‘మురారి’ కథను అలా డెవలప్‌ చేశారు! - behind the story of murari movie
close
Published : 31/10/2020 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మురారి’ కథను అలా డెవలప్‌ చేశారు!

హైదరాబాద్‌: మహేశ్‌బాబు కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘మురారి’. సోనాలి బింద్రే కథానాయిక. 2001 ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అసలు ఈ సినిమా కథ ఎలా సిద్ధం అయ్యింది? అసలు ‘మురారి’ అని పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తదితర విషయాలను ఓ సందర్భంలో కృష్ణవంశీ పంచుకున్నారు.

‘‘ప్రతి సినిమాలో విలన్‌ను హీరో చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే, ఈ సారి అతడు మనిషై ఉండకూడదనుకున్నాం. ఒక ఫోర్స్‌ అవ్వాలి. దానిని ఎలా జయించాలో ఎవరికీ తెలియకూడదు. చివరి నిమిషం వరకూ థ్రిల్‌ పాయింట్‌ కొనసాగాలి. హీరో ఆ గండం నుంచి ఎలా బయటపడతాడా? అని ప్రేక్షకుడు చివరి వరకూ ఉత్కంఠతో చూస్తూ ఉండాలి. జనానికి, ప్రపంచానికి మంచి చేసే ఒక దేవత కోపానికి కారణమైన ఓ వ్యక్తి ఆ శాపం నుంచి ఎలా బయటపడ్డాడన్న దాని నుంచి అనుకుని ‘మురారి’ కథను డెవలప్‌ చేశాం. మైథలాజికల్‌ కథలో మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా చూపించాం. ఆ సమయంలో మహేశ్‌బాబు రూపం ముగ్ధ మనోహరంగా ఉంటుంది. ఆయన్ను చూడగానే బృందావనం గుర్తొచ్చింది. అందుకే ‘మురారి’ అని పెట్టాం’’ అని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.

ఆ పాట చివర్లో వద్దని గొడవ చేశారట

‘మురారి’ సినిమా పరంగానే కాదు, మ్యూజికల్‌గానూ మంచి హిట్‌ అందుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన పాటలు ఎవర్‌గ్రీన్‌. ముఖ్యంగా ‘అలనాటి రామచంద్రుడి..’ పాట ఇప్పటికీ పెళ్లి వేడుకల్లో మార్మోగుతూనే ఉంటుంది. అయితే, ఈ పాటను క్లైమాక్స్‌ ముందు వద్దని అందరూ అన్నారట. అయితే, పట్టుబట్టి కృష్ణవంశీ ఈ పాటను పెట్టించారు. ‘‘మురారి’కి ముందు మహేశ్‌బాబుకు రెండు ఫ్లాప్‌లు ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మన తెలుగు కమర్షియల్‌ సినిమా ప్రకారం.. క్లైమాక్స్‌ ముందు మాస్‌ సాంగ్‌ ఉండాలి. కానీ, నేను ‘అలనాటి రామచంద్రుడి..’ పాట చివర్లో పెట్టాను. అందరూ వద్దని చెప్పారు. మొహమాటంతో మహేశ్‌బాబు కూడా నాకు చెప్పలేని పరిస్థితి. ఒకసారి ఆ విషయాన్ని ప్రస్తావిస్తే, ఆయన్ను ఒప్పించాను. అయితే, చివరకు కృష్ణగారి వరకూ పంచాయితీ వెళ్లింది. ‘అబ్బాయ్‌.. చివర్లో మాస్‌ సాంగ్‌ లేకపోవడం కరెక్ట్‌ కాదు కదా! అనవసరంగా ప్రయోగం చేస్తున్నావు’ అన్నారు’’

‘‘సర్‌ ఇప్పుడు మన ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ‘ఒకటి ఈ సినిమా, పాటను నన్ను చేయనీయడం’. రెండోది ‘ఈ సినిమాను ఇక్కడే వదిలేసి వెళ్లిపోతా. మీరు కమర్షియల్‌ సాంగ్‌ చేసి విడుదల చేసుకోండి. నా పేరు కూడా వేయొద్దు. ఎందుకంటే నేను చేసే ఈ పాట దశాబ్దాల పాటు ఉండిపోతుంది. మీ అబ్బాయి కెరీర్‌కు కావాలంటే ఆ చండాలాన్ని పెట్టుకోండి. నేను వెళ్లిపోతా’ అని అన్నాను. చివరకు కృష్ణగారు ఒప్పుకొన్నారు. సినిమా విడుదలైన తర్వాత అందరూ మెచ్చుకున్నారు’ అని ఆ పాట చివర్లో పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని చెప్పుకొచ్చారు కృష్ణవంశీ.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని