close
అవీ.. ఇవీ..
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆయనకెంతో రుణపడి ఉన్నా..: త్రివిక్రమ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. రచయితగా మాటలతో మాయచేస్తారు.. దర్శకుడిగా సినిమాలతో మైమరిపిస్తారు. కేవలం హీరోలను చూసే థియేటర్లకు వెళ్లే రోజుల్లో డైరెక్టర్లను చూసి కూడా సినిమాలకు వెళ్లొచ్చన్న ఆలోచన పుట్టించారు. ‘స్వయంవరంతో’ మొదలై ‘అలవైకుంఠపురములో’ వరకూ సాగిన.. సాగుతున్న ఆయన ప్రయాణంలో హిట్టు సినిమాల గురించి చెప్పాలంటే చాలా సినిమాలు క్యూలో నిల్చుంటాయి. అయితే.. ఎంత ఎదిగినా మూలాలను మరిచిపోవద్దనే సూక్తిని నమ్ముతారాయన. అందుకే.. తన కెరీర్‌ ప్రారంభంలో ఆయనకు అండగా నిలిచిన నిర్మాత స్రవంతి రవికిషోర్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ‘రెడ్‌’ ప్రీరిలీజ్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికిషోర్‌తో తన సినిమా ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన పాదాలకు నమస్కారం చేసి కృతజ్ఞత చాటారు. ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..

‘‘స్వయంవరం’ తర్వాత ఎందుకో నాకు ఎవరూ సినిమాలు ఇవ్వట్లేదు. అందుకే.. నేను భీమవరం వెళ్లి క్రికెట్‌ ఆడుకుంటుంటే ఫోన్‌ చేసి అక్కడి నుంచి పిలిపించి ‘నువ్వేకావాలి’ రాయించారు స్రవంతి రవికిషోర్‌. ఆ విషయంలో ఆయనకు చాలా రుణపడి ఉన్నాను. ‘నువ్వు నాకు నచ్చావ్‌’ సమయంలో నేను రాసిన ఫైల్‌ను ఆయన దగ్గర పెట్టుకొని రాత్రి 12 గంటలకు నాకు ఫోన్‌ చేసి చదివి వినిపించారు. అప్పుడు నాకు ఎలా ఉందంటే.. కాళిదాసు ఒకమాట చెప్తాడు.. ‘అరసికేశు కవిత్వనివేదనం మా లిఖా.. మా లిఖా.. మా లిఖా..’ అంటూ మూడుసార్లు చెప్తాడు. అంటే ‘రసికుడు కానివాడికి కవిత్వం చెప్పే ఖర్మ నా నుదిటి మీద రాయొద్దు రాయొద్దు రాయొద్దు’ అని అర్థం. కానీ.. ఇంత రసికుడికి నాలుగు సినిమాలు రాసే అదృష్టం దక్కింది నాకు. ఆ అదృష్టాన్ని నాకు ఇచ్చిన భగవంతుడికి, అంతటి అనుభవించే సామర్థ్యం, జీవితం ఉన్న రవికిషోర్‌గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఆయన ఒక కో-డైరెక్టర్‌లాగా షెడ్యూల్‌ వేయడానికి ఇష్టపడతాడు. ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌లాగా స్ర్కిప్టులో తప్పులుంటే దిద్దటానికి ఇష్టపడతాడు. సంగీత దర్శకుడి పక్కనే కూర్చొని ఆనందిస్తాడు. ఇంతటి రసికత ఉన్న వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. వాళ్లకు సక్సెస్‌ రావాలి. సినిమా తెచ్చే డబ్బు ఆయనకు అవసరం లేదు. ఆ స్టేజిని ఆయన ఎప్పుడో దాటిపోయారు. కానీ.. సక్సెస్‌ ఆయనకు మరిన్ని సినిమాలు చేయాలనే కోరికను పెంచుతుంది. అందుకే అలాంటివాళ్లు సినిమాలు చేస్తుండాలి’’ అని త్రివిక్రమ్‌ అన్నారు.

‘‘స్ర్కిప్టును బలంగా చదివే వ్యక్తులను ఇద్దర్నే చూశాను. రామానాయుడు గారు.. రవికిషోర్‌.. స్ర్కిప్టులోని మొదటి సీన్‌ నుంచి చివరి సీన్‌ వరకూ అన్ని గుర్తుపెట్టుకొని చెప్పగలుగుతారు. వాళ్ల దగ్గర కెరీర్‌ ఆరంభంలో పనిచేశాను. నువ్వే కావాలి.. నువ్వు నాకు నచ్చావ్‌.. నువ్వేనువ్వే.. ఒకటి కాదు.. పెద్ద ప్రయాణమే చేశాను. వాళ్ల నుంచి ఎంతో నేర్చుకున్నాను. ‘నాయకన్‌’ అనే సినిమాను తమిళంలో చూసి దాన్ని ఎలాగైనా తెలుగువాళ్లకు చూపించాలని డబ్‌ చేశారు. తెలుగువాళ్లకు కథ చెప్పాలనేదే ఆయన లక్ష్యం. ఆయనను ఎంతో దగ్గరగా చూశాను అందుకే.. ఆయనలోని తపన నాకు అర్థమవుతుంది. ఒక సంస్థ పేరు ఇంటిపేరు కావడమంటే.. ఎంతో గొప్ప అంకితభావం ఉంటే తప్ప ఆ పేరు రాదు. ఆయన ఇంకా ఎన్నో సినిమాలకు నిలబడి.. చాలామందిని ముందుకు తీసుకెళ్లాలి. రామ్‌ కొడుకుతో కూడా సినిమా తీయాలి’’ అని త్రివిక్రమ్‌ ముగించారు.
ఇవీ చదవండి..

మాస్టార్‌ రివ్యూ

ఫస్ట్‌ సిరీస్‌.. లాస్ట్‌ సీన్‌లో సామ్‌..!


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు