శేఖర్‌ కమ్ములకు కోపం వస్తే..? - what sekhar kammula will do if gets angry
close
Published : 18/05/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శేఖర్‌ కమ్ములకు కోపం వస్తే..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా డైరెక్టర్లకు కోపం రావడం సహజం. వాళ్లు అనుకున్నట్లుగా సన్నివేశం రాకపోయినా.. కోరుకున్నట్లుగా నటీనటులు హావభావాలు పలికించకపోయినా వాళ్లు కొంత అసహనానికి గురవుతుంటారు. మరి ఎప్పుడు చూసినా ఎంతో కూల్‌గా కనిపించే డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ములకు కోపం వస్తే ఏం చేస్తారు..? ఆయన ఆశించిన దానికంటే దారుణంగా సీన్‌ వచ్చినప్పుడు ‘యాక్‌’ అంటారట. ప్రముఖ నటుడు రానా వ్యాఖ్యాతగా ‘ఆహా’లో ప్రసారమయ్యే ‘నం.1 యారి’ కార్యక్రమంలో ‘లవ్‌స్టోరీ’ టీమ్‌ పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ముల గురించి హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సాయిపల్లవి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

శేఖర్‌ కమ్ముల ప్రత్యేకత ఏంటి? అని సాయిపల్లవిని అడగ్గా.. ‘‘ఆయన విషయంలో నేను కొంచెం పొసెసీవ్‌. సెట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చైతూను మెచ్చుకుంటే నేను శేఖర్‌ కమ్ములగారి వైపు కోపంగా చూస్తుంటా. అసలు నాకు సంబంధం లేని విషయాల్లో కూడా ఆయనకు సలహాలు ఇస్తాను. ఆయన దానికి ఎలా స్పందిస్తారా..? అని ఎదురుచూస్తుంటా’’ అని సాయి పల్లవి చెప్పింది. ‘‘నేను ఎవర్నీ ఎక్కువగా పొగడను. గుడ్‌ అని చెప్తా అంతే. నాకు సీన్‌ నచ్చకపోతే మానిటర్‌ దగ్గర్నుంచి వెళ్లిపోతా’ అని శేఖర్‌ కమ్ముల చెప్తుండగా.. నాగచైతన్య కల్పించుకొని ‘‘దాదాపు ‘గుడ్‌’ అంటారు. ఈ మధ్య ‘యాక్‌’ అనే పదం నేర్చుకున్నారు’’ అని చెప్పారు. మరోవైపు నుంచి రానా స్పందిస్తూ.. హమ్మయ్య మనం మాత్రం ‘యాక్‌’ అనిపించుకునేంత దారుణంగా ఎప్పుడూ చేయలేదనడంతో షోలో నవ్వులు పూశాయి. దీనికి సంబంధించిన వీడియోను ఆహా తన యూట్యూబ్‌ ఛానల్‌లో పంచుకుంది.

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ‘లవ్‌ స్టోరీ’ తెరకెక్కుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని శ్రీవేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై నారాయణ్‌ దాస్‌ కె.నారంగ్‌, రామ్‌ మోహన్‌రావు నిర్మించారు. పవన్‌ సంగీతం అందించారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సారంగ దరియా, నీ చిత్రం చూసి.. పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని