close
ఇంటర్వ్యూ
భాషను నిలుపుకొంటూ బతకాలి

‘‘పాట ఎప్పుడూ సరళంగా, భావం గొప్పగా ఉండాలి. రచయితల ఆలోచన, విజ్ఞానం మీద ఇలాంటి భావనలు ఆధారపడి ఉంటాయి. గీత రచనకు ఎంత భాష తెలుసనేది సమస్య కాదు. కానీ పడికట్టు పదాలు, అవే మాటలు ప్రతిసారి రాకుండా జాగ్రత్త పడాలి’’ అంటారు రామజోగయ్యశాస్త్రి. అందమైన ప్రేమపాటల నుంచి లోతైన తాత్విక గీతాల వరకూ... కుర్రాళ్లతో నృత్యం చేయించే పాటల నుంచి ఆలోచింపజేసే స్ఫూర్తిగీతాల వరకూ అన్నింటినీ రాయగలిగిన ప్రతిభ ఆయన సొంతం. ఇటీవలే ‘గురజాడ విశిష్ట పురస్కారం’ అందుకున్న రామజోగయ్యతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి.. 

గాయకుడు కావాలన్న మీ కలకి భిన్నంగా రచయితగా ఎలా మారారు? 
అది నా చిన్నప్పటి కల. ఉద్యోగ రీత్యా బెంగళూరు వెళ్లాక అక్కడ పాటలు పాడే అవకాశాల కోసం ప్రయత్నించేవాణ్ని. అప్పుడే కన్నడ గీత రచయిత శ్రీచంద్ర, గాయకురాలు సుజాత పరిచయమ య్యారు. క్యాసెట్ల రంగంలో వాళ్లకి మంచి పేరుంది. నాకు వాళ్లిద్దరూ స్నేహితులయ్యారు. గాయకుడిగా నా గొంతు పరీక్షించారు. శాస్త్రీయంగా పాటకు నేను సరిపోనని తేల్చారు. నాలో రచయిత కాగలిగే నైపుణ్యం ఉందని గ్రహించారు. గాయకుడిగా కంటే రచయితగా ప్రయత్నించమని నా దారి మార్చారు. నన్ను ప్రోత్సహించి దాదాపు 40 ఆధ్యాత్మిక గీతాల క్యాసెట్లకు పాటలు రాయించారు. అలా నాలోని గాయకుడు పక్కకు తప్పుకొని నెమ్మదిగా గీత రచయిత ఎదిగాడు. 

పాటల మీద ఆసక్తి ఎలా కలిగింది? 
తెలుగునాట పుట్టిన ప్రతి ఒక్కరికి సినిమాల మీద ఆసక్తి ఉంటుంది. నా మీదా సినిమా పాటల ప్రభావం పడింది. మా అమ్మగారు పాటలు పాడేవారు. అవి వింటూ అంతో ఇంతో నేనూ పాడుతుండేవాణ్ని. పుట్టి పెరిగింది పల్లెటూరు కాబట్టి శాస్త్రీయంగా ఎలాంటి అవగాహన లేదు. పైగా నేర్చుకునే వీలు లేదు. అయిదారు తరగతుల్లోనే సినిమాల ప్రభావం మొదలైంది. మా ఊరు గుంటూరు జిల్లా ముప్పాళ్లలో ఓ టూరింగ్‌ టాకీస్‌ ఉండేది. ప్రేమాబి Åషేకం, కొండవీటి సింహం పాటలు తెగ వినిపించేవి. విన్నవి విన్నట్టుగా పాడేవాణ్ని. వాటికి తోడు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాల పీరియడ్‌ ఉండేది. అందులో నా పాట తప్పని సరి. మా బావగారు నాటకాలు వేసేవారు. ఆయనతో వెళ్లేవాణ్ని. నాటకాల్లో వాడే సినిమా పాటలను సాధన చేసేవాణ్ని. ‘ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా’ పాట తెగ పాడేవాణ్ని. పదో తరగతి పూర్తయ్యాక ఇంటర్‌ కోసం నరసరావుపేట వెళ్లా. అక్కడ నాకు నచ్చిన పాటలన్నీ సేకరించి పెట్టుకునేవాణ్ని. బాలుగారి పాటలంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో నచ్చిన పాటలను రికార్డింగ్‌ చేయించుకుని విని నేర్చుకునేవాణ్ని. 
అలా నేర్చుకున్న పాటలు మీకు ఎప్పుడైనా ఉపయోగపడ్డాయా?
వరంగల్‌ ఆర్‌ఈసీలో చదువుతున్నప్పుడు సీనియర్లు ర్యాగింగ్‌ చేసేవాళ్లు. రకరకాల పనులు చేయించేవాళ్లు. నా దగ్గరికి వచ్చే సరికి రామజోగయ్య పాటలు బాగా పాడతాడని ఎవరో చెప్పారు. అయితే ఘంటసాల పాట అందుకొమ్మనేవారు. పాట పాడితే మిగతా విన్యాసాలు చేయించకుండా వదిలిపెట్టేవాళ్లు. ఆ తర్వాత కాలేజీలోని మ్యూజిక్‌ క్లబ్‌లో చేరా. ఓ రోజు స్ప్రింగ్‌ స్ప్రీ అనే కార్యక్రమం జరిగింది. అందులో ‘ఓ పాపా లాలీ... జన్మకే లాలీ’ పాట పాడగానే భాషాభేదం లేకుండా విద్యార్థులంతా చప్పట్లు కొట్టి మెచ్చుకున్నారు. నిన్న పాడింది నువ్వే కదా అంటూ అభినందించేవారు. ఆ రోజు వేసుకున్న చొక్కాను మూడు రోజులు వరుసగా వేసుకున్నా. ఒక వేళ చొక్కా మారిస్తే నన్ను ఎవరూ గుర్తుపట్టరేమోనని! అలా చదువులు పూర్తయ్యాక ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లా.
తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులేంటి?
‘యువసేన’లో తొలిసారిగా రెండు పాటలు రాశా. వాటికి చక్కటి ఆదరణ లభించింది. ఆ తర్వాత ఏడాది పాటు ఏ అవకాశమూ రాలేదు. ఈ శ్రమంతా వృథాయేనా? జీవితం ఇక్కడితో ఆగిపోతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఏదో అలజడి వెంటాడేది. చాలామందిని సంప్రదించా. ఫలితం లేదు. ఆ తర్వాత కల్యాణ్‌రామ్‌ ‘అసాధ్యుడు’కు రాసే అవకాశం వచ్చింది. సంగీత దర్శకుడు చక్రి పరిచయమయ్యారు. శ్రీను వైట్ల ‘ఢీ’లో అవకాశమిచ్చారు. ‘రెడీ, చిరుత, లక్ష్యం’.. ఇలా వరుస అవకాశా లతో నన్ను నేను నిరూపించుకున్నాను. ఇప్పటికి వెయ్యికిపైగా పాటలు రాశాను. 
ఖరగ్‌పూర్‌ ఐఐటీ విద్యార్థిగా ఉద్యోగాన్ని కాదనుకుని రచయితగా మారడానికి ప్రేరణ?
బెంగళూరులో ఉద్యోగం చేసినన్నాళ్లూ రచయితగా సాధన చేస్తుండేవాణ్ని. 8 గంటల ఉద్యోగం... ఆ తర్వాత రాత్రిళ్లు రెండు గంటల పాటు నాకు ఇష్టమైన పనిచేసేవాణ్ని. నాలుగైదేళ్లపాటు ఇదే దినచర్య. ఓ కన్నడ చిత్రాన్ని రవిచంద్రన్‌ తెలుగులోకి అనువదించాలనుకున్నారు. దానికి నాతో పాటలు రాయించారు. రికార్డింగ్‌ కూడా అయిపోయింది. సరిగ్గా అదే సమయానికి నేను పనిచేస్తున్న సంస్థ ఇబ్బందుల్లో పడటం వల్ల బెంగళూరు నుంచి హైదరాబాదు రావల్సి వచ్చింది. రవిచంద్రన్‌ సినిమా కోసం నేను రాసిన పాటలను దర్శకుడు కృష్ణవంశీ ఓసారి విన్నారు. ఆయన ద్వారా సిరివెన్నెల సీతారామశాస్త్రిగారితో పరిచయమైంది. మొదటి పరిచయంలోనే ఆయన దగ్గర శిష్యుడిగా చేరా.
గీత రచనలో సవాళ్లేంటి?
పాటలు రాయడంలో ఉన్న మజానే నాకు నచ్చింది. బాణీ ఉంటుంది. దానికి తగినట్లు పదాలు రాయాలి. అర్థవంతమైన పదాలుండాలి. బాణీలో భావం ఉంటుంది. దాన్ని పట్టుకుని వినగలగాలి. అది మామూలు విద్య కాదు. ఏడుపుగొట్టు బాణీకి సరదా మాటలు రాయం కదా. ఆ భావాన్ని బాణీలో ఒదిగించడం అనేది పజిల్‌ లాంటిది. ఆ బాణీలకు ఎంత గొప్పగా పాట రాశామన్నదే విషయం. ఉన్న పరిధుల మేరకు జాగ్రత్తలు తీసుకుంటాను. అవకాశం ఇచ్చిన వాళ్ల ఉద్దేశం నెరవేరాలి. విలువలకు ఎక్కడా తలొగ్గను. రాసే ప్రతి పాట ద్వారా ఏదో ఒక కొత్త భావం జనాల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తుంటా. ప్రతి పాటకూ ఇబ్బందికర పరిస్థితులుంటాయి. వాటిని సవాలుగా తీసుకుంటా. ఒకసారి రాసి కొట్టేస్తాం. రెండోసారి రాస్తాం. మూడోసారి అదే వస్తుంది. ఈరోజు కాకపోతే రేపు రాస్తాం. కానీ రాస్తాం. కష్టాన్ని ఆస్వాదిస్తే తేలిగ్గా రాయగలం.
సిరివెన్నెల దగ్గర ఎలాంటి మెలకువలు నేర్చుకున్నారు?
శాస్త్రిగారి దగ్గర నేర్చుకోవడం కంటే ఆయన నన్ను శిష్యుడిగా స్వీకరించడం నాలో విశ్వాసాన్ని కలిగించింది. సిరివెన్నెల గారి శిష్యరికం ఓ స్వర్ణయుగం. ఆయన ఎవరితో కూర్చున్నా నన్ను పక్కన కూర్చోబెట్టుకునేవాళ్లు. కథా చర్చల్లో ఉండటం వల్ల ప్రత్యక్ష అనుభవం కలిగేది. వాళ్ల చర్చల్లో ఎంతో కొంత నేర్చుకునేవాణ్ని. ‘ఈయన ఇలా అడిగారు. ఆయన అలా రాశారు. దీన్ని ఇలా మార్చారు’ అని తెలుసుకునేవాణ్ని. శాస్త్రిగారు రాయాల్సిన పాటను ఆయన కన్నా ముందు నేను రాసేవాణ్ని. అది పనికిరాదన్న సంగతి నాకు తెలుసు. కానీ నేను చిరంజీవిగారి పాట రాస్తున్నా అనే ఆనందం కలిగేది. ఉత్తేజం, ఉల్లాసం వచ్చేది. స్ఫూర్తి కలిగేది. తెలిసీ తెలియకుండానే కొంత సాధన జరిగేది. ముఖ్యంగా పాట రాయడం అనేది ఎవరూ నేర్పించరు. అది మనలోనే ఉండాలి. ఉన్న పరిజ్ఞానానికి పదును పెట్టుకోవాలి. ఆ పదును పెట్టే కార్యక్రమం నాకు తెలియకుండానే జరిగిపోయింది. సిరివెన్నెల గారిని చూసి పాట రాయడం కన్నా ఎంత ఏకాగ్రతతో పనిచేయాలి అనేది తెలుసుకున్నా. ఎంత జవాబుదారీగా ఉండాలో గ్రహించా. జవాబుదారీతనం ముఖ్యం. దాంట్లో ఒక గొప్పతనం, తృప్తి ఉంటుంది. ఒక మంచి దారిలో వెళ్తున్నాం. ఏ పద్ధతులకు కట్టుబడితే మనకు కూడా ఆ గౌరవం వస్తుందనేది సిరివెన్నెల గారిని చూసే తెలుసుకున్నా. 


పాట రాయడానికి ఎంత భాష తెలిసి ఉండాలి? మీరు భాష మీద పట్టు ఎలా సాధించారు?
క్లాసు మాసు అందరూ వినేలా అర్థవంతంగా, సరళంగా పాటలు ఉండాలి. అలా చేయాలంటే చాలా సరళంగా రాయాలి. భావంలో గొప్పగా ఉండాలి. ‘‘ఎడబాటై నింగికి ఎగసే ఎదమంటలు చల్లారేలా... దిగమింగవె నీలో నువ్వే కన్నీళ్లను’’ అని రాశాను. ఏడవకు అని చెప్పడానికి ఇన్ని పదాలు వాడాం. ‘గుండె మంటలు చల్లారడం కోసం కన్నీళ్లను దిగమింగవే’ అని చెప్పాం. ఇందులో అర్థం కాని మాటలేమీ లేవు. పాటకు ఎంత భాష తెలుసనేది సమస్య కాదు. కానీ పడికట్టు పదాలు రాకుండా జాగ్రత్తపడాలి. దినపత్రికలు చదవడం, ఎదుటి మనిషితో మాట్లాడటం, టీవీ చూడటం, ఇంకో పాట వినడం వల్ల విషయ పరిజ్ఞానాన్ని పొందవచ్చు. ఒకాయన ఏదో మాండలికంలో మాట్లాడుతుంటే అదేంటని అడుగుతాను. దాని వల్ల నాకో కొత్త మాట తెలుస్తుంది. సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటాను. కొన్ని అరుదైన సందర్భాలు వస్తాయి. అల్లూరి పాట రాశామనుకుందాం. అగ్నిజ్వాలలు, ప్రళయకీలలు అనే ఉద్వేగపూరిత భాష ఉండాలి. ఇలాంటివి సినిమా పాటల్లో వాడాలంటే పుస్తకాలు చదవాలి. సినిమా అవసరాన్ని బట్టి పది పాటలు ఒక రకంగా వస్తే ఒక పాట మరో రకంగా రాయాల్సి వస్తుంది. దానికి తగిన భాషలో దాన్ని రాయాలి.
ప్రస్తుతం పాటల రచయితలకు ఎలాంటి ప్రాధాన్యం లభిస్తోంది?
నేనూ, అనంతశ్రీరాం ఒకే సమయంలో పరిశ్రమలోకి అడుగుపెట్టాం. ఆ సమయంలోనే ప్రసార మాధ్యమాల సంఖ్య పెరిగింది. ఆడియో వేడుకల తీరు మారింది. ఓ వేడుక జరిగితే వారం రోజులపాటు పునఃప్రసారం చేస్తున్నారు. మూడు గంటల కార్యక్రమం తయారుచేసి రోజంతా వేస్తున్నారు. ఎక్కడా లేని ఆదరణ లభిస్తుంటుంది. కానీ మనం కనిపించేది మన పనిలోనే. లేదంటే జనాలు మరచిపోతారు. ఎప్పటికీ నిలబడేది... మనల్ని నిలబెట్టేది మన పనితీరే. మన కోసం మనం ఇష్టంగా కష్టపడితే అదే పేరు తీసుకొస్తుంది. మనం ఎంత శ్రమపడతామో తర్వాత అంత ఆనందంగా ఉంటాం. వచ్చే ఎలాంటి కష్ట్టాన్నయినా ఆహ్వానిస్తూ పని చేయడానికి సిద్ధంగా ఉంటాం. 


మీరు మొదట భక్తి పాటలు రాశారు కదా.. వాటి కోసం ఎలాంటి కసరత్తు చేసేవారు?
పెద్దగా ఏం లేదు. శివుడి మీద పాట రాయాలంటే శివుడి గురించి తెలిసుండాలి. తెలియకపోతే తెలుసుకుని రాసేవాణ్ని. పాట పూర్వాపరాలు తెలుసుండాలి. ఒకవేళ తెలియకపోయినా తప్పేం కాదు. తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. అందుకు సంబంధించిన పుస్తకాలను చదవడం వల్ల ఆ పాట రాయగలం. అన్నింటి కంటే భావన బలమైంది. పాటంటే ఒక ఆలోచనను చెప్పడం. ‘‘నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి’’ అనే పాట ఉంది. ఆ పాట భావన ఎంతో ముద్దుగా ఉంటుంది. ‘నేను పిలిస్తే పలకడం లేదమ్మా మీ ఆయన... నువ్వు చెబితే ఏమన్నా వింటాడేమో ఒకసారి చెప్పొచ్చుగా నా తరఫున’ అనేది భావన. అదే శ్రోతల మనసును చూరగొంటుంది. ఈ భావనకే ఓట్లు పడతాయి. మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఎలా వినియోగిస్తున్నామనేది ప్రధానం. అలాగే ‘‘యమున ఎందుకే నీవు అంత నలుపెక్కినావు రేయి కిష్ణయ్యతో కూడావా’’ అని ఆత్రేయ ఎంత చక్కగా ముడిపెట్టారో. యమున నల్లగుంటుందో లేక కృష్ణుడు నల్లగుంటాడో తెలియదు. ఆ భావనను అలా వాడారు ఆత్రేయగారు. 
మీ పాటల ప్రయాణంలో అప్పటికీ ఇప్పటికీ మీలో వచ్చిన మార్పులేంటి? 
రకరకాల పద్ధతుల్లో పాటలు రాయాలనేది నా ఆలోచన. దానికి తగ్గట్టుగా ఒకటికి నాలుగు రకాలుగా పాటలు రాసే అవకాశాలు వస్తున్నాయి. ‘‘సదా శివా సన్యాసి’’ పాట అలాంటిదే. ఇలాంటి పాటలు కూడా రామజోగయ్య రాస్తారని పేరొచ్చింది. నన్ను నేను తెలుసుకునే అవకాశం వచ్చింది. పోనుపోను కొంచెం పరిణతి వస్తుంది. దాని ద్వారా కొంత జవాబుదారీతనం పెరిగింది. మన పాటే మనకు ఇంకా కొత్తగా రాయాలి అనిపిస్తుంటుంది. సవాలుగా తీసుకోవాలని అనిపిస్తుంటుంది. బాధ్యతాయుతంగా ప్రవర్తించడం మొదలవుతుంది. నా ద్వారా చెడు వెళ్లకూడదనేదే నా తపన. చెడును ప్రేరేపించే పాటలను రాయను. సన్నివేశాన్ని బట్టి గొప్పగా రాయడానికి అంతులేదు.
నేను సమాజంలో భాగం కాబట్టి దానికి అంతో ఇంతో మేలుచేసేలా నా పనిని నిర్వహించాలనుకుంటాను. మా గురువు గారి నుంచి పొందిన ప్రేరణ అది. తన సాహిత్యాన్ని సమాజ సంస్కరణ కోసమే వినియోగించిన గురజాడ లాంటి మహావ్యక్తి పేరిట పెట్టిన పురస్కారం లభించడం నా బాధ్యతను మరింత పెంచింది
మీరు రాసిన వాటిలో మీకు తృప్తినిచ్చిన పాటలు?
పా పాటా నాకు ఇష్టమే. కొరటాల శివ ‘జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్‌ అనే నేను’ చిత్రాల్లోని పాటలు ఓ ప్రయోజనాన్ని ఆశించి ఉంటాయి. వాటిని విన్నప్పుడల్లా శాస్త్రిగారు మెచ్చుకుంటారు. ప్రతి పాటనూ ఆస్వాదిస్తుంటారు. ‘ప్రణామం, వచ్చాడయ్యా స్వామి, భరత్‌ అనే నేను’ పాటలు బాగా నచ్చుతాయి. శ్రోతల ఆలోచనా ధోరణి మారుతోంది. మంచి పాట ఇస్తే చాలా ఆదరిస్తు న్నారు. చేయాల్సిందల్లా దర్శకులు, రచయితలు మంచి సందర్భాలను సృష్టించడం. అర్థవంతమైన పాటలు రాయించడం. అలాగే రాన్రానూ వాణిజ్య పాటలకు కాలం చెల్లుతోంది. ఎంత గొప్పగా పాట రాస్తే అంత ఆదరణ లభిస్తోంది. 
మీ పాటల్లో ఇతర భాషా పదాలు ఎక్కువగా ఉంటాయనే వాదన ఉంది. మీరేమంటారు?
నా పాటలు నలుగురికి చేరాలనే అక్కడక్కడా ఆ పదాలు వాడుతుంటాను. అయితే.. ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల ఇబ్బంది పడే దుర్భలమైన భాష కాదు మన తెలుగు. అలా అన్ని పాటలూ రాసినా బాగుండదు. అచ్చతెలుగులో చాలా పాటలు రాశాను. ‘భలేభలే మగాడివోయ్‌’లో ‘మొట్టమొ దటిసారి’, ‘ఎందరో మహానుభావులు’ పాటలు అలాంటివే. నిజానికి సినిమాల వల్లే తెలుగు భాష విస్తృతమవుతోంది. జనసామాన్యంలో ఉన్న ఆంగ్ల పదాలనే సినిమాల్లో వాడుతు న్నారు. వాటితో తెలుగు మీద దుష్ప్రభావం ఉంటుందనుకోను. అవకాశం వచ్చినప్పుడల్లా గీతరచయితలు ప్రస్తుతం వాడుకలో లేని నాలుగు మంచి మాటలతో మన భాష గొప్పదనాన్ని చాటి చెబుతున్నారు. అయితే ఈ సందర్భంలో గీత రచయితలంతా జవాబుదారీగా ఉండాలి. మన పద్ధతిని, మన భాషను నిలుపుకుంటూ బతకాలి. 
ఇప్పుడొస్తున్న యువ గీత రచయితల్లో మీరు గమనించిన అంశాలేంటి? సినీ గీత రచయితగా ఎదగడానికి అవసరమైన అంశాలేంటి?
కొత్త కుర్రాళ్లందరూ బాగా పాటలు రాస్తున్నారు. మంచి పాటలు వస్తున్నాయి. కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటే ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా గీత రచయితలంతా కృషి చేస్తున్నారు. అలాగే సినీ గేయ రచయితగా ఎదగాలంటే విషయం పట్ల ఆసక్తి ఉండాలి. అర్హత ఉండాలి. బస్సు డ్రైవర్‌ను చూడగానే డ్రైవర్‌ అవుతా అనుకోవడం కాదు. దాని పట్ల ఆసక్తి ఉండాలి. శ్రమకు ఓర్చుకోగలిగే తత్వం ఉండాలి. పూర్వ రచయితల సాహిత్యాన్ని చదువుతుండాలి. వర్తమాన వ్యవహారాల మీద పట్టు ఉండాలి. నిరంతరం సాధన చేస్తుండాలి. ఈ ప్రక్రియలో మనదైన కొత్త గొంతును వినిపించాలి. నిబద్ధతతో పనిచేయాలి. అప్పుడే గీత రచయితగా నిలదొక్కుకొని తలరాతను మార్చుకోవచ్చు. 
తెలుగునాట అందరూ ఆంగ్ల జపం చేస్తున్నారు కదా..! 
ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఆంగ్లం అవసరం. కాన్వెంట్‌ బడుల్లో చదివే  పిల్లలతో తలిదండ్రులు కూడా ఆంగ్లంలోనే మాట్లాడుతున్నారు. అలాంటి  వాళ్లలో మార్పు తీసుకురావాలి. మన భాషలోనే మాట్లాడుకోవాలి. పిల్లలకు తెలుగు భాషతో సంబంధాలు 
తెగిపోకుండా చూడాలి.

 
 


దండవేణి సతీష్‌
హైదరాబాదు, 80081 12353 
teluguvelugu.in


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.