులు చేయడం వాళ్ల హక్కు. కానీ, ఫిర్యాదులు చేయడం కంటే పని చేయడం ఉత్తమమని నేను నిర్ణయించుకున్నా. నాకంటే పెద్దవాళ్లు, గొప్ప అవకాశాలున్నవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ, చేయాలన్న మనసుంటే పనులు చేయవచ్చు. నేను ప్రజలతో కలిసి దేశానికి సహాయం చేసేందుకు వెళుతున్నానని చెప్తూ ఉంటా. నేను హద్దులు గీసుకోలేదు. కాలేయం, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు, ఉన్నత చదువులు, రోడ్లు కావాలని, పెళ్లి జరిపించాలని అభ్యర్థిస్తారు. వాళ్లందరికి ఎలా సమాధానాలు చెప్పాలన్నది నేను ఏ పుస్తకాల్లోనూ చదవలేదు. కదిలే నావపై కూర్చొని ఈ సముద్రంలోకి దిగాను. గమ్యం చాలా దూరంలో ఉంది. ప్రయాణం సాగుతూనే ఉంది.

ఈటీవీ భారత్‌: ప్రయాణం సాగుతోంది సరే. మీరీ సేవా కార్యక్రమాలన్నీ ఎన్నికల్లో పాల్గొనేందుకే చేస్తున్నారని కొందరు అంటున్నారు. ఆ ఉద్దేశం లేకపోయినా ఇన్ని పనులు చేస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొని, నేత అయితే, ఈ పనులన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. ఆ మజా ఎలా ఉంటుందంటారు.?

సోనూసూద్‌: సహాయం చేస్తే వచ్చే ఆత్మసంతృప్తి వేరు. ఇంట్లోనో, ఏసీ గదిలోనో కూర్చొని మాటలు మాట్లాడితే పనులు జరగవు. రోడ్డు మీదకి రావాల్సిందే. కరోనా కాలంలో నేను అదే చేశా. ఇప్పటికీ ప్రతి రోజూ నేను రోడ్డెక్కుతున్నా. రాజకీయం ఓ అద్భుతమైన రంగం. ప్రజల్లో ఓ భావన పాతుకుపోయింది. మంచి పనులు చేస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకే చేస్తున్నారని అనుకుంటారు. రాజకీయాల్లోకి రావాలని, దేశాన్ని మార్చాలనీ చాలామంది అనుకుంటారు. కానీ, చాలామంది రాలేకపోతారు. కొందరు మార్చాలని కూడా అనుకోరు. నాకు రాజకీయాలతో ఎలాంటి విభేదం లేదు. ఓ నటుడిగా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. రాజకీయాల్లో చాలా నిబంధనలు ఉంటాయి. ఫలానా దారిలోనే వెళ్లాలి. ఫలానా గమ్యానికే చేరుకోవాలని ఉంటుంది. నా రహదారి నేనే నిర్మించుకుంటా. బైపాస్‌లో వెళ్తా, కచ్చా రోడ్డు కూడా ఎక్కుతా, ప్రోటోకాల్స్‌ పాటించను. ప్రజలకు మందులు, ఆక్సిజన్‌ సరఫరా చేయడం నా పని కాదు. అయినా చేస్తున్నా. ఇంజెక్షన్లు ఇప్పించా. చదువులు చెప్పించా. వైద్యం చేయించా. ఈ పనుల్లో ప్రోటోకాల్స్‌ ఏమీ పాటించలేదు. ఏదైనా రాజకీయ పార్టీ సభ్యుడిగా ఉంటే నియమాలు పాటించాల్సి వస్తుంది. వీటన్నింటితో సంబంధం లేని ఓ స్వతంత్ర వ్యక్తిగా నేను ఈ పనులు చేయగలుగుతున్నా. ఇదే నాకు అతిపెద్ద విజయం.

ఈటీవీ భారత్‌: రాజకీయాలపై మీకు ఆసక్తి లేదు. వివిధ పార్టీలకు ప్రోటోకాల్స్‌ ఉంటాయి. వాటిలో చిక్కుకుపోవడం మీకు ఇష్టం లేదు. కానీ.. అవకాశం దొరికితే రాజకీయాల్లోకి వస్తారా..?

సోనూసూద్‌: నాకు రాజకీయాలంటే ద్వేషమేమీ లేదు. కాకపోతే నేను మానసికంగా సిద్ధంగా లేను. నటుడిగా చేయాల్సింది ఇంకా చాలా ఉంది. రాజకీయాల్లోకి వెళ్తే చేయగలిగేది నేను ఇప్పటికే చేస్తున్నా. ఓ నటుడిగా, ఓ సహాయం చేసే వ్యక్తిగా రెండురకాలుగా సంతోషంగా ఉన్నా. నా కోసం సెట్స్‌కి వేల సంఖ్యలో జనం వస్తుంటారు. స్పాట్‌ బాయ్స్‌, లైట్‌మెన్‌, డైరెక్టర్లు, ఆర్ట్‌ డైరెక్టర్లు.. ఇలా వచ్చిన వారికి సాయం చేస్తా. నటుడిగానూ సంతోషంగా ఉన్నా. మనసుకి నిజంగా అనిపించిన రోజు సిద్ధంగా ఉన్నానని నేనే గట్టిగా చెప్తా.

ఈటీవీ భారత్‌: సిద్ధంగా లేకపోవడం తప్ప, రాజకీయాలపై ద్వేషం లేదని మీరు చెప్తున్నారు. కానీ రాజకీయ పార్టీలకు మీరు చేస్తున్న పనులపై కన్ను కుట్టే ఉంటుంది. అలాంటి వార్తలు వచ్చాయి. నేతల బెదిరింపులూ వచ్చాయి. ఏదో ఒక పార్టీకి మద్దతు తెలిపేందుకే మీరు కరోనా కాలంలో పనులన్నీ చేస్తున్నారన్న వినికిడి ఉంది. పార్టీల నుంచి మీకూ ఆహ్వానాలు అందాయి. సమాజం మిమ్మల్ని ఓ సూపర్‌ హీరోగా భావిస్తోంది. మరోవైపు ఎవరికోసమో ఇదంతా ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారన్న అభిప్రాయాలూ వెల్లడయ్యాయి. వీటన్నింటినీ మీరు ఎలా చూస్తున్నారు..?

సోనూసూద్‌: కరోనా ఫస్ట్‌వేవ్‌ మొదలైనప్పుడు రాత్రికి రాత్రే ఎక్కడి నుంచి వచ్చాడని కామెంట్లు వచ్చాయి. అవి మెల్లగా చతికిలబడ్డాయి. ఓ వారమో, నెలరోజులో చేసి సరిపెట్టుకొనే రకం కాదని వారికి అర్థమైంది. 15నుంచి16 నెలలు గడుస్తోంది. ఫస్ట్‌వేవ్‌ ముగిసిన తర్వాత నా పని కొనసాగుతూ వచ్చింది. ఇంకా పెరిగింది. కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత మరింత విస్తరించింది. ప్రస్తుతం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. నేను ఆగిపోయే రకం కాదు. ఫస్ట్‌వేవ్‌, సెకండ్‌వేవ్‌, థర్డ్‌వేవ్‌లతో నాకు సంబంధం లేదు. నాకో లక్ష్యం ఉంది. నేనో దారిని ఎంచుకున్నా.. ప్రజలు ఏం అనుకున్నా, ఆ దారిలో నేను వెళుతూనే ఉంటా.

ఈటీవీ భారత్‌: మీరు ఇంత ఫిట్‌గా ఉంటారు. బాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ఐకాన్‌లలో మీరూ ఒకరు. అలాంటి మీకు కూడా కరోనా సోకింది. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి, కరోనా బారిన పడటానికి సంబంధం లేదని అర్థమైంది. ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారు.

సోనూసూద్‌: కరోనా బారిన పడ్డ తర్వాత 5 రోజుల్లోనే నెగెటివ్‌ వచ్చింది. అది ఫిట్‌నెస్‌ వల్లనో, అప్పటికే ఒక డోస్‌ టీకా తీసుకోవడం వల్లనో తెలియదు. కరోనాను ఎదుర్కోవాలన్న సంకల్పం నాలో ఉంది. కరోనా వచ్చినా నా పని ఆగలేదు. గదిలోనే ఐసోలేట్‌ అయి ఎక్కువ మందికి ఫోన్లు చేశాను. 24గంటలూ పనిచేశా. బోలెడు సమయముండేది. టీకా వేసుకోవడం అత్యవసరం. నేను అందుకే తొందరగా కోలుకోగలిగా. ఫిట్‌నెస్‌ స్థాయి కూడా బాగా ఉండాలని అర్థమైంది. లక్షలాది మంది కరోనా రోగులను కలిశాను. ప్రతి రాష్ట్రంలోనూ ఆసుపత్రులకు పంపడం నుంచి మందులు, ఇంజెక్షన్లు ఇప్పించడం వరకూ ప్రతి పనీ చేశాను. చాలామందికి ఆరోగ్య సమస్యలున్నాయని తెలిసింది. 24, 25 ఏళ్ల యువతీయువకులు ప్రాణాలు కోల్పోయారు. ఫిట్‌నెస్‌ మీ జీవితంలో ఓ భాగం కావాలని అప్రమత్తం చేసింది కరోనా. విపత్తుల నుంచి త్వరగా బయట పడేందుకు ఫిట్‌నెస్‌ ఉపయోగపడుతుంది. అదే నేను నేర్చుకున్న పెద్ద పాఠం. ఇదే సందేశం ఇవ్వదలచుకున్నా.

ఈటీవీ భారత్‌: మీరు సేవా కార్యక్రమాలు చేస్తుండటం ఒక ఎత్తు. మీలోని ఓ ఎంటర్‌టైనర్‌ కూడా ఈ సమయంలో బయటకు వచ్చారు. సామాజిక మాధ్యమాల్లో మీపై మీమ్స్‌ తయారు చేశారు. వాటికి మీదైన రీతిలో సమాధానమిచ్చారు. ఒకరు గర్ల్‌ఫ్రెండ్‌ వద్దకు తీసుకెళ్లమని, ఇంకొకరు మద్యం ఇప్పించమని వేడుకున్నారు. వీటన్నింటిపై మీ స్పందన ఏంటి..? మీకు బాగా నచ్చిన మీమ్‌ ఏది..?

సోనూసూద్‌: సామాజిక మాధ్యమాలు చాలా పెద్ద వేదిక. నేను చాలా ఏళ్ల నుంచి వాడుతున్నా. ప్రజలంతా వాళ్లు కొనుగోలు చేసిన కొత్తచెప్పులు, కొత్త టీషర్టులు, కొత్త కార్ల గురించి తోటివారితో పంచుకుంటారు. కానీ.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల ఇళ్లలోకి వెళ్లగలగడం నా దృష్టిలో చాలా పెద్ద విషయం. ఎక్కడెక్కడో గుడిసెల్లో ఉండే ప్రజలు కూడా తాము అభిమానించే వ్యక్తి పక్కనే ఉన్నట్లు భావించినప్పుడే..బంధం ఏర్పడుతుంది. మద్యం దుకాణానికి తీసుకెళ్లమని నన్నెవరైనా అడిగితే.. దుకాణానికి మీరే వెళ్లండి.. తాగి పడిపోతే ఇంటికి తీసుకెళ్లేందుకు నేనొస్తానని చెప్తా. సోషల్‌ మీడియాలో సమాధానాలన్నీ నేనే ఇస్తాను. అన్నీ స్వయంగా చదువుతా. అందుకోసం నాకు ప్రత్యేక బృందమేమీ లేదు. అదే జనాలతో నన్ను కలిపిందనుకుంటున్నా. దర్శకులు, నిర్మాతలు నేను బాగా రాస్తానని అంటుంటారు. మా అమ్మ లిటరేచర్‌ ప్రొఫెసర్‌. అద్భుతంగా రాస్తారు. రాయడంపై నాలో ఉన్న ఇష్టం.. నువ్వు రాస్తే బతికి ఉంటుందని నాకు చెప్తారు. ఆ కామెంట్స్‌ అన్నీ నావే. ఇలాంటి చిన్నచిన్న సంభాషణల వల్ల ఏదైనా బాధలో ఉన్నవారు ఆ కామెంట్స్‌ చూస్తే.. వారి మోముపై చిరునవ్వు వస్తుంది.

ఈటీవీ భారత్‌: మీకు ఏ బృందం లేదని చెప్తున్నారు. కానీ, సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ప్రవాహం వెల్లువెత్తుతోంది. ప్రజలకు సాయం చేయడం ప్రారంభించారు. అది క్రమంగా ఫుల్‌టైమ్‌ జాబ్‌గా మారిపోయింది. సినిమాల వల్ల వచ్చిన గుర్తింపుకంటే ఎక్కువ ఈ పనుల వల్ల వచ్చిందని మీకు అనిపించదా..?

సోనూసూద్‌: నిజమే.! ఫుల్‌టైమ్‌ అయిపోయింది. సమయం దొరకట్లేదు. సినిమా స్క్రిప్టులు చదవలేకపోతున్నా. మెడికల్‌ ఎమర్జెన్సీ కాల్స్‌ వస్తుంటాయి. 2, 3 గంటలు వాటికి దూరంగా ఉంటే ఎక్కడ ఏ ప్రాణం పోతుందో అని భయమేస్తుంది. సాధ్యమైనంత ఎక్కువ సమయం పనిచేస్తున్నా. మందులు, ఇంజెక్షన్లు కోరేవారికి సమాధానాలిచ్చేందుకు ఓ బృందం, విద్య సంబంధిత సహాయాల కోసం మరో బృందం, ఉద్యోగాలకు ఒకటి, కిడ్నీల కోసం ఒకటి, కాలేయ మార్పిడి కోసం ఒకటి ఇలా విభిన్న బృందాలను ఏర్పాటు చేసుకొన్నాం. ఫోన్లు వస్తూనే ఉంటాయి. సమస్య నుంచి ఎలా బయటపడాలని అడుగుతారు. కళాశాలలు,  ఆసుపత్రులు, వైద్యులతో నేనే స్వయంగా మాట్లాడి, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. వీటికోసం నేను శిక్షణ ఏం తీసుకోలేదు. నిత్యం నేర్చుకుంటున్నా. కత్తిసాము, గుర్రపుస్వారీ ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. నేర్చుకుంటున్నా.

ఈటీవీ భారత్‌: సినిమా పరిశ్రమలోని హుమా ఖురేషీలాంటి వాళ్లు మీరు దేశప్రధాని కావాలని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ స్పందన..? రాజకీయాల్లోకి వచ్చి, అలాంటి పెద్ద పదవుల్లోకి వెళ్లాలని సోనూసూద్‌ ఎప్పుడైనా ఆలోచిస్తారా..? పనులు చేయడం కంటే ఎక్కువగా వ్యవస్థలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది కదా..? ఆ ఇబ్బందులు ఇప్పటికే పడి ఉంటారు.

సోనూసూద్‌: రైళ్లు నడిపే సమయంలో ప్రజలను మహారాష్ట్ర, బిహార్‌కు పంపేందుకు చాలా ఇబ్బందులు పడ్డాం. అధికారుల నుంచి అనుమతులు వచ్చేవికావు. వాళ్లతో స్వయంగా మాట్లాడేవాడిని. దరఖాస్తులు రాసేవాడిని. బాధితుల సంఖ్య వేలలో ఉండేది. ఉదయం లేస్తూనే పోరాటంలా ఉండేది. ఉదయం, రాత్రి పరిగెడుతూనే ఉండేవాణ్ని. ఒకవేళ వ్యవస్థను నడిపే స్థానంలో నేనుంటే దారిని మారుస్తానేమో. కొత్తదారులు సృష్టిస్తా. దానికి నాకు అర్హత ఉందో లేదో కూడా తెలియదు. కానీ అభిరుచి బలమైంది. రాత్రి 3గంటలకు మెసేజ్‌ వచ్చినా, పొద్దున ఎంత శ్రద్ధతో పనిచేస్తానో అదే శ్రద్ధతో స్పందిస్తాను. ఆ అభిరుచి బతికి ఉండాలి.

ఈటీవీ భారత్‌: ఇదే పరిశ్రమలో మీ పనిని మెచ్చుకోకపోగా, మీకు ప్రశ్నలు విసిరేవారూ ఉన్నారు. కంగనా రనౌత్‌ మీరు అబద్ధాలు చెబుతున్నారని, అంతా మోసం అని ట్వీట్‌ చేశారు. దానికి జవాబు చెప్పాలనుకుంటున్నారా..?

సోనూసూద్‌: అది ఆమె అకౌంట్‌. లైక్‌ చేయడం, రీట్వీట్‌ చేయడం ఆమె ఇష్టం. 135కోట్ల మందితో కలిసి నడవాలనుకుంటున్నా. అన్ని కోట్ల మందిలో కొన్ని లక్షల మందికి నేను నచ్చకపోవచ్చు. నాతో కలిసి నడవడం ఇష్టం లేకపోవచ్చు. నేనైతే నడుస్తూనే ఉంటా. ఒక్కడిగా మొదలుపెట్టిన ప్రయాణంలో మంచిపని చేస్తే కలిసి వచ్చే వారి సంఖ్య పెరిగినట్లే. నచ్చక విడిపోయే వారున్నా నష్టమేమీ లేదు. వాళ్ల మాటలకు స్పందించాల్సిన అవసరం లేదు. సంతోషంగా ఉన్నారు. ఉండనిద్దాం. ఇలాంటి పనులు చేయడం వల్ల వారికి సంతోషం దొరికితే.. మరిన్ని లైక్స్‌ ఇచ్చి చేయనిద్దాం.

ఈటీవీ భారత్‌: ఐఏఎస్‌ల కోసం కొత్త ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. కరోనా తర్వాత కొత్తకొత్త ఐడియాలతో దాతృత్వం చాటాకుంటున్నారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది..?

సోనూసూద్‌: నా సహాయం కోసం రోజు ఎంతోమంది వస్తారు. వాళ్లు కార్యాలయాలు నడుపుతారు. వాళ్ల వద్ద అధికారుల బృందం ఉంటుంది. వాళ్లకో అనుభవం ఉంటుంది. వ్యవస్థలను రూపొందిస్తారు. దేశాన్ని నడుపుతారు. దేశాన్ని నడిపించడంలో ఐఏఎస్‌ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇది నా అభిప్రాయం. పేద కుటుంబం నుంచి వచ్చాననీ, ఐఏఎస్‌ కావాలనుకుంటున్నాననీ, సహాయం చేయమంటూ చాలామంది వస్తారు. చాలామందిని ఆదుకున్నాను. గతేడాది 2,400 స్కాలర్‌షిప్‌లు ఇచ్చాను. అర్హత ఉండి, అందుకునే స్థోమత లేనివారందరి కోసం ఓ వేదిక తయారు చేయాలన్నది నా లక్ష్యం. అందులోంచే ఈ ఆలోచన వచ్చింది. అర్హత ఉన్నవారికి కోరుకున్నది దక్కాల్సిందే. వేల సంఖ్యలో దరఖాస్తులు అందాయి. జల్లెడ పడతాం. వాళ్లందరిలో ఉత్సాహం వేరే స్థాయిలో ఉంది. నాకు ఈ ఆలోచన రాకపోయి ఉంటే రేపు ఐఏఎస్‌లుగా మారాల్సిన వారంతా ఆగిపోతారేమో. దేశానికి మంచి ఐఏఎస్‌ అధికారులను ఇస్తే నాకు అదే గొప్ప విజయం.

ఈటీవీ భారత్‌: కుటుంబం ఉంది. వారికి సమయం ఎలా కేటాయిస్తున్నారు..?

సోనూసూద్‌: సమయం ఇవ్వలేకపోతున్నా. ఇంట్లో ఏదో మూలన, ఓ కుర్చీలోనో, సోఫాలోనో కూర్చుంటా. తెల్లవారుతుంది. మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి గడిచి.. తిరిగి తెల్లవారుతుంది. హడావుడిగా తిరుగుతుంటే పిల్లలు చూస్తుంటారు. మధ్యలో ఒకర్నొకరు చూసి నవ్వుకుంటాం. కొన్నిసార్లు ముద్దుచేస్తా. 15నెలల క్రితం నిమిషం కూడా వాళ్లకు సమయం కేటాయించేవాణ్ని కాదు. మూడు నాలుగు రోజులైనా వాళ్లతో మాట్లాడే సమయం ఉండేది కాదు. తినేందుకు సమయం కూడా ఉండేది కాదు. సెకనుకో ఫోన్‌ వచ్చేది. తల్లి, తండ్రి, అక్క, భర్త, అన్న.. ఎవరో ఒకరు చనిపోయే స్థితిలో ఉన్నారంటూ కాల్స్‌ వచ్చేవి. వాళ్లకు సాయం చేయాలి కదా..! స్పందించేందుకు కూడా సమయం ఉండేది కాదు. ఆ పరుగు ప్రస్తుతం కాస్త నెమ్మదించింది.

ఈటీవీ భారత్‌: కుటుంబానికి, సినిమాలకు, ఈ సేవా కార్యక్రమాలకూ సమాన ప్రధాన్యమిచ్చేలా వ్యవస్థను తీర్చిదిద్దుకుంటున్నారా..?

సోనూసూద్‌: ఆర్గనైజ్‌ చేస్తున్నాం. రోజురోజుకీ మా బృందం పెరుగుతోంది. అవసరాలూ పెరుగుతున్నాయి. పొద్దున్న లేచి, ఫలానా పని చేయాలని నిద్రపోకుండా ఆలోచిస్తామని మా బృందసభ్యులు కూడా చెప్తారు. ఐఏఎస్‌ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన వెబ్‌సైట్‌.. ప్రారంభించగానే క్రాష్‌ అయిపోయింది. దేశప్రజలు నాతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు, నా సహాయం కోసం ఎదురుచూస్తున్నప్పుడు.. బృందాన్ని విస్తరించుకోవాలి. లేకపోతే చాలా సమయం పడుతుంది. బండిలో జనాలు పెరుగుతున్నారు. డబుల్‌ ఇంజిన్‌, ట్రిపుల్‌ ఇంజిన్‌ వాడాల్సి వస్తోంది. వారందరినీ గమ్యం చేర్చాలంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.

ఈటీవీ భారత్‌: మీరు సిద్ధంగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వస్తే.. ఏ రాష్ట్రం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారు..?

సోనూసూద్‌: అన్ని రాష్ట్రాలూ నావే. పంజాబ్‌లో పుట్టా. మహారాష్ట్రలో పనిచేస్తున్నా. ఆంధ్ర, తెలంగాణలో చాలా పనిచేశా. అన్నిచోట్ల నుంచి అదే అభిమానం దక్కుతోంది. ఏ రంగు, ధర్మం, జాతి, ప్రాంతం చూడలేదు. అలా అయితే ఆక్సిజన్‌ ప్లాంట్‌ ముందు నేను పంజాబ్‌లోనే పెట్టాల్సింది. కానీ నా మొట్టమొదటి ప్లాంట్‌ తెలుగు రాష్ట్రాల్లోనే రానుంది. కర్ణాటక, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌లకు విస్తరిస్తాయి. నాకు దేశమంతా ఒకటే. ప్రతి రాష్ట్రం నాదే. ప్రతి మనిషీ నావాడే. ప్రతి ధర్మం నాదే.

ఈటీవీ భారత్‌: గడిచిన 15 నెలల నుంచి సోనూసూద్‌ సేవకు మారుపేరుగా చూస్తున్నాం. అంతకుముందులా మిమ్మల్ని వెండితెరపై చూడనున్నామా..? ఏ ప్రాజెక్టుల్లో భాగస్వాములయ్యారు..?

సోనూసూద్‌: పృథ్వీరాజ్‌ చౌహాన్‌ సినిమా ఒకటి రానుంది. యశ్‌రాజ్‌ సినిమా, దక్షిణాదిలో చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ రానుంది. కొత్త ప్రాజెక్టులు చాలా వస్తున్నాయి. సినిమాలు వస్తూనే ఉంటాయి. వినోదం పంచుతూనే ఉంటా, పని చేస్తునే ఉంటా.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని