Oscars 2021: ఉత్తమ చిత్రం కథ ఇదే - the story line of nomad land
close
Updated : 26/04/2021 12:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oscars 2021: ఉత్తమ చిత్రం కథ ఇదే

హృదయాలను హత్తుకునే ‘నోమడ్‌ ల్యాండ్‌’

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ ప్రియులందరూ ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. కరోనా కారణంగా గతేడాది నుంచి ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తోన్న అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం నేడు అట్టహాసంగా జరిగింది. ప్రముఖ మహిళా దర్శకురాలు క్లోవీ చావ్‌ దర్శకత్వం వహించిన ‘నోమడ్‌ ల్యాండ్‌’ ఈ సారి మూడు ముఖ్యమైన విభాగాల్లో(ఉత్తమ చిత్రం, దర్శకత్వం, నటి) అస్కార్‌ అవార్డు అందుకుంది. ‘ది ఫాదర్‌’, ‘మ్యాంక్‌’, ‘మినారి’ చిత్రాలను దాటుకుని అకాడమీ అవార్డు గెలుచుకున్న ‘నో మ్యాడ్‌ ల్యాండ్’ కథ ఏమిటో ఓ సారి చూద్దామా..

చిత్రం: నోమడ్‌ ల్యాండ్‌; భాష: ఇంగ్లిష్‌; దర్శకత్వం: క్లోవీ చావ్‌; నటీనటులు: ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్మెండ్, లిండా మే, డేవిడ్, స్వాంకి; విడుదల: 2020; నిడివి: 108 నిమిషాలు; ఆస్కార్‌ నామినేషన్స్‌: 6(ఉత్తమ చిత్రం, దర్శకత్వం, నటి, ఆడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌), అవార్డు గెలుచుకున్నది: 3 (ఉత్తమ చిత్రం, దర్శకత్వం, నటి)

ఒకే రకం జీవితానికి, ప్రాంతానికి అలవాటు పడకుండా సంచార జీవితం గడిపేవాళ్లను నోమ్యాడ్స్‌ అంటారు. రోడ్డు ప్రయాణంలోనే జీవితాన్ని వెతుక్కొనే ఒక రకమైన జీవనశైలి ఇది. ఆర్థిక మాంద్యం దెబ్బకు అమెరికన్‌ మధ్యతరగతి జీవితాలు కుదేలయ్యాయి. ఉద్యోగాలు, సన్నిహితులను కోల్పోయిన ఎందరో ఉపాధి వేటలో కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ ఇలా సరికొత్త జీవితం ఆరంభించారు. వ్యక్తిగత స్వేచ్ఛను ఆస్వాదిస్తూ, మట్టివాసనకు, ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ తమని తాము ఆవిష్కరించుకొనే సరికొత్త జీవనశైలి ఇది. ఈ కథాంశం మీదే ఆసియన్‌ అమెరికన్‌ దర్శకురాలు క్లోవీ చావ్‌ ‘నోమడ్‌ ల్యాండ్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. 2017లో అమెరికన్‌ రచయిత్రి, పాత్రికేయురాలు జెస్సికా బ్రూడర్‌ రాసిన ‘నోమడ్‌ ల్యాండ్: సర్వైవింగ్‌ అమెరికా ఇన్‌ ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ’ అనే పుస్తకం దీనికి మూలం. ఉత్తమ నటిగా రెండు సార్లు ఆస్కార్‌ గెలిచిన ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్మెండ్‌ ప్రధానపాత్రలో నటించడంతో సినిమాకు ప్రాధాన్యత చేకూరింది. ‘ఫార్గో’, ‘బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్, మిస్సోరి’ చిత్రాల్లో నటనకు గానూ ఆమెను ఆస్కార్‌ వరించింది. క్లోయీ జావ్‌కు దర్శకురాలిగా ఇది మూడో చిత్రం. చైనాలో పుట్టి పెరిగినా అమెరికాలోనే సినిమాలు తీయడం మొదలెట్టింది. మొదటి రెండు చిత్రాలు ‘సాంగ్స్‌ దట్‌ మై బ్రదర్‌ టాట్‌ మీ’(2015), ‘ది రైడర్‌’(2017) చిత్రాలకు పలు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు, అవార్డులు దక్కాయి.

కథ: ఆర్థిక మాంద్యం దెబ్బకు ఫెర్న్‌ పనిచేసే కంపెనీ మూతపడుతుంది. తన భర్తతో కొన్నాళ్లపాటు అక్కడే కలిసి పనిచేస్తుంది. ఆయన మరణంతో 61 ఏళ్ల ఫెర్న్‌ జీవితంలో శూన్యత ఏర్పడుతుంది. సంతానం కూడా లేదు. దాంతో తనకున్న కొద్దిపాటి ఆస్తిని అమ్మేసి ఒక వ్యాన్‌ కొనుక్కుంటుంది. దాన్నే ఓ ఇల్లులా మార్చుకొని ఆమెరికా రోడ్లపై సరికొత్త జీవితాన్ని మొదలుపెడుతుంది. దానికి వ్యాన్‌ గార్డ్‌ అనే పేరు పెట్టుకుంటుంది. అందులోనే వంట, పడక గదులను ఏర్పాటు చేసుకుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే అది చక్రాల ఇల్లులాంటిది. దాన్ని నడుపుతూనే అమెరికాలోని వివిధ ప్రాంతాలకు పయనమవుతుంది. తాత్కాలికంగా ఉద్యోగాలు వెతుక్కోవడం, వ్యాన్‌ను ఎక్కడోచోట పార్క్‌ చేసి అందులోనే బస చేయడం. ఇలా రోడ్ల మీద జీవితం సాగిపోతుంటుంది. ఇలా అమె ఒకరే కాదు. ఎంతో మంది సంచార జీవితం గడిపే వాళ్లు తారస పడుతుంటారు. వెళ్లిన చోటల్లా కొత్త స్నేహాలు, అనుబంధాలు పెంచుకొని చివరకు మళ్లీ కలుద్దాం అని వీడ్కోలు చెప్పి మరో చోటికి వెళ్లిపోతుంటుంది. ఈ ప్రయాణంలో గతంలో ఎదురుపడిన స్నేహితులు కనిపిస్తే ఉల్లాసంగా గడపడం, సాయం అందించుకోవడం ఇలా ఆహ్లాదంగా సాగిపోతూనే ఉంటుంది. అయితే ఈ ప్రయాణం అంత సులువైందేమీ కాదు. రోజువారి పోరాటం చేయక తప్పదు. ఉద్యోగం వెతుక్కోవడం, ప్రకృతి ఆటంకాలను దాటుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. అన్నింటికి మించి ఏకాంతాన్ని జయించాలి. ఈ అవాంతరాలు అన్ని దాటుకొని ఫెర్న్‌ ఎలా జీవితాన్ని సాగించింది. ఆటంకాలను ఎలా ఎదుర్కొందనేది మిగతా కథ.

తిరిగి కలుస్తామనే ఆశ: ఫెర్న్‌ బయటకు నవ్వుతున్నట్లుగానే కనిపించినా, తన లోపల గూడుకట్టుకున్న శూన్యత కళ్లలో తెలుస్తూనే ఉంటుంది. మనం దేన్నైతే గుర్తుపెట్టుకుంటామో అదే జీవితమనే మాటల్ని గుర్తుచేసుకుంటుంది. తన జీవితం ఎక్కువగా ఆ జ్ఞాపకాలతోనే నిండిపోయింది. అందుకే మధ్యలో డేవిడ్‌ అనే వ్యక్తి శాశ్వతంగా ఇంట్లో ఉండిపొమ్మని ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించి తిరిగి రోడ్డు జీవితాన్ని యథావిధిగా కొనసాగిస్తుంది. నోమ్యాడ్‌ జీవనశైలిలో శాశ్వత వీడ్కోలంటూ ఉండదు. తిరిగి కలుస్తామన్న ఆశతోనే ముందుకు కదులుతారు. ఇందులో కొన్ని పాత్రలు హృదయాన్ని ద్రవింపచేస్తాయి. తన ఏకైక కుమారుడిని కోల్పోయిన బాబ్, క్యాన్సర్‌తో బాధపడే స్వాంకీ పాత్రల జీవితాల్లో ఉండే ఆర్ద్రత కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని